-కారకులను ఎవరినీ వదిలేది లేదు
– టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
– గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించిన టీడీపీ అధినేత, బాధితులకు పరామర్శ
గన్నవరం: గన్నవరంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. వైసిపి గూండాల దాడిలో ధ్వంసమైన తెలుగుదేశంపార్టీ కార్యాలయాన్ని, నాటి దాడిలో తగలబెట్టిన వాహనాలను పరిశీలించారు. దాడి వివరాలను పార్టీ నేతలు, కార్యకర్తలు అధినేతకు వివరించారు. దాడులకు గురైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు. పార్టీ కార్యాలయం వద్ద మీడియాతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. పోలీసులతో కలిసి వచ్చి, వారి సహకారంతో దాడులు చేయడం కాదని, ప్రత్యర్థులకు దమ్ముంటే లగ్నం పెట్టి ఎన్ని వేల మందితో వస్తారో రావాలని, తేల్చుకోడానికి తాము సిద్ధమేనని చంద్రబాబు ఈ సందర్భంగా సవాలు చేశారు. పోలీసుల్ని పక్కన పెట్టి ముందుకు వస్తే అక్కడే తేల్చుకుందామన్నారు. గన్నవరంలో పోలీసులు దొంగల్లా వ్యవహరించారని…. ఘటన దగ్గరకు బాధితుల కోసం అడ్వకేట్ ఆన్ డ్యూటీలో వస్తే అతనిపైనా కేసు పెట్టారని అన్నారు.
పోలీసుల్ని రెచ్చగొట్టి ఎవరు ఇప్పుడు తప్పుడు పనులు చేయించినా, చివరకు శిక్షలు పడేది పోలీసులకేనన్నారు. తమది బెదిరిస్తే పారిపోయే పార్టీ కాదని అన్నారు. వెనుకబడిన వర్గానికి చెందిన దొంతు చిన్నా ఇంటిపై రౌడీలు దాడి చేయడాన్ని ఖండించారు. తాను ఎయిర్ పోర్టుకు వస్తే 1000 మంది పోలీసులను పెట్టారని .. గన్నవరం ఏమైనా పాకిస్తాన్లో ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే అసలు దాడులే జరిగేవి కాదన్నారు. గన్నవరం సిఐ బీసీ వర్గానికి చెందినవాడైతే అట్రాసిటీ కేసులు ఎలా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి రాగానే ఈ ఘటనలపై ఎంక్వైరీ వేసి మక్కెలిరగ తంతానని వార్నింగ్ ఇచ్చారు. తాను ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా ఎప్పుడు అడ్డుకోలేదన్నారు.
పార్టీ కార్యాలయంపై దాడులు చేసిన వారిపై ఇప్పటి వరకు దర్యాప్తు ప్రారంభించలేదని చంద్రబాబు ఆరోపించారు. బాధితులు టీడీపీ వాళ్లైతే వాళ్ల మీదే కేసులు పెట్టారని, పోలీసుల తీరు చూసి అంతా సిగ్గుతో తలదించు కుంటున్నారన్నారు. పోలీసులు చేసిన సిగ్గుమాలిన పనిని వారి ఇళ్లలో కుటుంబ సభ్యులు సమర్థిస్తే తాను కూడా సమర్థిస్తానని చెప్పారు. రాష్ట్రంలో సైకో పాలనపోయే వరకు పోరాడుతూనే ఉంటానన్నారు. ఈ రోజు టీడీపీ కార్యాలయం మీదే కదా దాడి అని వదిలేస్తే రాష్ట్రంలో భవిష్యత్ లో ఎవరికి రక్షణ లేకుండా పోతుందని హెచ్చరించారు. ప్రభుత్వం మీద పోరాడటానికి ప్రజలే ముందుకు రావాలన్నారు. రాష్ట్రంలో ఉన్న సైకో పాలనను తరిమి కట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
గెలిపించుకున్న వారినే కొట్టించిన ఎమ్మెల్యేను అంతా గుర్తు పెట్టుకోవాలని, వడ్డీతో సహా తిరిగి చెల్లిద్దామన్నారు. మళ్లీ మంచిరోజులు వస్తాయని కార్యకర్తలకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. గన్నవరంలో టీడీపీ శ్రేణుల్ని కాపాడుకుంటానని చెప్పారు. ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. విమర్శలకు సమాధానాలు చెప్పాలని, చేతకాని వాళ్లే ఇలా దౌర్జన్యాలు చేస్తారని, పోలీసుల్ని అడ్డు పెట్టుకుని దాడులు చేస్తారని ఎద్దేవా చేశారు. గన్నవరంలో జరిగిన దుర్మార్గాన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారని, టెర్రరిస్ట్లు కూడా అలా చేయరని, గన్నవరం ప్రజలందరిని భయభ్రాంతులు చేశారని చంద్రబాబు ఆరోపించారు.