– సీఎం కళ్లు తెరిచే వరకు దీక్ష ఆగదు
– ప్రభుత్వానికి మబోడె రాచంద్ర యాదవ్ హెచ్చరిక
మంగళగిరి: బీసీల హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ చేపట్టిన “బీసీ ధర్మ దీక్ష” మూడో రోజుకు చేరుకుంది. ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, ఆయన తన ఉక్కు సంకల్పాన్ని వీడలేదు. ఈ సందర్భంగా ఆయన దీక్షా శిబిరం నుంచి మాట్లాడుతూ, ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
బీసీలకు తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ రెండేళ్లలో రాష్ట్రాన్ని దోపిడీ చేసి, తన కుమారుడికి లక్షల కోట్ల అవినీతికి పట్టాభిషేకం చేశారని ఆయన ఆరోపించారు. యాభై శాతం పైగా ఉన్న బీసీలను కేవలం ఓట్ల కోసం వాడుకుని, వారికిచ్చిన హామీలను విస్మరించి, అణగదొక్కే కార్యక్రమం చేస్తుండటం వల్లే తాను శాంతియుతంగా నిరవధిక నిరాహారదీక్ష చేపట్టాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
గత నాలుగు నెలలుగా బీసీల ఐదు న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించలేదని ఆయన విమర్శించారు. తన దీక్షకు రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు, మేధావుల నుంచి పూర్తి మద్దతు లభిస్తున్నప్పటికీ, ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి పరిణామాలు ఎదురైనా, ముఖ్యమంత్రి ఐదు డిమాండ్లను పరిష్కరించేంత వరకు తన దీక్ష కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు.
అధికారాన్ని, బలగాలను ఉపయోగించి దీక్షను భగ్నం చేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, దానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిదేనని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించడం కాదు, పరిష్కారాన్ని ప్రకటించేంత వరకు దీక్షను విరమించే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. ఈ పోరాటం రాష్ట్ర, దేశవ్యాప్త ఉద్యమంగా మారకముందే ముఖ్యమంత్రి కళ్లు తెరవాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబుకు, నారా లోకేష్‌కు బీసీల ఓట్లను వాడుకోవడం తెలుసు తప్ప, వారి సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదనడానికి ఈ నిరాదరణే ప్రత్యక్ష నిదర్శనమని, దీనికి వారు మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. ప్రభుత్వం ఎలాంటి కుట్రలు, రాజకీయాలు చేసినా, ఐదు డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు దీక్ష ఆగదని బోడె రామచంద్రయాదవ్ స్పష్టం చేశారు.