-అణగారిన వర్గాల అభివృద్ధికి రూ.1382 కోట్లు
-రూ.1250 కోట్లతో వాటర్ గ్రిడ్
-రూ.125 కోట్లతో ఇంటింటికీ కుళాయి
-విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
-ఎంపీ విజయసాయిరెడ్డి
కనిగిరి, నవంబర్ 8: జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనలో జరిగిన అభివృద్దితో కనిగిరి రూపురేఖలు మారిపోయాయని, కనిగిరిలో కనివిని రీతిలో అభివృద్ది జరిగిందని దక్షిణ కోస్తా జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి చెప్పారు. సామాజిక సాధికార బస్సుయాత్రలో భాగంగా కనిగిరిలో సమాజంలో వివిధ వర్గాలను ప్రభావితం చేయగల వ్యక్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్దికీ, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు దూసుకుపోతున్నారని అన్నారు. సంక్షేమం తప్ప అభివృద్ది జరగడం లేదని దుష్ప్రచారం చేస్తున్న విపక్షాల నోళ్లు మూయించాలని, సీఎం జగన్ నాలుగున్నరేళ్ల కాలంలో చేసిన మంచిని ప్రజలకు వివరించాలని కోరారు.
కనిగిరి మున్సిపాలిటీలో జల్ జీవన్ మిషన్ కింద రూ.125 కోట్లతో ఇంటింటికీ మంచినీటి కుళాయి ఏర్పాటు చేశారని, రూ.122 కోట్లతో ఆర్ అండ్ బీ శాఖ ద్వారా రహదారులు నిర్మించారని, జాతీయ రహదారి 4 లో రూ.230 కోట్లతో మాలకొండ-సీతాపురం రహదారి నిర్మించారని అలాగే రూ.1250 కోట్లతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు కానుందని, ప్రస్తుతం టెండర్ దశలో ఉందని అన్నారు. అలాగే నిరుపేదల సొంతింటి కళ నెరవేర్చే క్రమంలో నియోజకవర్గంలో 18వేల ఇళ్ల పట్టాలు అందించినట్లు తెలిపారు. మరోవైపు బీసీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు విద్యా, వైద్యం, ఆర్థిక సాధికారత, సామాజిక భద్రత, ఉపాధి కల్పన కోసం 254213 మంది లబ్దిపొందేలా రూ.1382 కోట్లు ఖర్చు చేశారని అన్నారు.
బలహీన వర్గాల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. నియోజకవర్గంలో బీసీల సంక్షేమం కోసం రూ.551 కోట్లు, ఎస్సీలకు రూ.291 కోట్లు, ఎస్టీలకు రూ 28 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజకీయ పదవుల్లో సైతం అగ్రతాంబూలం ఇచ్చారని గుర్తు చేశారు. ముగ్గురు జెడ్పీటీసీలు, ముగ్గురు ఎంపీపీలు, 8 మంది వైస్ ఎంపీపీలు, 1 మున్సిపల్ చైర్మన్, 1 మున్సిపల్ వైస్ చైర్మన్, 121 మంది సర్పంచులు, ఎంపీటీసీ పదవులు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే కనిగిరికి ప్రత్యేక రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కనిగిరిలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయడంతో పాటు బీసీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చేసిన మంచిని తెలియజేయాలని కోరారు.
విపక్షాలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. అలాగే మరమ్మత్తులకు గురైన రోడ్లు త్వరలోనే పూర్వవైభవం సంతరించుకోనున్నాయని అన్నారు. అంతకు ముందు సామాజిక సాధికార యాత్రలో భాగంగా చేపట్టిన పాదయాత్ర ప్రజలను చైతన్యం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. మంత్రులు ఆదిములకు సురేష్, మెరుగు నాగార్జున,ఎంపిలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి,బీదా మస్తాన్రావు, ఎమ్మెల్యే బూర్ర మదుసూదన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.