– రాజధాని రైతు జెఎసిలో చర్చ
– రైతు ప్రతినిధులను తీసుకోవాలని సూచన
– అమరావతి ప్రభుత్వం, రైతుల భాగస్వామ్య అభివృద్ధి ఒప్పందం కూడా అదే
రాజధాని అమరావతిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏర్పాటు చేసిన త్రీమెన్ కమిటీలో సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావడం లేదని, చర్చల అంశాలు కూడా తెలియడం లేదని రైతు జెఎసి ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. గురువారం జరిగిన జెఎసి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన త్రీమెన్ కమిటీలో చర్చించే అంశాలు, వేటిని పరిష్కరించారు అనే విషయాలపై రైతులకు ఎటువంటి సమాచారమూ ఉండటం లేదని, సమస్యలు కూడా త్వరితగతిన పరిష్కారం కావడం లేదని అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇప్పటికే అనేక సమస్యలు విన్నవించామని, ఒక్కటీ పరిష్కారం అవలేదని అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో రైతు జెఎసి నుండి కనీసం ముగ్గురు లేదా ఐదుగురిని సభ్యులుగా తీసుకోవాలని, లేదా సమావేశాలకు ఆహ్వానించేలా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో అభివృద్ధి పనులు వేగమందుకున్నాయని, ప్రభుత్వ పరమైన కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని, రైతుల సమస్యలు పరిష్కారంలో ఆలస్యం అవుతోందని, వాస్తవంగా అమరావతి రాజధాని భాగస్వామ్య అభివృద్ధి అనే విషయంపై సమావేశంలో కొంత చర్చ జరిగినట్లు తెలిసింది.
ముఖ్యంగా రాజధానిలో కొంతమంది రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే సమయంలో పూలింగుకు ఇవ్వని భూముల్లో ప్లాట్లు ఇచ్చారని, వాటిని రద్దు చేసి అదే గ్రామపరిధిలో ప్లాట్లు ఇచ్చేలా చూడాలని సిఆర్డిఏ కమిషనర్‌ను, త్రిమెన్ కమిటీని కోరాలని నిర్ణయించారు. సాధ్యంకాని పరిస్థితుల్లో దగ్గర్లో ఇవ్వాలని కోరనున్నారు.
గ్రామాల్లో శ్మశానాలకు సంబందించి ఏ గ్రామంలో ఆ గ్రామంలోనే ఇవ్వాలని దానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఎమ్మెల్యేను కోరాలని నిర్ణయించారు. మరీ ముఖ్యంగా ఆర్5 జోన్‌కు సంబంధించి సుప్రీం కోర్టులో ఉన్న కేసును వచ్చే ఏడాది మార్చిలోపు పరిష్కరించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరనున్నారు. అమరావతి గెజిట్ కు సంబంధించి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టేలా ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని చర్చించారు.
గ్రామాల్లో పనులు జరుగుతున్న సమయంలో మంచినీటి పైపులైన్లు, రోడ్లు దెబ్బతింటున్నాయని, దీనివల్ల నీటి సమస్య వస్తోందని, వచ్చే వేసవి నేపథ్యంలో అటువంటి ఇబ్బందులు లేకుండా సిఆర్డిఎ త్వరితగతిన పరిష్కరించాలని జెఎసి తరుపున కోరాలని నిర్ణయించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలపై కమిషనర్ నేరుగా జోక్యం చేసుకోవాలని ప్రతిపాదించారు.
– వల్లభనేని సురేష్
సీనియర్ జర్నలిస్ట్
9010099208