– సచివాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి
అమరావతి : ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ద్వేయమని తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు సత్వరమే పరిష్కారం చూపుతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి వినతులు స్వీకరించారు.
వృద్ధులు విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ ప్రతినిధులు, రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయం అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసి తమ సమస్యలపై వినతి పత్రాలు అందించారు.సాధ్యమైనంత త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని వారికి మంత్రి హామీనిచ్చారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులకు అందించే వినికిడి యంత్రాలు ప్లాస్టిక్ పరికరాలు వైసీపీ ప్రభుత్వ నిలిపేసిందని గత 5 ఏళ్ల నుంచి ఏ ఒక్కరికి ఇవ్వలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన వారందరికీ యంత్రాలు ప్లాస్టిక్ పరికరాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా గాజువాకకు చెందిన యువకుడు తాను క్యాన్సర్ తో బాధపడుతున్నానని ఫించన్ మంజూరు చేయాలని మంత్రిని కోరారు. త్వరలోనే పింఛన్ మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామ సచివాలయ వార్డు సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు.
రూరల్ ఏరియాలో గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ లపైపని భారం పెరిగిపోతుందని టెక్నికల్ స్కిల్స్ అధికంగా ఉన్న డిజిటల్ అసి స్టెంట్లను పాఠశాలలు, కాలేజీల్లో టెక్నికల్ విధులకు సంబంధించి తమ సేవలు వినియోగించుకోవాలని, గౌరవప్రదమైన వేతనం అందించాలని మంత్రిని కోరారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నూతన విధివిధానాలు రూపొందిస్తామని మంత్రి తెలిపారు.