Suryaa.co.in

Andhra Pradesh

ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చటమే కూటమి లక్ష్యం

– అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లకు అదనంగా మరొక 50,000 అందిస్తున్నామన్న ఎమ్మెల్యే గోరంట్ల

రాజమహేంద్రవరం: ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు రాజమహేంద్రవరం రూరల్ మండలం పరిషత్ కార్యాలయం నందు మరియు కడియం మండల పరిషత్ కార్యాలయం నందు అసంపూర్తిగా నిలిచిపోయిన గృహ నిర్మాణ లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశాలకు ముఖ్యఅతిథిగా రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో ప్రజలను పూర్తిగా దగా చేసిందని, నియోజవర్గంలో ఉండే ప్రజలకు చాలా దూర ప్రాంతాలలో స్థలాలు కేటాయించి, మోకాళ్ళ లోతు నీరు ఉండే ప్రాంతంలో స్థలాలు చూపించి ప్రజలను నట్టేట ముంచేసిందని ఎద్దేవా చేశారు.

గృహ నిర్మాణంలో ఎస్సీ ఎస్టీ, బీసీలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అసంపూర్తిగా నిలిచిపోయిన గృహ నిర్మాణాలు పూర్తి చేసేందుకు అదనంగా మరొక 50 వేల రూపాయలు లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని, ఏ విధమైన మధ్యవర్తులు లేకుండా లబ్ధిదారుల ఖాతాకు నేరుగా డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. రూరల్ మండలంలోని తొర్రేడు కాతేరు, కోలమూరు, పిడింగయ్యి గ్రామాలలో 129 మంది లబ్ధిదారులకు మరియు కడియం మండలంలోని కడియపులంక, కడియం, జెగురుపాడు, ఎమ్మార్ పాలెం, దుళ్ళ, మురమండ, పొట్టిలంక, వీరవరం, దామిరెడ్డిపల్లి గ్రామాలలో 79 మంది లబ్ధిదారులకు వారి ఖాతాలకు సొమ్ములు జమ చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి సత్య ప్రసాద్, ప్రత్యేక అధికారి ఎన్.జ్యోతి, ఎం.పీ.డీ.వోలు డి.శ్రీనివాస్, కె.రమేష్ రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, మార్ని వాసుదేవ్, మార్గాని సత్యనారాయణ,బోడపాటి గోపీ, కురుకురు కిషోర్, ఆళ్ల ఆనందరావు, ముద్రగడ జెమ్మి, ప్రత్తిపాటి రామారావు చౌదరి, నిమ్మలపూడి గోవిందు, పెన్నింటి ఏక బాబు, బొరుసు సుబ్రమణ్యం, బోప్పన్ నానాజీ, హౌసింగ్ ఏ.ఈ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE