– కాళేశ్వరంపై నాటి సర్కారు తప్పుడు సమాచారం
– నాటి మంత్రి ఈటల ఉదాసీన న
– ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారు
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్
– కమిషన్ 605 పేజీల నివేదిక
– 25 పేజీలకు కుదించిన ప్రభుత్వం
– భయపడవద్దన్న కేసీఆర్
– కేసీఆర్ బాధ్యత వహించాలన్న మంత్రి ఉత్తమ్
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌ను అధ్యయనం చేసిన ముగ్గురు అధికారుల కమిషన్ నివేదిక తయారు చేసి.. సోమవారం కేబినెట్ ముందు ఉంచింది. ఈ నివేదికలో మాజీ సీఎం కేసీఆర్ పేరు 32 సార్లు, హరీష్ రావు పేరు 19 సార్లు, ఈటల పేరు 5 స్లారు ప్రస్తావనకు వచ్చినట్లు గుర్తించారు.
అయితే బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు చేసిందని, కేబినెట్ అనుమతి ఉందని అప్పటి ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఆ శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఉదాసీనంగా, తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని తప్పు పట్టింది. కొందరు అధికారులు తప్పుడు సాక్ష్యాలు సమర్పించారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కమిషన్ సూచించింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, 650 పేజీలతో ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నివేదికలోని సారాన్ని తీసేందుకు ముగ్గురు ఉన్నతాధికారులతో కమిషన్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అందించిన 650 పేజీల సారాన్ని 60 పేజీలకు కుదించారు. ఈ నివేదికను సోమవారం తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఉంచారు. అందుకు సంబంధించిన అంశాలను భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ద్వారా ప్రజంటేషన్ ఇచ్చారు.
కేసీఆర్ ఉన్నప్పుడే కూలిన మేడిగడ్డ: ఉత్తమ్
మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ కూలిపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అధిక వడ్డీలతో రూ.84వేల కోట్లు అప్పు తెచ్చిందని తెలిపారు. రుణాలు తెచ్చే విషయంలో అప్పటి బీఆర్ఎస్ నాయకులు అవకతవకలకు పాల్పడ్డారని విమర్శించారు.
తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టాలని గతంలో నిర్ణయించినట్లు గుర్తు చేశారు. రూ.38వేల కోట్లతో తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ చేపట్టాల్సి ఉందన్నారు. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి స్థలాన్ని మార్చిందన్నారు. 16 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా డిజైన్ చేశారని పేర్కొన్నారు.
కానీ కేసీఆర్ సీఎం అయ్యాక ఇష్టానుసారం డిజైన్లు మార్చేశారని.. మేడిగడ్డ డిజైన్, నిర్మాణం అన్నీ కేసీఆరే చేశారని స్పష్టం చేశారు. అప్పుడు సీఎం, నీటిపారుదల మంత్రి రెండు ఆయనే అని తెలిపారు. 2016లో కాళేశ్వరం అగ్రిమెంట్ జరిగిందని, 2019లో పనులు ప్రారంభమయ్యాయని.. 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ కుంగిపోయిందన్నారు.
రాజకీయాల అంశాలతో సంబంధం లేకుండా పీసీ ఘోష్ కమిషన్ వేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. కమిషన్ 605 పేజీలతో కూడిన రిపోర్ట్‌ను ప్రభుత్వానికి ఇచ్చిందని చెప్పారు. రిపోర్ట్ అధ్యయనానికి ముగ్గురు అధికారులతో కమిటీ వేసినట్లు పేర్కొన్నారు.
నివేదికను 25 పేజీలకు కుదించి కమిటీ క్లుప్తంగా అందించిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో అనేక లోపాలున్నాయని NDSA కూడా చెప్పిందని స్పష్టం చేశారు. డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలున్నాయని స్పష్టం చేసిందని అన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్లో చర్చించినట్లు వెల్లడించారు.
అరెస్టులుంటాయి.. ఆగం కావద్దు: కేసీఆర్
మెదక్ : ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు. కాంగ్రెస్ కమిషన్ అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఊహించినదేనని స్పష్టం చేశారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కొంత మంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయవచ్చు. భయపడ వద్దని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదన్నవాడు అజ్ఞాని అని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీ పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు.