– రాజకీయ కక్షలకు పోలీస్ యంత్రాంగాన్ని వాడుతున్నారు
– చట్టాలను అపహాస్యం చేసేలా పోలీసుల తీరు
– ప్రజాప్రతినిధుల వినతిపత్రం తీసుకునే సమయం కూడా డీజీపీకి లేదా?
– చంద్రబాబు వత్తిడితోనే వల్లభనేని వంశీ అక్రమ అరెస్ట్
– 24 గంటల్లో ఆయనను న్యాయమూర్తి ముందు హాజరుపరచాలి
– అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసులు బనాయించారు
– మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం
అమరావతి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమ అరెస్ట్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసుల నమోదుపై డీజీపీ ని కలిసేందుకు ప్రయత్నించిన సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.
మంగళగిరి డీజీపీ కార్యాలయం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా చట్టాలను పరిరక్షించేందుకు పనిచేయాలే తప్ప రాజకీయ కక్షలకు పోలీస్ యంత్రాంగం సహకరిస్తుంటే ఉపేక్షించడం దుర్మార్గమని అన్నారు. కూటమి ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమై పోతోందని, రాజకీయ కక్షలకు పావులుగా మారిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ గత రెండు రోజుల కిందట మేజిస్ట్రేట్ ముందు హాజరై తాను ఎటువంటి ఫిర్యాదు చేయలేదని, సాక్షి సంతకం పేరుతో తనతో సంతకం చేయించుకుని వంశీపై తప్పుడు ఫిర్యాదు నమోదు చేశారంటూ వాగ్మూలం ఇచ్చారు. దీనితో టీడీపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాము దొంగకేసు పెట్టించామనే విషయం బయటపడిందని గ్రహించింది.
ఎస్సీ అయిన సత్యవర్థన్ తో వల్లభనేని వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించేందుకు టీడీపీ చేసిన కుట్ర కూడా వెల్లడయ్యింది. ఈ కేసులో చంద్రబాబు, లోకేష్ లు చేసిన కుతంత్రాలు బట్టబయలు అయ్యాయి. దీనితో రంగంలోకి దిగిన చంద్రబాబు, లోకేష్ లు సత్యవర్థన్ సోదరుడితో సత్యవర్థన్ ను వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశారని, అతడిని బెదిరించి మేజిస్ట్రేట్ ముందు తప్పుడు వాంగ్మూలం ఇప్పించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయించారు.
ఈ కేసులో వల్లభనేని వంశీని పోలీసులు క్షణాల్లో అరెస్ట్ చేశారు. ఇంత కన్నా దారుణం ఎక్కడైనా ఉందా? తెలుగుదేశం నుంచి వైయస్ఆర్ సీపీలో చేరి గత ఎన్నికల్లో పోటీ చేయడం, తెలుగుదేశం పార్టీపై రాజకీయ విమర్శలు చేశారని వల్లభనేని వంశీపై చంద్రబాబు, లోకేష్ లు కక్షకట్టారు. కొన్ని సందర్బాల్లో వంశీని ఎలిమినేట్ చేసేందుకు కూడా ప్రయత్నించారు. అనేక తప్పుడు కేసులపై వంశీ న్యాయస్థానాల నుంచి బెయిల్ తెచ్చుకున్నారు.
నిన్న గుట్టు చప్పుడు కాకుండా నమోదు చేసిన కేసును కనీసం ఆన్ లైన్ కూడా చేయకుండానే తెల్లవారుజామున వంశీని పోలీసులు అరెస్ట్ చేశారంటే దీని వెనుక ఎటువంటి రాజకీయ వత్తిళ్లు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు, తెలుగుదేశం నేతలు కుమ్మకై వంశీని అరెస్ట్ చేశారు. కనీసం వంశీని కలిసేందుకు ఆయన సతీమణికి, చివరికి న్యాయవాదులకు కూడా అనుమతి ఇవ్వలేదు. పోలీసులు ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం దారుణం.
దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నిన్న ఒక వివాహానికి హాజరయ్యారు. ఈ సమయంలో ఆయన కారు డ్రైవర్ పై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అసభ్య పదజాలంతో దూషించారు. అదే చింతమనేని ఈ రోజు అబ్బయ్య చౌదరిపైనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతటి అన్యాయం ఎక్కడైనా ఉంటుందా?
మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఇతర సీనియర్ నాయకులతో కలిసి డీజీపీని కలిసేందుకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్ళాం. అరగంట సేపు మమ్మల్ని కూర్చోబెట్టి, తరువాత డీజీపీ వెళ్ళిపోయారు అని పేషీ సిబ్బంది చెప్పారు. ఇదేనా శానసమండలి సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులకు డీజీపీ ఇచ్చే గౌరవం?