– పరుగులు పెట్టని ‘నాలుగో సింహం’
– కొందరు ఐపిఎస్‌ల పనితీరుపై కూటమి నేతల పెదవి విరుపు
– గతంలో ఎస్పీలు తిరస్కరిస్తే బాబు పర్యటనకు కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోలేదా?
-ఇప్పుడు జగన్‌కూ అదే సిద్ధాంతం ఎందుకు అమలుచేయరన్న ప్రశ్నలు
– సింగయ్య మృతి కేసులో ఇప్పటిదాకా కనిపించని శాఖాపరమైన చర్యలు
– వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌తో ఫోన్లో మాట్లాడిన సీఐని ఇప్పటిదాకా గుర్తించని వైఫల్యం
– ఎస్పీకి ప్రెస్‌నోట్ ఇచ్చిన ఎస్బీ సీఐలను వదిలేసినట్లేనా?
– రేంజి ఐజీ ఉండగా ప్రెస్మీట్లో ఎస్పీ ఎలా మాట్లాడతారు?
– డ్యూటీలో ఉన్న సీఐలపై చర్యలేవీ?
– అందులో ఇద్దరికి వైసీపీ ముద్ర?
– వారికి లోకేష్ నియోజవర్గంలో పోస్టింగులా?
– అందులో ఒకరికి గతంలో మాజీ మంత్రి రజనీ దన్ను
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఏ ప్రభుత్వానికయినా పోలీసులే కళ్లు, ముక్కు, చెవులు. అన్నీ! సహజంగా ఏ పాలకులయినా తమకు అనుకూలంగా ఉండేవారినే ఎస్ఐ నుంచి డీజీపీ వరకూ నియమించుకుంటారు. ఇందులో ఎలాంటి దాపరికాలు లేవు. అంతేగానీ.. తమను అర్ధరాత్రి ఏడు కిలోమీటర్లు సెల్‌ఫోన్ వెలుగులో నడిపించిన వారిని.. తమను జైళ్లలో పెట్టించిన వారిని.. కేసులతో కోర్టుల చుట్టూ తిప్పినవారిని.. గుండెపై కూర్చుని వికటాట్టహాసం చేసిన వారిని.. పాదయాత్రలకు అడ్డంపడి, వాహనాలను సీజ్ చేసిన వారికి మంచి పోస్టింగులివ్వరు. అలా ఇచ్చారంటే.. అది కచ్చితంగా మంచి ప్రభుత్వమే అయి తీరాలి!
ఒక వ్యక్తిపర్యటనలో ఒక వృద్ధుడు ఆయన కారు టైర్ల కింద నలిగి నజ్జయి చనిపోతే సహజంగా ఎవరినో ఒకరిని అరెస్టు చేస్తారు. కానీ అదే స్థానంలో విపక్షనేత ఉంటే, అతనిచుట్టూ కేసుల చట్రం బిగించేస్తారు. అసలు అక్కడ డ్యూటీ చేసే సీఐలతో విపక్ష పార్టీ ఎమ్మెల్సీ ఫోన్ చేసి సమాచారం సేకరిస్తుంటే.. ఆ ఫోన్ అందుకున్న సదరు విభీషణులెవరో తేల్చి, వారిపై చర్యల కొరడా ఝళిపిస్తారు.. ఆ జిల్లాలో విపక్షపార్టీకి అనుకూలంగా పనిచేసే స్పెషల్‌బ్రాంచి కానిస్టేబుల్ నుంచి- సీఐలవరకూ ఎవరో గుర్తించి, యుద్ధప్రాతిపదికన బదిలీ చేస్తారు. కొత్త పాలకులు వచ్చి ఏడాది దాటుతున్నా అది జరగలేదంటే.. అది కచ్చితంగా ‘మంచి ప్రభుత్వమే’ అయి ఉండాలి. నో డౌట్! అది నిస్సందేహంగా మంచి ప్రభుత్వమే!!
టీడీపీ నాయకత్వంలోని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతోంది. అదేదో ఇప్పుడే కొత్తగా అధికారంలోకి వచ్చినట్లు బాలారిష్టాలు, ‘తప్పు’టడుగులు! ప్రధానంగా పోలీసు శాఖలో పోస్టింగుల వింత తమ్ముళ్లను విస్మయానికి గురిచేస్తోంది. చంద్రబాబు నాయుడు విపక్షనేతగా ఉన్నప్పుడు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తుండగా, ఆయనను అనుమతి లేదని రాత్రి నిలిపివేస్తే.. బాబు పోలీసులను ధిక్కరించి ఆ చీకటిలో సెల్‌ఫోన్ వెలుగులో కార్యకర్తలతో కలసి 7 కిలోమీటర్లు నడిచారు.
అలా బాబును రాత్రి వేళ సెల్‌ఫోన్ వెలుగులో నడిపించిన నాటి సీఐ.. ఇప్పుడు టీడీపీలోని ఓ నేత ఆశీస్సులతో, అమలాపురం జిల్లా కీలక విభాగంలో చక్రం తిప్పుతున్నారని ఎవరైనా ఊహించగలరా? కానీ ఇప్పుడు జరుగుతోంది అదే. లోకేష్ యువగళం, బాబు పర్యటన లు అడ్డుకుని పార్టీ జెండాలు-మైకులు తొలగించిన పోలీసులు, ఇప్పుడు మంచి పోస్టింగుల్లో ఉన్నారని ఎవరైనా ఊహిస్తారా? కానీ ఇదీ నిజమే!
జగన్ జమానాలో నాలుగున్నరేళ్ల పాటు పోస్టింగులు లేకుండా, చివరి ఆరునెలల్లో లూప్లైన్లకు నెట్టివేయబడ్డ కమ్మ-కాపు అధికారులు, ఇంకా పోస్టింగుల కోసం చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారని ఎవరైనా ఊహించగలరా? గుంటూరు రేంజిలో ఇంకా వెయిటింగ్‌లోనే ఉన్న ఈ రెండు కులాలకు చెందిన పోలీసు అధికారులు చేసిన పాపమేమిటంటే.. అంతకు ఐదేళ్ల టీడీపీ హయాంలో, ఆ పార్టీకి కొమ్ముకాయడమన్న ఆరోపణలట! మరి తమ కోసం.. తమ వల్ల..తమ గురించి బాధితులయిన వారికి, మంచి పోస్టింగులిచ్చి న్యాయం చేయాల్సిన బాధ్యత పాలకపార్టీలదే కదా? ఏబీ వెంకటేశ్వరరావుకే దిక్కులేకపోతే ఇక మమ్మల్ని పట్టించుకునేదెవరు? అంటే అవసరానికి వాడుకుని వదిలేస్తారా? అన్న వారి ప్రశ్నలకు బదులిచ్చేదెవరు?
రాష్ట్రంలో గత ఏడాది క్రితం జరిగిన ఐపిఎస్-డీఎస్పీ-సీఐ నియామకాలన్నీ కేవలం ఇద్దరి కనుసన్నుల్లోనే జరిగాయన్నది పోలీసు-పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కీలక మంత్రి బ్యాక్ ఆఫీసు పర్యవేక్షణలో.. మాజీ డీజీపీ ఒకరు, మాజీ ఐజి ఒకరు ఆ నియామకాలు చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. ఇప్పుడు కూడా పోలీసు అధికారుల పోస్టింగ్ ముసాయిదాను, వారి దివ్య సముఖానికే పంపారన్న చర్చ జరుగుతోంది.
నిజానికి జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో వారిద్దరూ పోలీసు డ్రెస్ డ్యూటీలో లేరని, అందులో ఒకరు హైదరాబాద్‌కే పరిమితమయ్యారని.. అలాంటి వారికి పోస్టింగ్ బాధ్యతలు అప్పగిస్తే, జగన్ బాధితులు ఎవరో వారికి ఎలా తెలుస్తుందని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఆ క్రమంలో చేసిన ఎంపిక వైఫల్యమే ఇప్పటి పరిస్థితికి ప్రధాన కారణమన్నది టీడీపీ సీనియర్ల విశ్లేషణ.
ముఖ్యంగా రేంజి ఐజీలలో ఇద్దరు, ముగ్గురు మినహా మిగిలిన వారంతా విఫలమయ్యారన్న చర్చ జరుగుతోంది. ప్రధానంగా రాష్ట్రంలో కీలకమైన జిల్లాకు సంబంధించిన ఒక రేంజి ఐజీ..ఎమ్మెల్యేలతో మాట్లాడుకుని, తనకు నచ్చిన సీఐలను అక్కడ పోస్టింగు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్పెషల్‌బ్రాంచి సహా, జిల్లాలో తనకంటూ ఒక టీమ్‌ను ఏర్పాటుచేసుకున్నారన్న వ్యాఖ్యలు కూడా పోలీసు-పార్టీ వర్గాల్లో లేకపోలేదు.
జగన్ జమానాలో విపక్షంలో ఉన్న టీడీపీ నాయకులెవరూ మూడున్నరేళ్లు రోడ్డెక్కిన దాఖలాలు లేవు. ఒకవేళ ధైర్యం చేసి బయటకొచ్చిన వారిపై పోలీసులు దారుణమైన కేసులు బనాయించారు. సోషల్‌మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని కేసులతో వేధించారు. చివరకు వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు అంకబాబు లాంటి వారినీ విడిచిపెట్టకుండా వేధించి, వె ంటాడారు.
పాలకుల మెరమెచ్చుల కోసం పోలీసులు సాగిలబడి టీడీపీ శ్రేణులకు బయటకురావాలంటే వణికిపోయే పరిస్థితి కల్పించారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు-మంత్రులుగా ఉన్న చాలామంది హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో వ్యాపారాలు-పేకాటలతో కాలక్షేపం చేసేవారు. ఇంకొందరు తెలివైన యువనేతలు వైసీపీ వారితో తెరచాటు వ్యాపారాలు-స్నేహాలు కొనసాగించారు. ఇప్పటికీ చాలామంది ఎమ్మెల్యేలు-మంత్రులు వైసీపీ నేతలతో కలసి, తెరచాటు వ్యాపారాలు చేస్తున్నారన్నది పార్టీ వర్గాల ఆరోపణ. అది వేరే విషయం.
మరికొంతమంది జగన్ భయానికి నియోజకవర్గ ఇన్చార్జిలు కూడా తీసుకునేందుకు ముందుకురాని దుస్థితి. చంద్రబాబునాయడు, లోకేష్ మినహా ఎవరూ బయటకు రాని పరిస్థితి ఉండేది. నాడు ఐజి నుంచి ఎస్ఐ వరకూ వైసీపీ నేతలు చెప్పిందే చేశారు. వారి దన్నుతో చట్టాలను కూడా కాలరాశారు. ఎవరూ కూడా తాము ఈ పనిచేయమని చెప్పినవారు లేరు. ఎవరిపై కేసు పెట్టమంటే ముందూ వెనకా చూడకుండా పెట్టేశారు.
అంతవరకూ జగన్ సర్కారుపై ఒంటికాలిపై లేచి యుద్ధం చేసింది ఒక్క రఘురామకృష్ణంరాజు మాత్రమే. ఆయనే ఢిల్లీలో ఏపీ ప్రజల గొంతుకయ్యారు. రచ్చబండ పేరుతో జగన్ సర్కారు అవినీతిని ఉతికి ఆరేయడమే కాదు. ప్రధాని నుంచి సుప్రీంకోర్టు వరకూ వెళ్లి, కూటమి ఆశలను సజీవంగా ఉంచారు. జగన్ జమానాలో అసలు హీరో ఆయనే!
ఆ తర్వాత టీడీపీ ఆఫీసుపై వైసీపీ శ్రేణుల దాడితో టీడీపీలో కొద్దిగా కదలిక, పౌరుషం వచ్చింది. ఆ తర్వాత విశాఖలో పవన్ బస చేసిన హోటల్‌పై పోలీసుల దాడి.. చంద్రబాబు ఆయనను స్వయంగా కలసి మద్దతునివ్వడం.. ఆ తర్వాత చంద్రబాబు అరెస్టు.. దానిని ఖండిస్తూ హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల భారీ నిరసనలు.. స్వయంగా జైలుకు వెళ్లి చంద్రబాబును కలసి టీడీపీతో పొత్తు ప్రకటన.. దేశ-విదేశాల్లో నిరసన ప్రదర్శనలు.. కమ్మ-కాపువర్గాల కసి-యుద్ధక్షేత్రంలో టీడీపీ కార్యకర్తల పోరాట ఫలితంగా మాత్రమే టీడీపీ అధికారంలోకి రాగలిగింది.
సూటిగా చెప్పాలంటే.. అది కూటమి గొప్పతనం కాదు. జగన్‌పై జనంలో నిండిపోయిన ద్వేషం, వ్యతిరేకత మాత్రమే తప్ప ఎవరి ప్రతిభ కాదన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా.. కేవలం తమ వల్లే అధికారంలోకి వచ్చిందన్న కొందరి వ్యవహారశైలి సీనియర్ల విమర్శలకు తావిస్తోంది.
నెలరోజుల క్రితం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సత్తెనపల్లి పర్యటనలో సింగయ్య అనే వృద్ధుడు.. గుంటూరు పట్టణంలో జగన్ ఉన్న కారు టైర్ల కింద పడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆ తర్వాత ఆ కారు వైసీపీ యువనేత దేవినేని అవినాష్ అనుచరుడిదంటూ సోషల్‌మీడియాలో, కారు ఫొటోలతో కొత్త కథ ప్రచారంలో పెట్టారు. దానితో ఆ కేసు నాలుగురోజులు దాని చుట్టూనే తిరిగింది.
ఈ క్రమంలో గుంటూరు ఎస్పీ, రేంజి ఐజీతో కలసి ప్రెస్‌మీట్ నిర్వహించి, సింగయ్య మృతి కేసులో జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఆ కారు ఆయనది కాదని ప్రకటించారు. సహజంగా ఎస్పీ కంటే రేంజి ఐజి ఉన్నతాధికారి. అలాంటిది ఐజి ఉండగా.. ఆయన వివరాలు వెల్లడించకుండా, ఎస్పీతో ఎందుకు మాట్లాడించారన్నది ఎవరికీ అర్ధం కాలేదు. అసలు ఎస్పీకి ఆ వివరాలు ఎవరిచ్చారన్నది కూడా చాలారోజులు తెలియలేదు.
జిల్లా స్పెషల్‌బ్రాంచికి చెందిన సీఐలు ఇచ్చిన సమాచారం ప్రకారమే ఎస్పీ, ఆ ఘటనలో జగన్ కారు తప్పు లేదని చెప్పాల్సి రావడం ఆశ్చర్యం. తర్వాత సీసీ టీవీ పుటేజీలు పరిశీలించిన పోలీసులు, ఆ కేసులో జగన్‌ను కూడా చేర్చారు. మరి విధి నిర్వహణలో విఫలమవడమే కాకుండా.. ఎస్పీకి తప్పుడు సమాచారం ఇచ్చిన స్పెషల్‌బ్రాంచ్ అధికారులపై ఇప్పటివరకూ చర్యలు తీసుకోకపోవడమే ఆశ్చర్యం. దీన్నిబట్టి జగన్ కేసును పోలీసు శాఖ ఎంత సీరియస్‌గా తీసుకుంటుందో కనిపిస్తూనే ఉంది.
గుంటూరు జిల్లా ఎస్బీలో ఇంకా పాత వాసనలే
స్పెషల్ బ్రాంచి అనేది పోలీసుశాఖకు గుండెకాయ వంటిది. స్థానికంగా ఎప్పటికప్పుడు జరిగే అంశాలపై సమాచారం సేకరించి, వాటిని పై అధికారులకు పంపించడమే వారి ప్రధాన విధి. ఇందులో బాగా చురుకుగా ఉండేవారినే కానిస్టేబుల్, ఎస్ఐ,సీఐలుగా నియమిస్తుంటారు. జిల్లాల్లో ఎస్బీ సీఐ పవర్ఫుల్. ఇదీ ఎస్బీ పనిచేసే ప్రక్రియ! అయితే క్షేత్రస్థాయిలో సమాచారం కోసం ఇందులో అన్ని కులాల వారినీ నియమిస్తుంటారు. ఆయా కులాలలకు చెందిన పార్టీల నాయకులు, వివిధ సంఘాల నాయకుల నుంచి సమాచార సేకరణకు, ఇది కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్న పద్ధతి.
కాగా గుంటూరు జిల్లా స్పెషల్ బ్రాంచిలో దాదాపు 50 మంది పనిచేస్తున్నారు. అయితే వారిలో గత ప్రభుత్వంలో పనిచేసిన వారినే ఇంకా కొనసాగిస్తున్నారని.. అందులో తొలినుంచీ వైసీపీకి మానసిక మద్దతుదారులుగా కొనసాగుతున్న రెండు మతాలకు చెందిన వారు, దాదాపు 25 మంది ఉంటారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వారిని బదిలీ చేయకపోవడం వల్ల వైసీపీకి ప్రభుత్వ సమాచారం తెలుస్తోందని, ఈ కోణంపై జిల్లా అధికారులు ఇప్పటిదాకా దృష్టి పెట్టకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
అయితే వీరిలో ఇద్దరు అధికారులు సుదీర్ఘకాలం నుంచి జిల్లాలోనే పనిచేస్తున్నారని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యేల ద్వారా, అక్కడే పాతుకుపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీరివద్ద పనిచేసే కిందిస్థాయి కానిస్టేబుళ్లను కూడా, గుంటూరు పరిసరాల్లోనే పోస్టింగులిప్పిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.
జిల్లాలో అనేక దందాలు నడిపించే వారితో వీరంతా సన్నిహితంగా ఉంటారన్న వ్యాఖ్యలు చాలా ఏళ్ల నుంచి వినిపిస్తున్నా, ఇప్పటివరకూ వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవంటున్నారు. గుట్కా, రేషన్‌బియ్యం, పేకాట క్లబ్బులు, ఇసుక దందాలు చేసే వారి నుంచి వీరికి నెలవారీ సేవలు అందుతుండటం వల్ల.. చాలామంది అక్కడ నుంచి మరో విభాగానికి వెళ్లేందుకు ఇష్టపడటం లేదంటున్నారు. కాగా సుదీర్ఘకాలం నుంచి ఇక్కడే పనిచేస్తున్న ఇద్దరు అధికారులకు.. రేంజి స్థాయిలో ఒక అధికారి ఆశీస్సులున్నాయన్న ప్రచారం పోలీసువర్గాల్లో జరుగుతోంది.
సహజంగా ప్రభుత్వం మారిన తర్వాత స్పెషల్ బ్రాంచ్, ఇంటలిజన్స్ విభాగాల్లో మార్పులు చేస్తారని, కానీ గుంటూరు స్పెషల్ బ్రాంచిలో మాత్రం, వైసీపీలో పనిచేసిన వారే ఇంకా కొనసాగుతుండటం ఫలితంగానే.. రాజధాని జిల్లాలో వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారన్న వ్యాఖ్యలు టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. గుంటూరు నగరంలో ఒక ఎస్బీ కానిస్టేబుల్ దాదాపు 13 ఏళ్ల నుంచి పోలీసుస్టేషన్లు మారుతూ, అక్కడే తిష్ఠ వేసుకుని.. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మారడం వెనక ఓ అధికారి ప్రోత్సాహం ఉందని పోలీసులే చెప్పడం విశేషం.
వైసీపీ హయాంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన ఓ మహిళా కానిస్టేబుల్‌ను.. టీడీపీ వారితోపాటు హత్యకేసులో ఇరికించేందుకు, నాటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రయత్నించారు. దానికి సదరు ఎస్బీ కానిస్టేబుల్ సహకరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇటీవలి కాలంలో జగన్ సహా.. నందిగం సురేష్, మాజీ ఎంపి మాధవ్ వంటి నేతలంతా రాజధాని జిల్లాపైనే దృష్టి సారిస్తుండటం, అది కాస్తా వివాదమవుతున్న వైనాన్ని విశ్లేషిస్తున్నారు.
ఆ ఇద్దరికీ మంగళగిరిలో పోస్టింగులా?
అవి జగన్ సీఎంగా.. రజనీ మంత్రిగా ఉన్న రోజులు. గుంటూరు నగరంలో చంద్రబాబు-లోకేష్ ఫోటోలతో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకున్న టీడీపీ కార్యకర్తలను అక్కడి సీఐ అక్రమకేసులు పెట్టి దారుణంగా వేధించారు. తరచూ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనే యువకులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులను రూముల నుంచి తీసుకువచ్చి కేసులు పెట్టారు. ఇప్పుడు ఆ అధికారికి మంత్రి లోకేష్ ్ర పాతినిధ్యం వహిస్తున్న మంగళగరి నియోజకవర్గంలో పోస్టింగ్ ఇవ్వడం విశేషం. ఇక వైసీపీ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో అంటకాగిన మరో పోలీసు అధికారికి కూడా ఏరికోరి మంగళగిరిలోనే పోస్టింగు ఇవ్వడంపై గుంటూరు జిల్లా టీడీపీ కార్యకర్తల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
‘‘వారిని అక్కడికి సిఫార్సు చేసిందెవరు? మంత్రి రజని ఏరికోరి పోస్టింగు ఇప్పించిన వ్యక్తి లోకేష్ నియోజకవర్గంలో ఎంత విశ్వసనీయతతో పనిచేస్తారు? అసలు వైసీపీ హయంలో లా అండ్ ఆర్డరులో పనిచేసినవారికి లూప్‌లైన్ పోస్టింగులివ్వకుండా, మళ్లీ లా అండ్ ఆర్డర్ పోస్టింగులు ఎలా ఇస్తారు? లోకేష్‌బాబు సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక రాష్ట్రంలో ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదని’’ఓ సీరియర్ నేత వ్యాఖ్యానించారు. కాగా ఇటీవలి జగన్ పర్యటనలో ఆ పోలీసు అధికారులు కూడా బందోబస్తులో ఉన్నప్పటికీ, సింగయ్య కారు కింద పడిన వైనాన్ని పై అధికారులకు సమాచారం ఇవ్వకపోవడంపై చర్చ జరుగుతోంది. సింగయ్య మృతి వీడియోలు చానెళ్లలో వచ్చిన తర్వాతనే పోలీసులు జగన్‌పై కేసు పెట్టడం గమనార్హం.
‘నిఘా’ నిర్వీర్యమవుతోందా?
పాలకులకు పోలీసు శాఖలో ఇంటలిజన్స్ విభాగం నమ్మకమైన వ్యవస్థ. తాము చేయబోయే నియామకాలతోపాటు.. ఫలానా వారి గురించి సమాచార సేకరణకు, ఏ పాలకులయినా నిఘా విభాగంపైనే ఆధారపడతారు. గతంలో సచివాలయంలో మంత్రుల వద్ద పీఏ, పీఎస్, ఒఎస్డీలను తీసుకోవాలనుకుంటే.. ఆయా ఉద్యోగుల పేర్లను ముందుగా నిఘా విభాగానికి పంపిస్తారు. అక్కడి నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే వారికి పోస్టింగులు ఇచ్చేవారు. ఎస్ఐ, సీఐ, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీ, ఐజిల నియామకం ముందు చేసే కసరత్తులో భాగంగా, వారి పేర్లను నిఘా విభాగానికి పంపిస్తుంటారు. ఆ ప్రకారంగా పోస్టింగులు ఇస్తున్నాంటారు.
మీడియాలో అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులపై వచ్చే కథనాల గురించి కూడా, నిఘా విభాగం ద్వారానే పాలకులు ఆరా తీస్తుంటారు. అసలు ఏ సీఎం ఉన్నా ముందుగా ఉదయాన్నే ఆయనను కలిసేది ఇంటలిజన్స్ ఉన్నతాధికారే. ఆ భేటీలో నిన్నటి వరకూ జరిగిన విశేషాలపై సీఎంకు బ్రీఫింగ్ ఇస్తుంటారు. తర్వాత వాటి వివరాలు సీఎంకు అందిస్తుంటారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు, ఆయన ఆదేశాలతో ప్రభుత్వ చీఫ్ విఫ్‌గా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డికి సైతం ఒక కాపీ ఇచ్చేవారు.
కానీ గత ఏడాది నుంచి రాష్ట్రంలో ఇంటలిజన్స్ విభాగానికి, పొలిటికల్ వింగ్‌కు సంబంధించి పెద్దగా పనిలేకుండా పోయింది. ఎందుకంటే ఏ నియామకం గురించిన ముందస్తు సమాచారం నిఘాకు రాదు. వారి గురించి వివరాలు సేకరించాలన్న ఆదేశాలు రావు. అన్నీ ప్రత్యేకంగా ఏర్పాటుచేసుకున్న తెరవెనక ప్రైవేటు వ్యవస్థలే ఆ పనిచూసుకుంటున్నాయి.
చివరకు ఎస్ఐ, సీఐ, డీఎస్పీ, ఎస్పీల పోస్టింగులు కూడా నిఘా విభాగానికి వెళ్లడం లేదన్నది ఒక ప్రచారం. పార్టీకి సంబంధించిన వివిధ వ్యవస్ధలే ఇప్పుడు ఇంటలిజన్స్ అధికారుల పనిచేస్తున్నందున, ఫలితాలు కూడా అదే స్థాయిలో కనిపిస్తున్నాయి. ఎవరి పని వారు చేయకపోవడం వల్లనే సమర్ధులు తెరవెనక, అసమర్ధులు తెరపైకి వస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇంతకూ తలశిల ఫోన్ చేసిందెవరికో తేల్చారా?
వివాదాస్పదమైన జగన్ గుంటూరు జిల్లా పర్యటనలో సింగయ్య మృతి కేసు అనంతర పరిణామాలు, పోలీసుల ప్రతిష్ఠను ఇంకా విజయవంతంగా వెక్కిరిస్తూనే ఉన్నాయి. ఆ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే తలశిల రఘురామ్, గుంటూరుకు చెందిన ఓ ఎస్బీ అధికారితో ఫోన్లో మాట్లాడారు. అక్కడి పరిణామాలు తెలుసుకుని, అందుకు తగినట్లుగా స్కెచ్ వేశారన్న కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ సంఘటన జరిగి నెలరోజులవుతున్నా, ఇప్పటివరకూ తలశిల రఘురామ్‌తో ఫోన్లో మాట్లాడిన ఎస్బీ అధికారి ఎవరు? ఆ రోజు జిల్లా ఎస్పీకి ప్రెస్‌మీట్‌కు ముందు నోట్ ఇచ్చిన ఎస్బీ అధికారి ఎవరన్నది, ఇప్పటిదాకా తేల్చకుండా మీనమేషాలు వేస్తున్నారంటే.. నత్తలు కూడా నాలుగోసింహాన్ని చూసి ఎందుకు నవ్వుకోవన్నది, సోషల్‌మీడియా వేదికగా పసుపు సైన్యం సంధించే వ్యంగ్యాస్త్రం!
జగన్ పర్యటనలపై ముందస్తు ప్లాన్ ఏదీ?
కాగా వైసీపీ అధినేత జగన్ ఇటీవలి జిల్లా పర్యటనల్లో జిల్లా ఎస్పీలకు ముందస్తు ప్లాన్ లేకుండా పోయిందన్న విమర్శలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గతంలో చంద్రబాబునాయుడు, లోకేష్ పర్యటనకు అనేక సందర్భాల్లో జిల్లా ఎస్పీలు అనుమతి నిరాకరించేవారు. మరికొందరు షరతులతో అనుమతులిచ్చేవారు. దానితో టీడీపీ లీగల్ సెల్ కోర్టుకు వెళ్లి వారి పర్యటనలకు అనుమతి సాధించేది. ఇక అమరావతి రైతుల న్యాయస్థానం టు దేవస్థానం తిరుమల పాదయాత్రకు సైతం ఎస్పీ అనుమతివ్వలేదు.
దానితో కోర్టుకెళ్లిన రైతులకు.. ఇంత మందికి మించి ఉండకూడదని, వారి ఆధార్‌కార్డులు పోలీసులకు సమర్పించాలని ఆదేశించింది. అయినా నాటి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి ఎస్పీలు-డీఎస్పీ-సీఐలు ఓవరాక్షన్ చేసి అడుగడుగునా అడ్డుకున్నారు. వారికి ఎక్కడా తినడానికి భోజనాలు లేకుండా కల్యాణమండపాలు ఇవ్వకుండా చేశారు. దానితో వారు రోడ్లపై వంట చేసుకున్నారు. ఇవన్నీ మీడియాలో వచ్చినవే. రహస్యమేమీ కాదు. అయితే విశేషమేమిటంటే.. ప్రకాశం-నెల్లూరు జిల్లాల్లో అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకున్న పలువురు సీఐ, డీఎస్పీలకు.. టీడీపీ ‘మంచిప్రభుత్వం’లో కూడా, కీలక స్టేషన్లలో పోస్టింగులు ఇవ్వడమే విశేషం. చీరాల, బాపట్ల నియోజకవర్గాల్లో ఇలాంటి పోస్టింగులే ఇచ్చారన్న ఆరోపణలు టీడీపీ సోషల్‌మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే.
‘‘మరి ఇప్పుడు జగన్ పర్యటనలకు కూడా గతంలో మాదిరిగానే అనుమతి నిరాకరిస్తే, ఆయన కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంటారు కదా? అప్పుడు కోర్టువారే జన సంఖ్యపై పరిమితులు విధిస్తారు. ఒకవేళ జగన్ పర్యటనలో వాటిని ధిక్కరిస్తే ఎలాగూ కోర్టు ధిక్కార కేసులు పెట్టవచ్చు కదా? ఇలాంటి కనీస ఆలోచన ఏ ఎస్పీకి రాకపోవడం, ఆ మేరకు ప్రభుత్వానికి సలహా ఇచ్చే తెలివైన ప్రభుత్వ న్యాయవాదులు లేకపోవడం మా దురదృష్టం’’ అని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.