Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో తొలి కంటైనర్ ఆసుపత్రి ప్రారభం

– మౌలిక వసతులు కల్పిస్తాం..డోలీ మోతలు తప్పిస్తాం…
– రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

పార్వతీపురం : రాష్ట్రంలోని గిరిజన ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని, అందులో భాగంగా తొలి కంటైనర్ ఆసుపత్రిని ప్రారంభించి గిరిజనుల డోలీ మోతలకు స్వస్తి పలికినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు మండలం కరడవలసలో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటుచేసిన గిరి ఆరోగ్య కేంద్రం (కంటైనర్ ఆసుపత్రి)ను సోమవారం ఉదయం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో తొలి కంటైనర్ ఆసుపత్రిని ప్రాంతీయ ఆరోగ్య సేవల కోసం ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు.

ప్రాంతీయ గిరిజన గ్రామాలు, కొండ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా, దీనిని రూపొందించడం జరిగిందని తెలిపారు. సుమారు 2,000 మంది ప్రక్కన గల గ్రామాల నివాసితుల ఆరోగ్య అవసరాలను తీర్చడంలో ఇది ముందడుగుగా భావించాలని అన్నారు. బెల్లపాక,బొడ్డపాడు, నరింజ పాడు, కరడవలస, కరడకోటవలస (సాలూరు మండలం)తో పాటు చాకిరేవువలస, కంకనపల్లి, ఆజూరు, కుంబివలస (పాచిపెంట మండలం) గ్రామాలకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి వివరించారు.

ప్రాథమిక వైద్య సంరక్షణ కోసం గ్రామీణులు చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరాన్ని ఇది తగ్గిస్తుందని గుర్తుచేశారు. ఇందులో వారానికి ఒకసారి వైద్యాధికారి ఓ.పి.సేవలు అందిస్తారని, నెలకి రెండు సార్లు రెండు, నాలుగు బుధవారాల్లో 104 మొబైల్ మెడికల్ యూనిట్ ఇక్కడికి వస్తుందని చెప్పారు. ఏఎన్ఎం, ఎం.ఎల్. హెచ్.పి వారానికి మూడు సార్లు ఇక్కడ ఓపి సేవలు నిర్వహిస్తారని తెలిపారు. ఆశా కార్యకర్త ప్రతిరోజు ఇక్కడ అందుబాటులో ఉంటారుని, 105 రకాల మందులు అందుబాటులో ఉంచామని ఆమె పేర్కొన్నారు.రక్తపోటు, మధుమేహానికి సంబంధించిన మందులు ఇక్కడ తీసుకోవచ్చని, అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా సేవలు అందుబాటులో ఉన్నట్లు ఆమె వివరించారు.

గర్భిణీలలో రక్తహీనత కలిగిన వారికి ఐరన్ టాబ్లెట్లు అందుబాటులో ఉంటాయని, వారు ఆసుపత్రికి వెళ్లే అవసరం లేకుండా, ఐరన్ – ఇంజక్షన్లు ఇక్కడే ఎక్కించబడతాయని తెలిపారు. నెలకు ఒకసారి గర్భిణీలకు ఇక్కడ తనిఖీలు, రక్త పరీక్షలు చేయడం జరుగు తుందని అన్నారు. అంతేకాకుండా మలేరియా, డెంగ్యూ,షుగర్, రక్తసాత, హెపటైటీస్, హెచ్ఐవి, నీటి తనిఖీ,టీబీ-కెల్ల, హెచ్సివి, ఐఓడిన్, యూరిన్, హెచ్సీజీ – కిట్, కంటి చూపు మొదలైన 14 రకాల పరీక్షలు ఇక్కడ చేస్తారని అన్నారు. అలాగే చిన్నపిల్లలకు టీకాలు వేసి కార్యక్రమం ఉంటుందని, ప్రతి నెల రెండో శనివారం సార్వత్రిక రోగనిరోధకత కార్యక్రమం( UIP)నిర్వహించడం జరుగుతుందని మంత్రి వివరించారు.

జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో డోలి మోతలకు స్వస్తి పలికి, వారికీ అందుబాటులో వైద్య సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో గిరి ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఇక్కడ అన్ని రకాల పరీక్షలు చేయడమే కాకుండా మందులు ఇస్తారని తెలిపారు.

గిరి ప్రాంతాల్లో ముఖ్యంగా రక్తహీనత లోపం ఉందని, ఇందుకోసం ఎనీమియా యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కమిటీ 15 రోజులకు ఒకసారి ఇక్కడ సమీక్షించుకొని, గర్భిణీలకు, బాలింతలకు, ఐదేళ్ల లోపు పిల్లలకు ఆరోగ్యం, పోషణ గురించి అవగాహన కల్పించబడుతుందని అన్నారు. కౌమార దశలో ఉన్న బాల బాలికలకు ప్రత్యేక ఆరోగ్య సదస్సు ఇక్కడ నిర్వహించబడుతుందని, ట్యూబర్క్యూలోసిస్ గురించి అవగాహన సదస్సు ఇక్కడ నిర్వహించబడుతుందని కలెక్టర్ వివరించారు.

స్వయం సహాయక బృందం సభ్యులు సమీక్షలు,వయోజన విద్య అవగాహన సదస్సులు కూడా ఇక్కడ నిర్వహించ నున్నట్లు చెప్పారు. వీటితో పాటు గర్భధారణ, ప్రసవ సమయంలో శ్రద్ధ తీసుకోవడం, నవజాత శిశువు, శిశు ఆరోగ్య సేవలు ఇక్కడ లభిస్తాయని అన్నారు.బాల్య, వయో పరితుల ఆరోగ్య సంరక్షణ సేవలు, కుటుంబ సంకల్పం, నిరోధక సేవలు మరియు ఇతర ప్రధాన ఆరోగ్య సేవలు, సంక్రామక వ్యాధుల నిర్వహణ, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, సాధారణ ఆవుట్ పేషెంట్ సేవల్లో భాగంగా తేలికపాటి వ్యాధులు మరియు చిన్న చిన్న వ్యాధులకు చికిత్స అందించడం జరుగుతుందని అన్నారు.

సంక్రామకేతర వ్యాధుల స్క్రీనింగ్, నివారణ, నియంత్రణ మరియు నిర్వహణ ఉంటుందని, సాధారణ కంటి మరియు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు చికిత్స, ప్రాథమిక దంత ఆరోగ్య సంరక్షణ సేవలు, వృద్ధుల మరియు పాలియేటివ్ ఆరోగ్య సేవలు, అతి తీవ్ర గాయాలు, ఇతర అత్యవసర వైద్య సేవలు, మానసిక ఆరోగ్య సమస్యల స్క్రీనింగ్ మరియు ప్రాథమిక నిర్వహణ కూడా ఉంటుందని కలెక్టర్ వివరించారు. ఈ సేవలను గిరి ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.విజయపార్వతీ, వైద్య ఆరోగ్య శాఖ నోడల్ అధికారి డా. ఎం.వినోద్, వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారి డా. టి. జగన్మోహన్ రావు, ఇతర వైద్య సిబ్బంది, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE