– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి : లంకోజన పల్లి గ్రామ పంచాయతీలోని లూతగిరి కాలనీకి చెందిన అఖిల్, నిఖిల్(12) అనే కవల పిల్లలు గురువారం జగనన్న కాలనీలో నీటమునిగి మృతి చెందారు. బాధిత కుటుంబాలను తెలుగుదేశం పార్టీ దర్శి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పరామర్శించారు. చదువుకునే వయస్సులో ఇద్దరు చిన్నారులు ఇలా మృత్యువాత పడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
అఖిల్, నిఖిల్ వ్యవసాయ కుటుంబానికి చెందిన గంగుల నాగరాజు, ప్రమీల దంపతుల కుమారులు. దసరా సెలవులకు అమ్మమ్మ పచ్చల కోటమ్మ కి ఇంటికి వచ్చి మృతి చెందడం నాకెంతో బాధ కలిగిస్తుందని లక్ష్మి అన్నారు. జగనన్న కాలనీల విషయమై ఇంజనీరింగ్ అధికారులు తక్షణమే స్పందించి నీటి కుంటలను, గుంతలను పూడ్పించాలని, ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ గా తీసుకొని నియోజకవర్గంలోని ప్రతి జగనన్న కాలనీ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులకు డాక్టర్ లక్ష్మి ఆదేశించారు.
చెరువులు వాగులు, వంకలు, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి గ్రామ కార్యదర్శి, వీఆర్వోలు, మండల రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలని డాక్టర్ లక్ష్మి కోరారు.