-కేటీఆర్ కు కొండా దేవయ్య వినతి పత్రం
– ఎంపీ వద్దిరాజు,మంత్రి గంగుల నాయకత్వంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు కొండా
బీసీ సంక్షేమ శాఖ మంత్రి, మున్నూరుకాపు అపెక్స్ కమిటీ ఛైర్మన్ గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు వద్దిరాజు రవిచంద్రల నాయకత్వంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య గురువారం ప్రగతి భవన్ లో ఐటీ, పురపాలక,పరిశ్రమల శాఖల మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావును కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో మున్నూరుకాపుల స్థితిగతులపై కేటీఆర్ వివరించారు. తెలంగాణలో తమ జనాభా సుమారు 50 లక్షల వరకు ఉందని,బలమైన సామాజిక వర్గంగా ఉండి 24 శాతం ఓటింగ్ కలిగి ఉన్నామని వివరించారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారమని, ఆర్థికంగా మాత్రం బాగా వెనుకబడడం వల్ల తమ పిల్లలు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలలో పురోగతి సాధించలేకపోతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.
తమ బిడ్డల భవిష్యత్తు కోసం మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ప్రతి ఏడాది 5,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని, రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాలలో మున్నూరు కాపు విద్యార్థినీ,విద్యార్థుల హాస్టల్ భవనాల కోసం రెండు ఎకరాల భూమితో పాటు 5 కోట్ల రూపాయలు కేటాయించాలని కేటీఆర్ కు దేవయ్య విజ్ఞప్తి చేశారు.
దశాబ్ద కాలంగా తమ న్యాయమైన హక్కుల సాధన కోసం శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.తమ ఈ న్యాయమైన హక్కులు పరిష్కారానికి గాను బీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి కూడా ఉన్నారు.