– ఎన్నికలమందు సూపర్ సిక్స్ సహా అనేక హామీలు
– అధికారంలోకి రాగానే హామీలు అటకెక్కించిన బాబు
– అన్ని వర్గాల ప్రజలతో పాటు రైతులకూ మొండిచేయి
– పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న ఏ పంటకూ లేని మద్ధతు ధర
– నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
నెల్లూరు: కూటమి ప్రభుత్వ పాలనలో సీఎం చంద్రబాబు అన్నదాతల మీద పగబట్టినట్టు వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలతో పాటు రైతులను కూడా చంద్రబాబు మోసం చేశారని ఆక్షేపించారు. నెల్లూరు వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని.. పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న ఏ పంటకూ లేని మద్ధతు ధర లేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు.
వైయస్.జగన్ హయాంలో వ్యవసాయరంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామన్న ఆయన… అన్నదాతలకు అండగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనం నుంచి విక్రయం వరకు చేయూతనిచ్చామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు రైతులకు ఎగ్గొట్టిన పెట్టుబడి సాయాన్ని అందించడంతో పాటు, ఇ-క్రాప్, ఉచిత పంటల బీమా, ధరల స్థిరీకరణ నిధిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైతుల పరిస్థితి రాష్ట్రంలో అత్యంత దయనీయంగా తయారైంది. అన్ని విధాలుగా రైతులు నష్టపోతున్నా… రైతులన్నా, వ్యవసాయమన్నా చంద్రబాబు అంటరానివారుగా పరిగణిస్తున్నారు.
తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, తీవ్రమైన నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోతుంటే… ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లైనా లేదు. ప్రధాన పంటలతో పాటు రైతులు సాగుచేస్తున్న ప్రత్తి, వేరుశెనగ, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర వచ్చే పరిస్ధితి కనిపించడం లేదు. రాష్ట్రంలో వ్యవసాయం చేసే రైతు ఏ పంట వేసినా కనీస గిట్టుబాటు ధర లభించే పరిస్థితి లేదు. జూన్ 2024 నుంచి సూపర్ సిక్స్ అమలు చేస్తానన్న హామీ గుర్తుందా చంద్రబాబూ? అదే సమయంలో రైతుకి ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు.
అంటే రెండేళ్లలో ఒక్కో రైతుకి రూ.20వేలు బాకీ పడ్డావ్? మొన్న రూ.5వేలు గతంలో మరో రూ. 5వేలు వేసి దండోరా వేసి ప్రచారం చేసుకుని తిరుగుతున్నావ్ తప్ప, వారికివ్వాల్సిన రూ.20వేలు గురించి నువ్వు, నీ అనుకూల మీడియా కూడా మాట్లాడ్డం లేదు? కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రూ.20వేలు ఇస్తానని చెప్పిన ఎగ్గొట్టిన చంద్రబాబు… ఇప్పుడు మాటమార్చి కేంద్రం ఇస్తానన్న దానితో కలిపే రూ.20 వేలు అని చెబుతున్నారు. . ఇదే విషయం ప్రశ్నిస్తే ఎవరూ సమాధానం చెప్పలేదు. వైయస్.జగన్ హయాంలో కౌలు రైతులకు, అటవీభూములకు, అసైన్డ్ భూములు, డీకేటీ భూముల్లో సాగు చేస్తున్న వారికి కూడా రైతుభరోసా అందిస్తే.. చంద్రబాబు వారందరికీ ఎగ్గొట్టారు. రీ సర్వేపేరుతో వెబ్ ల్యాండ్ ను హైడ్ చేస్తున్నారు.
రైతులకు సంబంధించి రీ సర్వే జరుగుతున్న భూముల్లో ఫైనల్ నోటిఫికేషన్ అయి, ఆర్వో అయినంతవరకు ఆ రైతులకు అన్నదాత సుఖీభవ రాదు. ఇక డీకేటీ, ప్రభుత్వభూములని వ కాలమ్ లో ఉంటే వారికి కూడా పెట్టుబడి సాయం అందడం లేదు. ఇలా రకరకాలుగా నిబంధనలు పెట్టి లక్షల సంఖ్యల్లో అన్నదాత సుఖీభవ పథకానికి ఎగనామం పెట్టారు. దానికి సంబంధించి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసుకుంటే దానికి కూడా అతీ, గతీ లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 7 లక్షల మంది రైతులు ఈ పథకానికి దూరమయ్యారు. చివరకు ప్రభుత్వం ప్రకటించిన 46.85 లక్షల మందికైనా సక్రమంగా జమ చేసిందా అంటే అది కూడా లేని పరిస్థితి… జాబితాలో తమ పేర్లు ఉన్నా డబ్బులు అకౌంట్ లో జమ కాలేదని రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దుస్థితి.