– ఒక్క వాస్తవం చెప్పని కూటమి ప్రభుత్వం
– మా 11 మందికి 164 మంది సమాధానం చెప్పలేరా?
– పవన్‌కళ్యాణ్‌కు రాజ్యాంగం గురించి ఏం తెలుసు?
– పీఏసీ ఛైర్మన్ పదవి జనసేన ఎలా తీసుకుందో చెప్పాలి
– వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్, విరూపాక్షి ధ్వజం
తాడేపల్లి: గవర్నర్ ప్రసంగమంతా అబద్ధాలమయం అని, ఒక్క వాస్తవం కూడా కూటమి ప్రభుత్వం చెప్పలేదని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, బూసినె విరూపాక్షి «ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా పథకాల అమలు ప్రస్తావన లేదన్న వారు.. ‘ఆత్మస్తుతి. పరనింద’లా ఆ ప్రసంగం కొనసాగిందని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విషయం గవర్నర్ ప్రసంగంలో అదే తేటతెల్లమైందని వెల్లడించారు.
ఇంకా 9 నెలల పాలనతో ఘోరంగా విఫలమైన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, ప్రజా సమస్యలపై మా పార్టీ ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకునే ధైర్యం లేకనే వైయస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి జంకుతోందని ఎమ్మెల్యేలు చంద్రశేఖర్, విరూపాక్షి ఆక్షేపించారు. రాజ్యాంగం పట్ల, కోర్టుల పట్ల ఈ ప్రభుత్వానికి గౌరవం లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వారు చెప్పారు.
అసెంబ్లీలో ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) ఛైర్మన్ పదవి విపక్షానికి ఇవ్వడం సంప్రదాయమని, కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం దాన్ని కూడా కాలరాసిందని చంద్రశేఖర్, విరూపాక్షి గుర్తు చేశారు. అధికారంలో భాగస్వామ్యం వస్తున్న జనసేనకు ఆ పదవి ఎలా ఇచ్చారని వారు నిలదీశారు.
గవర్నర్ ప్రసంగం మొత్తం ఆత్మస్తుతి, పరనింద అనేలా ఉంది తప్ప, రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చే అంశం ఏ ఒక్కటీ లేదు. హామీల అమలు, ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి ఇప్పటికీ స్పష్టత ఉన్నట్టు కనిపించడం లేదు. ప్రతి మంగళవారం అప్పులు చేస్తూనే, 9 నెలల్లోనే రాష్ట్రం అప్పులు రూ. 1.30 లక్షల కోట్లకు దాటించి, తలసరి ఆదాయం 2047 నాటికి రూ.58 లక్షలు చేస్తానని ఇంకా పిట్టలదొర కబుర్లు చెబుతున్నాడు. ఈ ఏడాదికి సంబంధించి ప్రణాళిక లేని చంద్రబాబు, 2047 విజన్ గురించి కాకమ్మ కబుర్లు చెబుతున్నాడు.
ప్రతిపక్ష హోదా గురించి డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వచ్చిన ఓట్లను బట్టి ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెళ్లాలంటూ హేళనగా మాట్లాడుతున్నారు. అసలు కూటమి ప్రభుత్వం ఏ తప్పు చేయకపోతే, 11 మందిని ఎదుర్కొనే సత్తా ఉంటే వైయస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకంత భయం?.
దళిత ఎమ్మెల్యేగా అధికార పార్టీపై పోరాడుతున్న నాపై తప్పుడు వార్తలు రాస్తున్నారు. నా మెడలో కండువా జారి పడిపోతే దానికి విపరీత అర్థాలు తీస్తున్నారు. దళితులంటే టీడీపీకి అంత చిన్నచూపు దేనికి? మా నాయకులు నన్ను పక్కన కూర్చోబెట్టుకుంటారు. టీడీపీలో దళిత ఎమ్మెల్యేలకు ఆ గౌరవం ఉందా?.