-మాజీ మంత్రి కళా వెంకట్రావు
వరద సహాయం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వరద బాధితుల విషయంలో జగన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నా విగ్రహ పుష్టి నైవేద్యం నష్టి అన్న తీరున వున్నారు. వ్యవస్థల్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇష్టమొచ్చినట్లుగా ఆడిస్తున్నారు. ప్రశ్నించినవారిపై తప్పుడు కేసులు పెట్టడం, నిర్బంధించడం, బాధించడం చేస్తు్నారు. ప్రకృతి విపత్తులు వచ్చినపుడు ఏ విధంగా ఎదుర్కోవాలి అనే కోణంలో ఆలోచించడంలేదు. ప్రభుత్వం తీసుకొన్న అరకొర చర్యలు పూర్తిగా విఫలమయ్యాయి.
నేడు ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతుంటే వైసీపీ నాయకులు మాత్రం నీరో చక్రవర్తుల్లా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నారు. ముఖ్యమంత్రి ఏరియల్ సర్వేకి వెళ్లొచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతోంది?, ఎలా జరుగుతోంది అని పట్టించుకోలేదు. ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో టీవీలలో స్పష్టంగా కనబడుతోంది. సమస్యలపట్ల ఆలోచన చేయకపోవడం బాధాకరం. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేకపోవటం దురదృష్టకరం. యంత్రాగం నిస్తేజంగా ఉంది. యంత్రాగం పనిచేయడానికి కావాల్సిన పరికరాలు లేవని చెప్పడం సిగ్గుచేటు.
మే, జూన్, జులై లో వచ్చే వరదల కోసం వరద సామాగ్రిని సమకూర్చుకోవాల్సిన అవసరం ప్రభుత్వ యంత్రాగానికి ఉన్నా నిర్లక్ష్యం వహించింది. దాని గురించి ప్రభుత్వానికి ఆలోచన లేకపోవడం బాధాకరం. వరదలు వస్తే ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. టీవీలలో ప్రజల బాధలు చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. జగన్ రెడ్డి ప్రతి దానికి బటాన్ నొక్కాము అని చెప్తుంటారు మరి నేడు వరద బాధితుల కోసం కూడా ఓ బటన్ నొక్కొచ్చు కదా. ఎక్కడా ఆహారం దొరకడంలేదు. పశువులను యేటి గట్ల మీద, ఎత్తైన ప్రదేశాలలో కట్టేసి ప్రాణాలు కాపాడగలిగారు తప్ప, పశు గ్రాసం అందించే పరిస్థితి లేదు. పశువుల గురించి ఆలోచించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. ఆహారం కోసం అలమటించి వచ్చిన ఆహార పొట్లాల కోసం ప్రజలు కొట్టుకొనే పరిస్థితులు కనపడుతున్నాయి.
ప్రభుత్వం, సీఎం ఉన్నా లేనట్లే. 151 మంది ఎమ్మెల్యేలు ఉండి ఉపయోగంలేదు. 150కి పై చిలుకు లంక గ్రామాలు మునిగిపోయాయి. 279 గ్రామాలు ఇబ్బందులకు గురయ్యాయి. గతంలో చంద్రబాబు నాయుడు హుదూద్ తుఫాన్ సంభవించినప్పుడు విశాఖపట్నం లో కలెక్టర్ ఆఫీస్ ముందు బస్సులో 10 రోజులు పడుకొని ప్రజలతో, యంత్రాంగంతో మమేకమై ప్రజల ఇబ్బందులు తీర్చారు. ఇలాంటి విపత్తులు వచ్చిన ప్రతిసారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రజల మధ్యలో ఉండి వారి కష్టాలు, ఇబ్బందులు తెలుసుకొని అండగా ఉండేవారు. చంద్రబాబు హాయాంలో వరదలు సంభవించినప్పుడు పునరావాస కేంద్రాలు, భోజన వసతి, పాలు, నీళ్లు, మందులు, విద్యుత్ వంటి సదుపాయాలను త్వరితగతిన ప్రజలకు అందించారు. నేడు ఆ పరిస్థితి లేదు.
ప్రస్తుత ప్రభుత్వం ఆధునిక పరికరాలను ఉపయోగించుకోవడంలేదు. 8లక్షల కోట్ల నిధులను వాడామన్నారు. అందులో 2లక్షల కోట్లు మాయమయ్యాయి. వరద బాధితులకి కేవలం కన్నీళ్లే మిగిలాయి. కేంద్రం నుంచి వచ్చిన నిధులు, రాష్ట్రం తెచ్చిన అప్పులు మాయమయ్యాయి. 1986లో వరదలొచ్చాయి, మళ్లీ అదే విధంగా 36 ఏళ్ళ తరువాత వరదలు వచ్చే అవకాశాలున్నాయని టీవీలలో ప్రసార మాధ్యమాలలో కోడై కూస్తున్నా ప్రభుత్వం స్పందించలేదు. అంత పెద్ద వరద వస్తుందని తెలిసాక తీసుకున్న చర్యలేవీ? ప్రభుత్వం వరదల విషయంలోముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ప్రజలు నేడు ముంపునకు గురై ఇబ్బందులు పడేవారు కాదు.
వైసీపీకి అధికార దర్పం తప్ప ప్రజల ఆర్తనాదాలు పట్టవు. 2020లో సరఫరా చేసిన పరికరాల కంపెనీలకు బకాయిలు చెల్లించనందున ప్రస్తుతం ఆ కంపెనీలు పరికరాలు ఇవ్వటంలేదు. కనుక వరదలలో అందించాల్సిన పరికరాలను ఎవరు సప్లైస్ చేయలేదు. వరదలకు సంబందించిన నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వలేదు.. వరదల వల్ల అంటూ వ్యాధులు ప్రబలుతున్నాయి.. వాటి గురించి కూడా ప్రభుత్వం ప్రణాళికలు ఏమి రచించడం లేదు. తూతూ మంత్రంగా కలెక్టరు, మంత్రి వెళ్లి సందర్శించి వచ్చారే తప్ప అక్కడి పరిస్థితులను పూర్తిగా తెలుసుకోలేదు. ప్రజలు వాళ్ళని పట్టించుకోవడం లేదని, సహాయ సహకారాలు అందించడం లేదని ప్రశ్నించినందున వారిపైనే ఎదురు తిరిగే పరిస్థితులలో వైసీపీ నాయకులు వున్నారు.
వరద బాధితులకు ప్రభుత్వం 75 కేజీల బియ్యం, మిగతా రేషన్ సరఫరా చేయాలి. వరద ముంపునకు గురి అయి కూలిపోయే దశలో వున్న ఇళ్లని తిరిగి నిర్మించాలని టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం. రైతులకు వెంటనే పంట నష్టాన్ని ఇవ్వాలి.పోయిన వరదల తాలూకు సహాయాన్నే ఇప్పటికీ అందించలేదని బాధితులు వాపోతున్నారు. ఎక్కడో అక్కడక్కడ క్రాప్ హాలిడే అని వినపడేది. ఇప్పుడు రాష్ట్రమంతటా క్రాప్ హాలిడే వినిపిస్తుంది. జగన్ రెడ్డి ప్రభుత్వ హాయంలో పండించే వాడు లేడు, పండిస్తే కొనే వాడు లేడు. రైతు కూలీలను కూడా బాధితులుగా గుర్తించి వారికి కూడా సహాయం అందించాలి. రైతులకు వెంటనే సహాయం చేసి రెండో పంటను వేసుకునే విధంగా సహాయం అందించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందని మాజీ మంత్రి కళా వెంకట్రావు పేర్కొన్నారు.