– అమరావతి బహుజన జెఎసి హెచ్చరిక
ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేసిన వైకాపా ప్రభుత్వం మళ్ళీ కొత్తగా మూడు రాజధానులు బిల్లు తెస్తున్నట్లు లీకులు ఇస్తుందని, అదే జరిగితే వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల చితి మంటల్లో కాలి పోక తప్పదని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య హెచ్చరించారు .
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండేళ్లుగా రాజధాని అమరావతి లో రాజకీయాలు చొప్పించి, ప్రజలను కాల్చుకు తిన్నారని, విశాఖపట్నం వెళ్ళే దమ్ము లేక న్యాయస్థానాల్లో సమాధానం చెప్పలేక మూడు రాజధానులు బిల్లు వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. సినీమా టికెట్లపై సినీ ప్రముఖులను కాళ్ళబేరానికి రప్పించి, వారితో రాజధాని విశాఖపట్నం వెళ్తున్నట్లు చెప్పటాన్ని తప్పుపట్టారు .
పూట గడవక పార్కులను, స్థలాలను, రాజధాని భూములను,భవంతులను తాకట్టు పెట్టుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం సినీ నటులకు ఇళ్ళ స్థలాలు, స్టుడియో నిర్మాణాల కొరకు భూములు ఇస్తామని నమ్మబలకటం మోసపూరిత చర్యగా అభివర్ణించారు. రాజధాని అమరావతికి ద్రోహం చేస్తే, మూడు రాజధానులు బిల్లు మళ్ళీ తెస్తే, రెండింతల ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.