ఎంపీ విజయసాయిరెడ్డి
అక్టోబర్ 17: కాంగ్రెస్ పార్టీ పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఏనాడూ పాటుపడింది లేదని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఆ పార్టీ దారుణ ఓటమి చవిచూస్తుందని విజయసాయి రెడ్డి చెప్పారు. సోషల్ మీడియాలో మంగళవారం ఈ అంశంపై ఆయన తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో రాజస్థాన్ ప్రజలు కాంగ్రెస్ హయాంలో చెత్త పరిపాలనను చవిచూశారని అన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కర్ణాటకలో అన్ని అభివృద్ది పనులు ఆగిపోయాయని దీంతో అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజలను పట్టించుకోవడం మానేసి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి నిధులు సమకూర్చడంలో ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం బిజీ ఉందని అన్నారు. కాంగ్రెస్ పరిపాలనలో మధ్యప్రదేశ్ ఎప్పుడూ ఒక వెనుకబడిన రాష్ట్రంగానే ఉండిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన స్కాంలు, కుంభకోణాలు, దుష్ట పరిపాలన దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్ర ప్రజలు ఆ పార్టీని ఎప్పటికీ క్షమించలేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేవలం కలలు మాత్రమే కనగలదని విజయసాయి రెడ్డి అన్నారు.