– కరెంట్ కట్ లు, లో ఓల్టేజ్ సమస్యల పరిష్కారానికి చర్యలు
– ఐదేళ్ల వైసీపీ హయాంలో విద్యుత్ శాఖ నిర్వీర్యం
– అవసరమైన ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు, లైన్లు
– తూర్పు గోదావరి విద్యుత్ అధికారుల సమీక్షలో మంత్రి గొట్టిపాటి
రాజమహేంద్రవరం: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు విద్యుత్ సరఫరాల్లో ఇబ్బందులు లేకుండా చూడటమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పలు అంశాలపై చర్చించి, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో జరుగుతున్న పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పనులు, ఆర్డీఎస్ఎస్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో సూర్యఘర్, కుసుమ్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకున్న అన్నదాత లందరికీ వ్యవసాయ కనెక్షన్లను మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
సమీక్ష సమావేశం అనంతరం మంత్రి గొట్టిపాటి మీడియా తో మాట్లాడుతూ…విద్యుత్ అంతరాయాలు, లో ఓల్టేజ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. అవసర మైన ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణంతో పాటు అదనపు ట్రాన్స్ ఫార్మార్లు, అవసరమైన లైన్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. రాజమండ్రి వేదికగా రాబోయే గోదావరి పుష్కరాలకు విద్యుత్ అధికారులు ఇప్పటి నుంచి సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
విద్యుత్ శాఖపై అపోహలు సృష్టిస్తున్నారు
ఐదేళ్ల గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖను నిర్వీర్యం చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. విద్యుత్ శాఖపై కొందరు అపోహలు సృష్టించి గందరగోళం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు 75,000 వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చామన్న మంత్రి తెలిపారు. రైతులపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. విద్యుత్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అవసరమైతే అదనపు సిబ్బందిని కూడా నియమిస్తామని స్పష్టం చేశారు.
పారిశ్రామిక, వ్యాపార ప్రాంతాల్లో వచ్చిన ఫిర్యాదులు, సమస్యలపై వెంటనే తనిఖీలు చేసి పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. అదే విధంగా శాఖాపరమైన, నిర్వహణా పరమైన ఇబ్బదులు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరిస్తామని విద్యుత్ శాఖ సిబ్బందికి మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఏపీ ఐ ఐ సి చైర్మన్ మంతెన రామ రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణతో పాటు విద్యుత సంస్థ ఎస్ ఈ కే తిలక్ కుమార్, ఇతర విద్యుత్ సంస్థ అధికారులు పాల్గొన్నారు.