– ఏపీ రెరా ఛైర్ పర్సన్ ఆరే శివారెడ్డి
గుంటూరు: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, బాధ్యత, వినియోగదార్ల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (ఏపీ రెరా) నిబద్ధతతో పనిచేస్తోందని ఏపీ రెరా ఛైర్ పర్సన్ ఆరే శివారెడ్డి తెలిపారు. సోమవారం రాయపూడిలోని సిఆర్డిఏ కార్యాలయం ఎదుట నాలుగవ బ్లాకులో ఎపి రెరా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శివారెడ్డి మాట్లాడారు.
ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో స్థలాలు, అపార్ట్మెంట్లు లేదా భవనాల అమ్మకం, కొనుగోలు లేదా మార్కెటింగ్ వ్యాపారంలో పాల్గొనడానికి ముందు తప్పనిసరిగా ఏపీ రెరా అధికారిక వెబ్ సైట్ www.rera.ap.gov.in ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. ప్రాజెక్టుల నమోదు కోసం సూచించిన పత్రాలను వివరాలను అందించిన వెంటనే నిర్దేశిక కాల పరిమితిలో అనుమతి మంజూరు చేస్తామన్నారు.
రియల్ ఎస్టేట్ (నియంత్రణ, అభివృద్ధి) చట్టం ద్వారా ఇంటి కొనుగోలుదారులకు సురక్షితమైన, నమ్మకమైన, పారదర్శకమైన స్థిరాస్తి లావాదేవీలు ఉంటాయన్నారు. రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగంలోని వ్యాపారులకు, లేఅవుట్లో స్థలాలు, అపార్ట్మెంట్లో ప్లాట్లు కొనుగోలుదారులకు రెరా అధారిటీ, అధికారులు స్నేహపూర్వక వాతావరణం లో అవసరమైన సహకారం అందిస్తుందన్నారు. స్థిరాస్తి వ్యాపారుల మోసపూరితమైన వాగ్దానాలపైన వినియోగదారులు రెరా కు ఫిర్యాదు చేస్తే విచారించి సత్వరమే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.
రియల్ ఎస్టేట్ (నియంత్రణ, అభివృద్ధి) చట్టం పై రియల్ ఎస్టేట్ రంగంలోని స్టేక్ హోల్డర్స్ కు విస్తృత స్థాయిలో అవగాహన కోసం ఏపీ రెరా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతినెల ఒక జిల్లాలో 2025 డిసెంబర్ పది నుంచి 13 జిల్లాలలో 2026 డిసెంబర్ వరకు నిర్వహించనున్నామని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమ తిరుపతి జిల్లా నుంచి ప్రారంభిస్తున్నామన్నారు.
ఏపీ రెరా డైరెక్టర్ కె.నాగ సుందరి మాట్లాడుతూ రాష్ట్రంలో జనవరి 2025 నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టు నమోదు కోసం 1011 దరఖాస్తులు అందగా వాటిలో 731 కి అనుమతులు మంజూరు చేశామని, మిగతావి అవసరమైన పత్రాలు కోసం సమాచారం అందించినట్టు తెలిపారు. ఏపీ రెరా నూతన పాలకవర్గం ఏర్పడిన గత రెండు నెలల్లో 214 ప్రాజెక్టులు, 27 మార్కెటింగ్ ఏజెన్సీల ఎజెంట్స్ రిజిస్టర్ అయిందని తెలిపారు. స్థిరాస్తి వ్యాపారులపై వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తామని, వారానికి రెండుసార్లు గురువారం, శుక్రవారం బెంచి నిర్వహించి సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికీ 285 ఫిర్యాదులపై ఆర్డర్స్ జారీ చేయడం జరిగిందన్నారు. రెరాలో ప్రాజెక్టుల నమోదుకు, ఫిర్యాదులు అందించేందుకు అవసరమైన సహకారం కోసం ప్రత్యేకంగా రేరా కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని చెప్పారు.
సమావేశంలో ఏపీ రెరా సభ్యులు ఏ. జగన్నాధ రావు, ఎం. వెంకటరత్నం, డి. శ్రీనివాసరావు, యు.ఎస్.ఎల్.ఎన్ కామేశ్వరరావు, జె కులదీప్ పాల్గొన్నారు.