[“పడవ నడిపే తాగుబోతులు”.. ఓషో గారి ఆధ్యాత్మిక – తాత్త్విక కథలలో ఇదొకటి]
అది పౌర్ణమి రాత్రి… ఆకాశంలో నిండు చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు. అది చాలా అందమైన రాత్రి, కాబట్టి కొంతమంది స్నేహితులు కలిసి, అర్ధరాత్రిలో పడవ ప్రయాణం చేయాలని భావించారు. దానికంటే ముందు వారంతా కలిసి కొంతసేపు ఆనందించాలనుకున్నారు, కాబట్టి పడవ ఎక్కే ముందు వారికి తాగడానికి చాలా సమయం దొరికింది. బాగా తాగిన తరువాత వారు పడవ ఎక్కారు, తెడ్లు తీసుకొని పడవ నడపడం ప్రారంభించారు.
వారు చాలా సేపు అలాగే పడవను నడిపారు. ఉదయం తెల్లవారుజామున చల్లని గాలి వీచడం ప్రారంభించినప్పుడు, వారు తిరిగి స్పృహలోకి వచ్చి, “మనం ఎంత దూరం వచ్చాము? రాత్రంతా పడవ నడుపుతూనే ఉన్నాముకదా!” అని అనుకున్నారు. కానీ వారు దగ్గరగా చూసినప్పుడు, వారు ముందు రాత్రి ఎక్కడ ఉన్నారో… అదే ఒడ్డున ఉన్నారని వారు గమనించారు.
వారు బయలుదేరే ముందు ఏమి చేయడం మర్చిపోయారో అప్పుడు గ్రహించారు: వారు చాలా సేపు పడవను నడిపారు, కానీ దానిని విప్పడం మర్చిపోయారు. మరియు తన పడవను ఒడ్డు నుండి విప్పని వ్యక్తి ఎంత బాధపడి ఏడ్చినా, ఈ అనంతమైన దివ్య సముద్రంలో, అతను ఎక్కడికీ చేరుకోలేడు. మీ స్పృహ అనే పడవ దేనితో ముడిపడి ఉంటుంది? అది మీ శరీరంతో, మీ ఆలోచనలతో మరియు మీ భావోద్వేగాలతో ముడిపడి ఉంది. మీశరీరం, మీఆలోచనలు మరియు మీభావోద్వేగాలు.. – అదే మీరు చేరాల్సిన తీరం. మత్తులో మీరు అంతులేకుండా జీవితాంతం పడవ నడపవచ్చు.
ఆ అంతులేని జీవితాలు ముగింపుకు వచ్చిన తర్వాత, అప్పుడు మేల్కొన్న ఆలోచన, అలాగే కొంత జ్ఞానోదయం అనే చల్లని గాలి మిమ్మల్ని తాకినప్పుడు, మీరు మేల్కొని చూసినప్పుడు, మీరు మీ పడవనూ, పడవలో తెడ్లను వేయకుండానే… వేస్తూన్నామన్న భ్రాంతిలోనే జీవితాంతం వృధా చేశారని మరియు మీరు ప్రయాణం ప్రారంభించిన అదే తీరంలోనే బంధించబడ్డారని ఆలస్యంగా తెలుసుకుంటారు. ఆపై మీరు.. అస్సలు పడవను విప్పడమే మర్చిపోయారనే సాధారణ వాస్తవాన్ని గమనిస్తారు.
పడవను ఎలా విప్పాలో నేర్చుకోండి.
సాధారణంగా అయితే.. పడవను విప్పడం చాలా సులభం. కానీ, దానికి తెడ్లు వేసి నడపడం మరింత కష్టం. కానీ జీవిత ప్రవాహం విషయానికొస్తే, పడవను విప్పడం చాలా కష్టం. కానీ తెడ్లు వేయడం చాలా సులభం. రామకృష్ణ పరమహంస ఒకసారి ఇలా అన్నాడు, “మీ పడవను విప్పండి, మీ తెరచాపలను తెరవండి.. అప్పుడే దైవిక గాలులు మిమ్మల్ని తీసుకెళతాయి- ఇక మీరు పడవకు తెడ్లు వేయవలసిన అవసరం కూడా ఉండదు.” ఆయన చెప్పింది నిజమే… మీరు పడవను విప్పితే, దైవిక గాలులు ఇప్పటికే వీస్తున్నాయని మీరు చూస్తారు, మరియు అవి మిమ్మల్ని దూర తీరాలకు తీసుకెళతాయి.
మీరు అవతల తీరాలకు చేరుకోకపోతే ఆనందం అంటే ఏమిటో మీకు తెలియదు. అందుకే ముందుగా మీరు మీ పడవను కట్టిన తాడును విప్పాలి. చేసే పనిలో శ్రద్ధతో కూడిన ధ్యానం ఉండాలి. “ధ్యానం”… అంటే పడవను విప్పడమే. ఆ వ్యక్తులు తమ పడవను ఎందుకు విప్పలేకపోయారు? వారు తాగి ఉన్నారు, స్పృహ కోల్పోయారు. మరియు ఉదయం వారిని చల్లని గాలులు తాకగానే మత్తు దిగి, తిరిగి స్పృహలోకి వచ్చినప్పుడు, పడవ ఇంకా నది ఒడ్డునే కట్టబడి ఉందని వారు కనుగొన్నారు.
(“ధ్యాన మార్గం” లో ప్రయాణం గురించి ఓషో చెప్పినకథ ఇది. -వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీక శాస్త్ర ఉపాధ్యాయుడు)