Suryaa.co.in

Andhra Pradesh

రూ.380 కోట్లకు పెరిగిన అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ వ్యయం

• జూలై నాటికి పూర్తి కానున్న విగ్రహ నిర్మాణం
• మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి

అమరావతి, ఏప్రిల్ 4: బీఆర్ అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ వ్యయం రూ.268 కోట్ల నుంచి రూ.380 కోట్లకు చేరిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి, అంబేద్కర్ నిర్మాణ కమిటీ ఛైర్మెన్ మేరుగు నాగార్జున వెల్లడించారు. నిర్మాణ వ్యయం ఎంతగా పెరిగినా నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా జరుగుతున్న స్మృతివనం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను జూలై నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో మంత్రి మేరుగు నాగార్జున అంబేద్కర్ స్మృతివనం పనులను సమీక్షించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడో మారుమూలన రూ.100 కోట్ల వ్యయంతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారని చెప్పారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ లో వేల కోట్ల రుపాయల విలువైన పీడబ్ల్యుడీ గ్రౌండ్స్ భూములను అంబేద్కర్ స్మృతివనం నిర్మాణానికి కేటాయించడంతో పాటుగా రూ.268 కోట్ల ను మంజూరు చేసారని తెలిపారు.

అయితే స్మృతివనం లో చిరస్థాయిగా నిలిచిపోయేలా మరికొన్ని భవనాలను నిర్మించాలని, స్మృతివనం ప్రాంగణాన్ని అత్యాధునిక పద్ధతుల్లో సుందరీకరించాలని నిర్ణయించడంతో అదనంగా మరో రూ.106 కోట్లను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఇది కాకుండా పురపాలక శాఖ కూడా మరో రూ.6 కోట్లను స్మృతివనం పనులకు మంజూరు చేసిందని ఈ లెక్కన ప్రస్తుతం అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ వ్యయం రూ.380 కోట్లకు చేరిందని వివరించారు. విగ్రహావిష్కరణ పూర్తయ్యే సమయానికి అంచనా వ్యయం రూ.400 కోట్లు దాటే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే నిర్మాణ వ్యయం ఎంతగా పెరిగినా స్మృతివనం పనులు చరిత్రలో మిగిలిపోయేలా చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో దేశంలో మరెక్కడా లేని విధంగా ఈపనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం హరియాణలో జరుగుతుండగా దానికి సమాంతరంగా పీడబ్ల్యుడీ గ్రౌండ్స్ లో స్మృతివనం పనులు రాత్రీ పగలూ జరుగుతున్నాయని జరుగుతున్నాయన్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నాటికి స్మృతివనం పనులను పూర్తి చేయాలనుకున్నా అనివార్యకారణాలతో జూలై నాటికి స్మృతివనం పనులను పూర్తి చేసి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని నాగార్జున తెలిపారు.

నిర్మాణ పనుల్లో ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, సందర్శకులకు ఒక మంచి అనుభూతిని కలిగించే విధంగా అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించిన అంశాలను ప్రదర్శించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. స్మృతివనంలో భాగంగా నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ నిర్మాణపనులను వేగవంతం చేయాలని, మరింత ఎక్కువ మంది కార్మికులను ఈ పనుల్లో వినియోగించాలని సూచించారు. అంబేద్కర్ విగ్రహ శిల్పి నరేష్ విగ్రహ నిర్మాణపనుల పురోగతిని వివరించారు. ఏపీఐఐసి అధికారులు స్మృతివనం పనుల ప్రగతిని పీపీటీ ద్వారా ప్రదర్శించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.జయలక్ష్మి, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ కే.హర్షవర్ధన్, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నూపుర్, విజయవాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్, ఏపీఐఐసి సిఇ నరసింహారావు, కేపీసీ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వాసు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE