Suryaa.co.in

Telangana

సీఎంకు మంత్రివర్గ విస్తరణ చేసే దమ్ము లేదు

మంత్రికి సిగ్గు ఉండాలి
– గురుకులాల్లో విషాహారానికి బీ ఆర్ ఎస్ కుట్ర అనడానికి సిగ్గుండాలి
– ఏ శాఖ కు పని లేదు ..పోలీసులకు తప్ప
– పిల్లలకు అన్నం కూడా సరిగా పెట్టలేని దద్దమ్మ ప్రభుత్వం
– కోదండరాం కైనా సీఎం విద్యా శాఖను కేటాయించాలి
– గురుకులాలను జైళ్లుగా మారుస్తున్నారా?
– మాజీ మంత్రి జి .జగదీష్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ,బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్: ఏడాది కాలం లో రేవంత్ ప్రభుత్వ సత్తా ఏమిటో తెలిసిపోయింది. కేవలం పోలీసులతో పాలన చేస్తున్నారు. కేసీఆర్ ను రావాలి రావాలి అని అడుగుతున్నారు .ఏదో సాధించినట్టుగా. గురుకులాల్లో స్థితిగతులను అధ్యయనం చేయడానికి వెళితే విద్యార్ధి సంఘాలను అడ్డుకుంటున్నారు.

కేసీఆర్ హాయం లో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వం లో గురుకులాలు అద్భుతంగ తీర్చిదిద్దబడితే రేవంత్ ప్రభుత్వం వాటిని నాశనం చేస్తోంది. కేసీఆర్ హయం లో గురుకుల విద్యార్థులు ఎవరెస్టు తో పాటు కిలిమంజారో పర్వతం అధిరోహించారు. గురుకులాల్లో అద్వాన్నంగా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వం లో కమిటీ వేశాం.

మా విద్యార్ధి విభాగం గురుకులాల్లో సమస్యలు అధ్యయనం చేస్తే రేవంత్ రెడ్డి కి వచ్చిన ఇబ్బంది ఏమిటీ ? అసెంబ్లీ సమావేశాలున్న నేపథ్యం లో ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడానికే మా బృందాలు పర్యటిస్తున్నాయి. గురుకులాల్లో అన్నీ బాగుంటే రేవంత్ ఈ పర్యటనలు ఎందుకు అడ్డుకుంటున్నారు ?

విద్యార్థులను కలిసేందుకు మా వాళ్ళను రేవంత్ రెడ్డి ఆపుతున్నారు. విద్యార్థులే రోడ్ల మీదకు వస్తున్నారు. ఎంత మందిని అడ్డుకుంటావు ? మేము అక్కడికి ధర్నాలు చేయడానికో తరగతుల బహిష్కరణకో వెళ్లడం లేదు. లగచర్ల కు వెళతామంటే అనుమతి ఇవ్వరు. మహబూబా బాద్ లో మా మీటింగ్ కు అనుమతివ్వరు.

ఎన్ని రోజులు ఈ నిర్బంధాలు ,ఎంత కాలం ఈ మోసాలు? స్కూలు పిల్లలకు అన్నం కూడా సరిగా పెట్టలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. రైతు రుణమాఫీ పది కోట్ల రూపాయల మేర కూడా కాలేదు. ఎవరొస్తారో రండి చర్చకు. వడ్ల కొనుగోలు పై ఇప్పటికీ లెక్కలు చెప్పడం లేదు.

రైతు భరోసా కన్నా బోనస్ బాగుందని చెప్పడానికి మంత్రికి సిగ్గు ఉండాలి. ఏ శాఖ కు పని లేదు ..పోలీసులకు తప్ప!దోచుకుని ఢిల్లీకి మూటలు పంపడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏదీ చేతకావడం లేదు. ఏం చేశారని సంబురాలు చేసుకుంటున్నారు ? ఢిల్లీ బానిసలకు అధికారం అప్పజెప్పొద్దని కేసీఆర్ మొత్తుకున్నారు.

ఏడాది లో సీఎం 30 సార్లు ఢిల్లీ వెళ్లారు ?ఏం సాధించారు ? సోషల్ మీడియా లో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారు. మా విద్యార్ధి విభాగం నాయకుల గురుకులాల సందర్శనను పోలీసులు అడ్డుకోవద్దని మనవి. బూటకపు ఎన్ కౌంటర్లు ఎక్కడా జరిగినా తప్పే. కేసీఆర్ హాయం లో ఒక ఎన్ కౌంటర్ జరిగితే పొలీసు ఉన్నతాధికారులకు క్లాస్ తీసుకున్నారు. ఆ తర్వాత తొమ్మిదిన్నరేళ్ళ కేసీఆర్ పాలన లో ఒక్క ఎంకౌంటర్ జరగలేదు.

రేవంత్ పాలనలో జరిగిన ఎన్ కౌంటర్ లో14 మంది చనిపోయారు. ఏ ఎన్ కౌంటర్ పై నైనా ఆరోపణలు వస్తే కచ్చితంగా విచారణకు ఆదేశించాలి. ప్రభుత్వాన్ని నడిపేది బీ ఆర్ ఎస్ యే అయినట్టు ..కాంగ్రెస్ నేతలు ప్రతి అంశం లో మా కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. గురుకులాల్లో విషాహారానికి బీ ఆర్ ఎస్ కుట్ర అనడానికి సిగ్గుండాలి. పాలన చేత కాకనే బీ ఆర్ ఎస్ పై నిస్సిగ్గుగా విమర్శలు చేస్తున్నారు.

వివిధ శాఖలకు మంత్రులు లేకపోవడం కూడా ప్రభుత్వ వైఫల్యాలకు ప్రధాన కారణం. విద్యా శాఖకు మంత్రి లేకపోవడం ఏమిటీ ? విద్యా శాఖ కీలకమైందన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు. రేవంత్ రెడ్డి కి దేనిపై పట్టింపు లేదు.వేరే విషయాలపై ఆయనకు శ్రద్ద ఉంది. విద్యా శాఖ మంత్రిగా ముఖ్యమంత్రే ఉండటం దుర్మార్గం.

సీఎం కు మంత్రివర్గ విస్తరణ చేసే దమ్ము లేదు ..కనీసం వేరే మంత్రులకు విద్యా శాఖ అప్పగించాలన్న ఇంగితం సీఎం కు లేదు. ప్రజలు కేంద్రం గా రేవంత్ ప్రభుత్వం పని చేయడం లేదు. తనకిష్టమైతే తప్ప మంత్రులను సీఎం కలవడం లేదు. ఇక అధికారులను ఏం కలుస్తారు ? కనీసం కోదండరాం కైనా సీఎం విద్యా శాఖను కేటాయించాలి. తన శత్రువులుగా ఉన్న మంత్రులకైనా ఇవ్వాలి.

ఇప్పటికైనా సీఎం రేవంత్ సోయి తెచ్చుకుని పాలన చేయాలి. గురుకులాల్లోని విద్యార్థుల తల్లి దండ్రులు తమ బిడ్డల భవిష్యత్ పై ఆందోళనగా ఉన్నారు. ఆదివారం నాడు తమ పిల్లలను గురుకులాల్లో కలిసేందుకు తల్లిదండ్రులకు అనుమతివ్వరా? గురుకులాలను జైళ్లుగా మారుస్తున్నారా?

LEAVE A RESPONSE