-మంగినపూడి బీచ్ లో విద్యార్థి గల్లంతు
-గాలింపు చర్యల్లో పోలీసులు విఫలమయ్యారన్న ఆరోపణలు.. కనీసం అంబులెన్స్ కూడా ఏర్పాటు లేదు
-కుటుంబ సభ్యులే తమ బిడ్డ ఆచూకీ కోసం గాలించిన వైనం
-మృతదేహం లభ్యమైన తర్వాత కూడా సరైన రీతిలో స్పందించని పోలీసులు
మచిలీపట్నం :కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ లో నిన్నటి రోజున 8వ తరగతి విద్యార్థి గోళ్ల నవీన్ కుమార్ గల్లంతవ్వగా గాలింపు చర్యలు చేపట్టడంలో పోలీసులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిన్న మధ్యాహ్నం నవీన్ గల్లంతవ్వగా ఘటన జరిగిన వెంటనే పోలీసులు సరిగ్గా స్పందించలేదన్న విమర్శలు వినిపిస్తున్నారు.గాలింపు చర్యలు కూడా విస్తృతంగా చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.మృతదేహం లభ్యమైన తర్వాత కూడా పోలీసులు స్పందించిన తీరు విమర్శలకు తావిచ్చేలా ఉంది.
ఈ రోజు తెల్లవారు జామున పెదపట్నం బీచ్ ఒడ్డుకు నవీన్ మృతదేహం కనిపించింది.తమ బిడ్డ గల్లంతైన నిమిషం నుండి కుటుంబ సభ్యులు సముద్రం ఒడ్డున విస్తృతంగా గాలించారు.రాత్రి పొద్దుపోయే వరకు గాలిస్తూనే ఉన్నారు.ఈ రోజు కూడా తెల్లవారు కాక ముందు నుంచే గాలించడం ప్రారంభించారు.ఈ క్రమంలో పెదపట్నం బీచ్ ఒడ్డున తమ బిడ్డ మృతదేహాన్ని గుర్తించారు.
అప్పటికీ పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించకపోవటంతో, తమ బిడ్డనే వారే బైక్ పై ఎక్కించి మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.మృతదేహాన్ని బైక్ పై ఎక్కించుకుని కిలో మీటర్ల మేర ప్రయాణించి ఆస్పత్రికి తరలించడం చూపర్లను కలచి వేసింది.