– బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరండి
– జనగాం బీజేపీ కార్యకర్తల ‘వర్క్ షాప్’ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు
– స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యాచరణపై దిశానిర్దేశం
జనగాం: రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యలో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇస్తున్న నిధులను గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్ట్ చేస్తూ గ్రామాల్లో అభివృద్ధి కుంటు పడేశాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు.
ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందులో బలంగా ‘‘నిధులు మావి.. జల్సాలు మీవా?’’అనే నినాదంతో జనగాం జిల్లాలో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అవకాశమిచ్చారు. ఈసారి ఒక్క ఛాన్స్ బీజేపీకి ఇవ్వండి’’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అభ్యర్ధించాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యాచరణలో భాగంగా జనగాంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన పార్టీ నాయకులతో నిర్వహించిన ‘వర్క్ షాప్’లో బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వచ్చిందన్నారు.
ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాలు, మండలాల పరిధిలో విస్త్రతంగా పర్యటించడంతోపాటు స్థానిక ప్రజల మనసులో నిలిచేలా గొప్ప గొప్ప పనులు చేయాలని కోరారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టాలని సూచించారు. నిత్యం ప్రజలకు అండగా ఉంటూ వారి కష్టసుఖాలను తెలుసుకోవాలని చెప్పారు.