Suryaa.co.in

Andhra Pradesh

ఖర్చు 11కోట్లు… కట్టింది 54 ఇళ్ళు

-జగనన్న కాలనీల్లో అవినీతి బాగోతాన్ని బయటపెట్టిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

కందుకూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీలో భారీ దోపిడీ జరిగిందని విమర్శించారు. కందుకూరు మండలంలో 15 లేఅవుట్లు వేయగా… భూమి కొనుగోళ్ళు, చదును చేయడం లాంటి పనుల కోసం దాదాపు 8 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. మొత్తం 506 మంది లబ్ధిదారులకు ఇళ్ళు మంజూరు చేస్తే, కేవలం 54 ఇళ్ళు మాత్రమే కట్టారని అన్నారు. మొత్తంగా 11 కోట్లు ఖర్చు చేస్తే పది శాతం కూడా ఇళ్ళు నిర్మించలేదని చెప్పారు. మిగిలిన లబ్ధిదారులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గతంలో టిడ్కో ద్వారా చంద్రబాబు ఎంతోమంది పేదలకు సొంత ఇళ్ళు అందించారని, ప్రస్తుతం పట్టణంలో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు చొప్పున స్థలాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.

ఈ క్రాప్ విధానంపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, కౌలు రైతులకు కూడా ఈక్రాప్ సౌకర్యం ఈ ప్రభుత్వం కల్పిస్తుందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలియజేశారు. అలాగే 90 శాతం సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తున్న గోకులం షెడ్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశువుల భీమా పథకం పైన కూడా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

అంగన్వాడి కేంద్రాల నిర్వహణ సక్రమంగా ఉండేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఎమ్మెల్యే సూచించారు. ఆర్డిడిఎస్ స్కీం ద్వారా త్వరలో జరగనున్న గ్రామసభల్లో విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. లో వోల్టేజ్ సమస్య నివారణకు పలుకూరుకు కొత్తగా విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరైనట్లు ఎమ్మెల్యే చెప్పారు.

మహాకూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత తమ పైన, అధికారులపైన ఉందని నాగేశ్వరరావు అన్నారు. అధికారులు బాధ్యతతో పనిచేసి మండల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.

కార్యక్రమంలో ఎంపీపీ ఇంటూరి సుశీల, జడ్పిటిసి తొట్టెంపూడి అనసూర్య, ఇన్చార్జ్ ఎంపీడీవో వెంకటేశ్వరరావు, తహసిల్దార్ ఇక్బాల్, డిఎల్ పిఓ కృష్ణమోహన్, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE