-పరిశుభ్రతలో విశాఖ దేశంలోనే టాప్
-రాష్ట్ర పర్యాటకానికి కొత్త పుంతలు
-పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు
-ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి
కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో సరికొత్త శకానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తుది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడున్న 13 జిల్లాలను 26 కొత్త జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. కొత్త జిల్లాల నుంచి పరిపాలన నేటి (సోమవారం) నుంచే ప్రారంభమవుతోందని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం జగన్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంటారని అన్నారు.
జివిఎంసి పారిశుద్ధ్య కార్మికులు, ప్రజల ఉమ్మడి ప్రయత్నాల ఫలితంగా, ప్రస్తుతం జరుగుతున్న స్వచ్చ సర్వేక్షణ్ సర్వేలో విశాఖ నగరం పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంలో దేశంలోనే ముందంజలో ఉందని అన్నారు. సర్వేలో పౌరుల అభిప్రాయాలు కార్మికులను మరింతగా ప్రోత్సహిస్తాయని, అభివృద్ధికి మరిన్ని అవకాశాలు కల్పిస్తాయని అన్నారు.
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్రమైన మాసం వారి జీవితాల్లో మంచి రోజులు తేవాలని కోరుకుంటున్నానని అన్నారు.
రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోందని, పర్యాటకులు అమితంగా ఇష్టపడే రోప్ వేలు పలు విహార, ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 25 ప్రముఖ విహార, ఆధ్యాత్మిక కేంద్రాల్లో రోప్ వేలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించిందని అన్నారు. ఇంద్రకీలాద్రి, శ్రీశైలం రోప్ వే లకు అనుమతులు లభించగా గండికోటలో రోప్ వే నిర్మాణ దశలో ఉందని అన్నారు.