-ఔషధ నియంత్రణ విభాగం బాగా పనిచేస్తే మంచి ఫలితాలు
-ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న చొరవతో ప్రత్యేకంగా కార్యాలయాలు కూడా
-మనమంతా బాగా పనిచేయాలనేది సీఎం ఆకాంక్ష
-నకిలీ మందుల విషయంలో కఠినంగా ఉండండి
-లైసెన్సుల జారీ, రెన్యువళ్ల విషయంలో అప్రమత్తత అవసరం
-ఔషధ దుకాణాలు నిబంధనల మేరకే ఉండాలి
-ఔషధ కంపెనీల ఉత్పత్తులు నిబంధనలకు లోబడే ఉండాలి
-ఏ అతిక్రమణను ఉపేక్షించొద్దు
-రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
-ఔషధ నియంత్రణ విభాగంతో రాష్ట్రస్థాయి సమీక్ష
ప్రజల శ్రేయస్సే మనందరి ఉమ్మడి లక్ష్యం కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. రాష్ట్ర సచివాలయం ఐదో బ్లాక్‌లోని కలెక్టర్ల కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం మంత్రి విడదల రజిని ఔషధ నియంత్రణ విభాగం అధికారులతో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని డ్రగ్ విభాగం అత్యంత కీలకమైనదని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఔషధ నియంత్రణ విభాగం అధికారులది ముఖ్య పాత్ర అని, ఆ మేరకు మనమంతా ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
రాష్ట్రంలో ఎక్కడా నకిలీ మందుల ఊసే ఉండకూడదని, ఈ విషయంలో ఇప్పటికే తమ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుందని, అందుకు తగ్గట్టుగా సత్ఫలితాలు వస్తున్నాయని వివరించారు. మందుల దుకాణాలకు లైసెన్సుల జారీ, రెన్యువళ్ల విషయంలో అప్రమత్తతతో ఉండాలని తెలిపారు. నిబంధనలన్నీ పాటిస్తేనే అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఔషధ తయారీ కంపెనీలు సైతం జీఎంపీ, షెడ్యూల్ ఎం ప్రకారం అన్ని నిబంధనలు పాటిస్తున్నాయో, లేదో పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
జగనన్న హయాంలో కార్యాలయాలు
ఔషధ నియంత్రణ విభాగానికి గతంలో జిల్లాల్లో ఎక్కడా కనీసం కార్యాలయాలు కూడా ఉండేవి కావని తెలిపారు. ముఖ్యమంత్రి జగనన్న ప్రతి జిల్లాకు ఒక కార్యాలయం ఉండేలా కృషి చేశారని తెలిపారు. ఇప్పటికే 11 కార్యాలయాలు సిద్ధం చేశామని చెప్పారు. మరో రెండు ల్యాబ్‌లు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. కర్నూలు, విశాఖపట్టణం ప్రాంతాల్లో ఈ ల్యాబ్‌లు అతి త్వరలోనే అందుబాటులోకి వస్తాయని చెప్పారు. డ్రగ్ విభాగానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అన్ని విధాలా అండగా ఉంటున్నారని, ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా పనిచేయాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా పనిచేయాలని సూచించారు. తరుచూ ఔషధ కంపెనీలు, ఔషధ దుకాణాల్లో తనిఖీ లు చేస్తూ ఉండాలని చెప్పారు. సీర్ యూకు వచ్చే ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని చెప్పారు. నిషేధ మందులు ఎక్కడా చెలామణిలో లేకుండా చూడాలని ఆదేశించారు. బ్లడ్ బ్యాంకుల్లో ధరల దోపిడీ లేకుండా పర్యవేక్షించాలని తెలిపారు. ఏపీ శాక్స్ నిర్ణయించిన ధరలకే రక్తపు నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు విరివిగా జరిగేలా ఔషధ నియంత్రణ విభాగం నుంచి కూడా చొరవ ఉండాలని పేర్కొన్నారు. జనరిక్ ఔషధ దుకాణాలను ప్రోత్సహించాలని, ఇక్కడ దొరికే ఔషధాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. దీనివల్ల ప్రజలకు ఆదా చేయగలిగినవారం అవుతామన్నారు. కార్యక్రమంలో ఔషధ నియంత్రణ విభాగం డీజీ రవిశంకర్ నారాయణన్, డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్, జేడీలు, డీడీలు, ఏడీలు పాల్గొన్నారు.