Suryaa.co.in

Andhra Pradesh

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం మరిన్ని సహాయక చర్యలు చేపట్టాలి

-అత్యధికంగా నష్టపోయిన జిల్లాలకు తక్షణమే నష్ట పరిహారం అందజేయాలి
-తుఫాను బాధితులకు అండగా ఉండాలంటూ డీసీసీ అధ్యక్షులకు ఆదేశాలు
-సహాయ చర్యల్లో పాల్గొనాలంటూ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు
-వీడియో కాన్ఫరెన్స్ లో నేతలకు పలు సూచనలు
– పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు

విజయవాడ : దక్షిణ కోస్తా తీరాన్ని అతలాకుతలం చేస్తున్న మిగ్జామ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సహాయక చర్యలు చేపట్టాలని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు సూచించారు. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, క్రిష్టా, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో తుఫాను తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో మంగళవారం బాధిత జిల్లాల డీసీసీ అధ్యక్షులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉండాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, అవకాశం ఉన్న వారందరూ.. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జరిగే సహాయ చర్యల్లో పాల్గొనాలని ఆయన సూచించారు.

తుఫాను బాధిత జిల్లాల డీసీసీ అధ్యక్షులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో.. పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ గత రెండు రోజులుగా మిగ్జామ్ తుఫాను ప్రభావంతో వేలాదిగా ప్రజలు నిరాశ్రయిలయ్యారని వారికి పార్టీ పరంగా నైతిక మద్ధతు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే నష్ట పరిహారం, ఇతర సహాయాలు సత్వరమే అందించేందుకు సహకారం అందించాలని సూచించారు.

ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరుతో పాటు క్రిష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మిగ్జామ్ తీవ్ర రూపం దాల్చిన నేపధ్యంలో సార్వా వరి పంట వేసిన రైతులతో పాటు ప్రత్తి, మిరప, పసుపు, మొక్కజొన్న పంటలు వేసిన వారి పొలాలన్నీ… నీట మునిగి కోట్లాది రూపాయిల పంట నష్టం వాటిల్లిందని పీసీసీ అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి రైతుల విషయంలో ప్రభుత్వం సాధ్యమైనంత వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు.

మిగ్జామ్ తుఫాను ప్రభావంతో తీవ్ర భయానక పరిస్థితులు ఏర్పడిన నేపధ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి, వైద్య, ఆరోగ్య శాఖ పరంగా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.

తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్ట పోయిన రైతాంగాన్ని యుద్ధ ప్రాతిపదికన ఆదుకునే క్రమంలో సాధ్యమైనంత త్వరగా పంట నష్టం సమాచారాన్ని కేంద్రానికి పంపి.., కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తుఫాను నష్ట పరిహారం వేగంగా అందే విధంగా చర్యలు చేపట్టాలని పీసీసీ అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్నప్తి చేశారు. అదే విధంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో మిగ్జామ్ తుఫాను చేసిన నష్టాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్రానికి నివేదించాలన్నారు.

LEAVE A RESPONSE