Suryaa.co.in

Andhra Pradesh

గోదావరి వరద భాదితులని ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం

– ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

గోదావరి వరద భాదితులని ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. దాన్ని కప్పిప్పుచ్చుకునేందుకు వరద ముంపు ప్రాంతాలలో ముఖ్యమంత్రి చేసిన పర్యటన ఈవెంట్ మేనేజ్ మెంట్ లా ఉంది. పర్యటించడానికి ప్రాంతాలను ముందే ఎంచుకోవడం జరిగింది. ఏయే ఇళ్లకు వెళ్లాలో ముందే ఎంచుకున్నారు. అక్కడకి మంత్రులు వెళ్ళి వారికి శిక్షణ ఇచ్చారు. వాలంటీర్లు మానటరింగ్ చేశారు.

జగన్ పరదాల మాటున, బారికేడ్ల చాటున పర్యటన సాగింది. ముందస్తు హౌస్ అరెస్ట్ లు చేశారు. చేసిన పర్యటనంతా కూడ మొక్కుబడి పర్యటనలా ఉందే తప్ప ఎక్కడా వరద భాదితులకు భరోసా ఇస్తున్న పరిస్థితి కనిపించలేదు. వారం రోజులు ముందుగానే పర్యటనకు వచ్చివుంటే సహాయ కార్యక్రమాలకు ఆటకం కలిగేది అని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అన్నారు. నాయకుడనే వాడు ముందుండి నడిపించాలనేది జగన్ రెడ్డి తెలుసుకోవాలి. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు వరదలొచ్చి వారం రోజులు గడిచాక పర్యటనకు వెళ్లారు. హుద్ హుద్ తుఫాను వచ్చినపుడు విశాఖపట్నంకు వెళ్లే పరిస్ధితి లేకపోయినా చంద్రబాబు నాయుడు పలు చోట్ల నుంచి మారుతూ విశాఖపట్నం చేరుకొని, కలెక్టర్ ఆఫీసులోనే 5రోజలు దగ్గరుండి బాధితులకు సహాయ సహకారాలు అందించారు.

1996లో గోదావరి జిల్లాల్లో పెనుతుఫాను వచ్చినపుడు చీఫ్ సెక్రటరీ తప్ప అన్ని ప్రిన్స్ పల్ సెక్రటరీలు రాజమండ్రిలో పెట్టి చంద్రబాబు నాయుడు మినీ సెక్రటేరియేట్ ను ఏర్పాటు చేసి వారం రోజులలోనే పరిస్థితులను చక్కదిద్దారు. నాడు చంద్రబాబు నాయుడు చేసిన సహాయాలకు భిన్నంగా నేడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తూతూ మంత్రంగా పర్యటించారు. అధికారులు ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నారని అడపాదడపా కొద్ది మందికి మాత్రం రూ.1000, 2000 లు సాయం చేశారు. జగన్ రెడ్డి వారం రోజులు ముందే వెళ్లుంటే బాధితులకు సకాలంలో సహాయ సహకారాలు అంది ఉండేవి. అక్కడ ఏటిగట్లు తెగిపోయాయి. బంగాళాఖాతంలో పలు నియోజక వర్గాలు కలిసి పోయే పరిస్థితి ఉంది. అధికారులు చేతులెత్తేశారు. ముఖ్యమంత్రి సకాలంలో పర్యవేక్షించి ఉండివుంటే ప్రభుత్వ సహకారం బాధితులకు అంది ఉండేది. యువత స్వయంగా మట్టిని మోసి గ్రామాలను కాపాడుకొనే దుర్భర పరిస్థితి ఉండేది కాదు. గోదావరి వరదలపై CWC హెచ్చరించినా ముందస్తు చర్యలు తీసుకోలేదు.

బాధితులకు అవసరమైన నిత్యావసర వస్తువులు, ఆహార పంపిణీలో కూడా ప్రభుత్వం విఫలమైంది. వరదల సమయంలో అవసరమయ్యే నిత్యావసరాలు, ఇతర సామగ్రి ముందుగా సిద్ధం చేసుకోలేదు. దీంతో ప్రజలకు కష్ట కాలంలో సాయం అందలేదు. చిన్నపిల్లలకు పాలు లేక వేడి నీళ్లు కాచి పట్టించామని చెప్పడం బాధితులని ఆదుకోవడంలో ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందో అర్థమవుతోంది. 2020 నాటి వరదల సమయంలో పడవలు, ఆహారం, మంచినీరు తదితర ఏర్పాట్లకు సంబంధించి పాత బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదని తెలిసింది. అందుకే నేడు ఏ అధికారి కూడ ప్రభుత్వం మీద నమ్మకం లేక విపత్కర పరిస్థితులలో కూడ ముందుకు రాని పరిస్థితి నెలకొనివుంది.

ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని లంకలు, పోలవరం విలీన మండలాల్లోని పలు గ్రామాలు 10 రోజుల పాటు వరద ముంపులోనే ఉండిపోయాయి. అరకొర పునరావాస కేంద్రాలు, అక్కడ కూడా కనీస వసతులు లేని కారణంగా ఏటిగట్లపైనే గుడారాలు వేసుకుని బిక్కుబిక్కుమంటూ బాధితులు కాలం వెళ్లదీశారు. వాళ్లకి ప్రభుత్వం కనీసం భోజనం, త్రాగునీటిని కూడ అందించలేకపోయింది. పక్క రాష్ట్రాలలో ముంపు ప్రాంతాలలో చిక్కుకొని ఉన్న వారికి హెలికాఫ్టర్ ద్వారా ఆహారాన్ని జారవిడిచి మరి ప్రజలకు సహాయం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ప్రజల బాధల పట్ల అప్రమత్తంగా ఉండకుండా మోద్దునిద్ర పోతుంది. 25సంవత్సరాల క్రితం కూడ హెలికాఫ్టర్ ద్వారా ప్రజలకు సహాయం చేసేవారు. టెక్నాలజీ పెరిగినా, బడ్జెట్ పెరిగినా జగన్ మాత్రం ప్రజలకు చేయాల్సిన సహాయాల పట్ల జాప్యం చేస్తున్నారు. ప్రజలు తిరిగి తమ ఇళ్లకు వెళ్లినా ఇల్లు పాడైపోయి వస్తువులు పాడై బాధా అవస్థల్లో ఉంటున్నారు. కనీసం ఈ ముఖ్యమంత్రి ఓదార్చి ఊరడించడంలేదు .

10లక్షలు ఆర్ అండ్ ఆర్ ప్యాకెజ్ ఇస్తాం అన్నారు నేడు పది రూపాయలు ఇవ్వని పరిస్ధితి. 2013 ముందు ఆర్ అండ్ ఆర్ ప్యాకెజ్ అందుకున్న వారికి కూడ కొత్త ప్యాకెజ్ ఇస్తాం అని పాదయాత్రలో అన్నారు . నేటికి ఆ మాట మరోసారి ఎత్తని పరిస్థితి. పొరుగున తెలంగాణలో నష్టపోయిన కుటుంబాలకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇచ్చారు. రాష్ట్రంలో మాత్రం వెయ్యి, రెండువేల రూపాయలతోనే సరిపెట్టారు. జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులని బట్టి సరిహద్దు విలీన ప్రాంత ప్రజలు వాళ్లు తెలంగాణలో ఉంటేనే మెరుగైన సదుపాయాలు అందుతాయని ప్రజలలో కూడ వ్యతిరేకత వచ్చింది.
పునరావస కేంద్రాలకు 2000కోట్ల అయితే ప్రభుత్వం తరపున అందించుండే వాళ్లం. 20వేల కోట్లు కనుక కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ప్రజలకు సహాయం చేస్తాననడం దురదృష్టకరం. మూడు సంవత్సరాలలో 5లక్షల కోట్ల అప్పులు తెచ్చి, లక్షా 50వేల కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు పెట్టామన్నారు, మిగతా 3లక్షల 50వేల కోట్ల రూపాయల అప్పుల ఎక్కడికి పోయాయి? 5లక్షల కోట్లు అప్పులో 20వేల కోట్లు వీలీన మండల ప్రాంత ప్రజలకు ఎందుకు ఇవ్వడం లేదు. ఇంత మంది ఎంపీలు ఉండి ఏం లాభం? కేంద్రాన్ని ఒప్పించి ప్యాకేజ్ తెచ్చి నిర్వాసితులకు సహాయం చేయాలి.

ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాల పర్యటనలో రైతులు కూడ తీవ్రమైన ఆవేదనని వ్యక్తం చేశారు. ఆక్వా, వరి, తమలపాకు, కూరగాయలు, కొబ్బరి, ఉద్యానవన పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యమంత్రి నోటినుంచి రైతులకు భరోసా ఇస్తాం అని రాకపోవడం బాధాకరం. రాజధాని కోసం యాగం చేసిన రైతులు రోడ్డెక్కిన పరిస్థితి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే విధంగా ఉన్న విశాఖ ప్రజలు కూడ రోడ్డెక్కిన పరిస్ధితి. పోలవరం కోసం త్యాగం చేసిన నిర్వాసితులు కూడ రోడ్డెక్కిన పరిస్థితులు చూస్తున్నాం. రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరి పరిస్థితి నేడు ముఖ్యమంత్రి మూలంగా ఎంత దయనీయంగా మారిందో ప్రతి ఒక్కరు చూస్తున్నారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు.

LEAVE A RESPONSE