– ఎమ్మెల్సీ సోము వీర్రాజు
గుంటూరు : భారతీయ జనతా పార్టీ సిద్ధాంత కర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 109వ జయంతి కార్యక్రమం ఇక్కడి జేకేసీ కాలేజీ రోడ్ లోని మోర్యా ఫంక్షన్ హాల్ లో గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతి రావు సభాధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించి, మాట్లాడారు.
జనసేవకుడు, తత్వవేత్త, భారతీయ జన సంఘ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులలో ఒకరు అయినా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25న జన్మించి భారత రాజకీయ చరిత్రలో ప్రసిద్ధుడిగా పేరు పొందారన్నారు. జన సంఘ పార్టీకి సైద్ధాంతిక స్తంభంగా నిలిచారని, ఆయన ప్రతిపాదించిన “అంత్యోదయ” సిద్ధాంతం పేదల శ్రేయస్సు, సేవపై ప్రధాన భూమిక పోషిస్తోందన్నారు.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మా మనవాత వాదంతో సమాజానికి మార్గదర్శనం చేశారు. ఈ సమాజంలో చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరాలని ఆయన అన్నారు. ఆ రోజుల్లో వారే పార్టీ వ్యవహారాలు అన్ని చూసుకునేవారు. కార్యకర్తలతో వారు చాలా సౌమ్యంగా ఉండేవారు. ఈ దేశంలో పండిట్ ఉపాధ్యాయ అనే వ్యక్తి ఇద్దరు గనక ఉంటే ఈ దేశగతిని మార్చేసేవాడని ఒక సందర్భంలో డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ అన్నారు అంటే వారి సామర్ధ్యం ఏమిటో మనందరం తెలుసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు జూపూడి రంగరాజు, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయ ప్రకాష్ నారాయణ, అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్, పార్లమెంట్ కన్వీనర్ భీమినేనిచంద్రశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యడ్లపాటి స్వరూపారాణి, తదితరులు పాల్గొన్నారు.