– కృష్ణా జలాల వాటా పై సీఎం రేవంత్ ఒక మాట, మంత్రి ఉత్తం మరో మాట
– పూట పూటకో మాట ఘడియ ఘడియకో లెక్క
– 299 టీఎంసీ కృష్ణ జలాల్లో వాటా ఒప్పుకొని తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనే
– చారిత్రక తప్పిదం చేసింది మీరు, తెలంగాణ సాగు నీటి రంగం చరిత్రలో ద్రోహులు మీరు
– సమ్మక్క సాగర్ పూర్తి చేసింది బీఆర్ఎస్, డబ్బా ప్రచారం చేసుకుంటున్నది కాంగ్రెస్
– చంద్రబాబుకు భయపడి బనకచర్ల పై మౌనం
– కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఆల్మట్టి ఎత్తు పెంపు పై మౌనం
– రేవంత్ రెడ్డికి సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే, పక్క రాష్ట్ర ప్రయోజనలే ఎక్కువా?
– మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం
హైదరాబాద్ : కృష్ణా జలాల్లో వాటా విషయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మల్లా పాత పాటే పాడిండు. ఉత్తర కుమార ప్రగల్భాలే పలికిండు. బేసిన్ల గురించి బేసిక్స్ తెల్వదు, నీళ్ల వాటా గురించి నీళ్లు నములుతారని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. కనీస అవగాహన లేని, తెలంగాణ సోయి లేని ఇట్లాంటి దద్దమ్మలు మనకు ముఖ్యమంత్రి, నీళ్ల మంత్రి కావడం మన దౌర్భాగ్యమన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం విలేఖర్లతో మాట్లాడారు.
ఉత్తం కుమార్ రెడ్డి నిన్న ఏం మాట్లాడిండు.. కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేసినం అని గొప్పగ చెప్పిండు. రైట్ షేర్ కోసం నేనే స్వయంగా ట్రిబ్యునల్ ముందు అటెండ్ అయినట్లు చెప్పుకున్నడు.
మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2025 జూన్ 18న నాడు ఏమన్నడు కృష్ణా బేసిన్ మీద 500 టిఎంసీలకు బ్లాంకెట్ ఎన్ ఓ సీ ఇవ్వండి, ఆ తర్వాత ఏ ప్రాజెక్టులైన కట్టుకోండి అని చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చిండు.
మొన్న సెప్టెంబర్ 13న జరిగిన నీటి పారుదల శాఖ సమీక్షలో ఇదే ముఖ్యమంత్రి ఏమంటడు.. కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా సాధించి తీరాలె అంటడు. ఉత్తం ఏమో 763 టిఎంసీల రైట్ షేర్ అంటడు, ముఖ్యమంత్రి ఏమో ఓ సారి 500 టీఎంసీ అంటడు. ఓసారి 904 టీఎంసీలు అంటడు. పూటకో మాట మాట్లాడి పరువు తీసుకుంటున్నరు.
వీళ్ల అజ్ఞానం వల్ల తెలంగాణ రాష్ట్రం హక్కుగా రావాల్సిన నీటి వాటాను కోల్పోయే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టా? లేదా నీళ్ల మంత్రి చెప్పింది కరెక్టా? అసలు ఎవరిది కరెక్టు? కనీస అవగాహన లేకుండా ఎట్ల మాట్లాడుతున్నరు. కనీసం ప్రిపరేషన్ లేకుండా ఇలా ఎన్నాళ్లు ఉంటారు. కేసీఆర్ కృష్ణా జలాల్లో రైట్ ఫుల్ షేర్ సాధించేందుకు సెక్షన్ 3 కోసం పోరాటం చేసారు.
ఉమా భారతి, గడ్కరీ, షకావత్, ప్రధానిలను కలిశారు. సుప్రీం కోర్టు గడప తొక్కి, నిర్విరామ పోరాటం చేసి సెక్షన్ 3 సాధించారు. 763 టీఎంసీలు అనేది కేసీఆర్ పట్టుబట్టిన విషయం. ఇప్పుడు తామేదో కొత్తగా 763 టీఎంసీలు డిమాండ్ చేసినట్లు.. డబ్బా కొడుతున్నడు ఉత్తం. ఇప్పుడు వీళ్లు ఏం అంటున్నరు ఓసారి 500, ఓసారి 763, ఓసారి 904 టీఎంసీలు మా వాటా అంటున్నరు. పూటకో మాట ఘడియకో లెక్క. ఒక బాధ్యత లేదు, రాష్ట్రం మీద ప్రేమ లేదు. నీటి ప్రయోజనాల మీద పట్టి లేదు.
ద్రోహం చేసినోల్లే సుద్దులు చెబుతున్నారు… 299:512 ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సిగ్గులేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఉత్తం ఏమంటారు..512:299 నీటి వాటాను బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చిందట. చారిత్రక అన్యాయాన్ని సరి చేస్తున్నరట. ఛీ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు. ముఖ్యమంత్రి అంతే, నీళ్ల మంత్రి కూడా అంతే. 299:512 హక్కుల విషయంలో మేం సంతకం పెట్టినం అని నిరూపిస్తే నేను పదవికి రాజీనామా చేస్తా, లేదంటే నువ్వు చేస్తవా ఉత్తం?
కృష్ణాలో 299:512 వాటా ఇచ్చి, తెలంగాణ తీరని చారిత్రక ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. 2013 అక్టోబరు 18న నాడు ఉమ్మడి ఏపీ జస్టిస్ శ్రీ కృష్ణ కమిటికి రిపోర్టు ఇచ్చింది. ఇదే రిపోర్టును శాసనసభలోనూ పెట్టారు.
తెలంగాణకు కృష్ణాలో 299, ఏపీకి 512 ఇచ్చినం అని అందులో క్లియర్ గా ఉంటుంది. తెలంగాణ ప్రాంత హక్కులకు ఉమ్మడి రాష్ట్రంలోనే మరణ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీ. మీ చేతగాని తనం, అడుగులకు మడుగులొత్తడం వల్ల 299 వాటా పరిమితం అయ్యింది. అడ్ హక్ కు, ఫైనల్ అవార్డుకు తేడా తెలియని అజ్నానులు రేవంత్ రెడ్డి, ఉత్తంలు.
2015 జున్ 26లో చేసుకున్న అగ్రిమెంట్ తాత్కాలిక ఒప్పందం అని లేఖలో స్పష్టంగా ఉంది.
ఇప్పుడున్న మీ అడ్వైజర్ ఆదిత్యానాథ్ కూడా అందులో సంతకం పెట్టిండు. కానీ ఉత్తం ఏమంటడు, బిఆర్ఎస్ పెట్టింది అంటడు. జులై 14, 2014 నాడు కృష్ణాలో 299 అన్యాయం అని కేంద్రానికి లేఖ రాసినం.
రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే.. ఆనాటి కాంగ్రెస్ మాకు అన్యాయం చేసింది, కొత్త ట్రిబ్యునల్ వేసి నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా కేంద్రాన్ని కోరినం.
తెలంగాణ పట్ల మా చిత్తశుద్దికి, నిజాయితీకి నిదర్శనం ఇది. 299ని మేం ఒప్పుకోలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ రాసిన మరణ శాసనం. ట్రిబ్యునల్ వేయడంలో ఆలస్యం అవుతుందని మొదటి అపెక్స్ కౌన్సిల్ 2016లో చెప్పినం.
రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో అడిగితే షకావత్ గారు సుప్రీం కోర్టులో కేసు వాపస్ తీసుకోవాలని చెప్పిండు.
అప్పుడు కేసు విత్ డ్రా చేసుకొని, సెక్షన్ 3ని సాధించింది బిఆర్ఎస్.
మేం 299 శాశ్వత ఒప్పందం చేసుకుంటే, సెక్షన్ 3 ఎందుకు అడిగాం, అపెక్స్ కౌన్సిల్ ఎందుకు పోయాం, ఎందుకు సుప్రీంకు మెట్లు ఎక్కాం? సెక్షన్ 3పై తెలంగాణ వాదనలు ముగింపు దశలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో అవగాహన లేకుండా, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తీర్పును ప్రభావితం చేయవా? 2025 ఫిబ్రవరి 17న నాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ లో ఏముంది. అదే తాత్కాలిక ఒప్పందం వీళ్లు కూడా చేసుకున్నరు. దీని గురించి ఏమంటరు ఉత్తం?
అందులో ఏముంది ఫైనల్ అవార్డు వచ్చే దాక 50:50 చేసుకుందామని మీ సెక్రెటరీ రాసిండు. అదే డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ 28 లెటర్లు రాసి అడిగింది. 299 మేము ఒప్పుకోము అని ఎంత ప్రయత్నం చేసినం. పోరాడినం.
ఇన్ని చెప్పాక కూడా 299 కు బిఆర్ఎస్ ఒప్పుకున్నది అని దుష్ర్పచారం చేసే వాళ్లను ఏమనాలో.. వాళ్లే చెప్పాలె