– ఏపి డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి
– విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా అధికారిణిలకు అవార్డులు అందజేత
అమరావతి: పరిపాలన వ్యవస్థలో సమూల మార్పులతో పాటు మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ చర్యలు సత్ఫలితాల్నిస్తున్నాయని రాష్ట్ర డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా అధికారిణిలకు డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొని బహుమతులు అందజేశారు.
మహిళా దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని డిజిపి కార్యాలయంలో మహిళల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ప్రారంభించడంతో పాటు రాష్ట్రంలోని 18 యూనిట్లలో విధులు నిర్వహిస్తూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుల్ స్థాయి నుండి డిఎస్పీ స్థాయి అధికారిణిలకు అవార్డులు, జ్ఞాపికలు అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సంధర్భంగా డిజిపి రాజేంద్రనాథ్ మాట్లాడుతూ… వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళల రక్షణ కోసం అత్యంత ప్రాధాన్యతఇస్తుందన్నారు. అందుకు అనుగుణంగా అనేక కార్యక్రమాలను చెపట్టడంతో పాటు క్షేత్రస్థాయిలో అమలు చేస్తుందని అన్నారు. మహిళలపై జరిగే నేరాల ఫిర్యాదుల కోసం దిశ పోలీస్ స్టేషన్ల, వేదింపుల నుండి రక్షణ కల్పించడానికి దిశ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.
దిశ మొబైల్ అప్లికేషన్ ద్వారా రాష్ట్రం లోని మహిళలకు అన్ని సందర్భాల్లో అందుబాటులో ఉండేలా అత్యంత ఆధునిక టెక్నాలజీతో ప్రవేశపెట్టిన దిశా మొబైల్ అప్లికేషన్ (SOS) స్వల్ప వ్యవధిలోనే 1,13,84,512 మంది డౌన్లోడ్ చేసుకోవడం గొప్ప విశేషం అన్నారు. మహిళల ఫిర్యాదులపైన పోలీసుల ప్రతిస్పందన సరాసరి ఐదు నిమిషాలలోపే నమోదైంది.
ఇది దేశంలోనే అత్యుత్తమ ప్రతిస్పందనగా నమోదైంది. దేశంలో మహిళా రక్షణకై తయారు చేసిన మొబైల్ అప్లికేషన్లలో ప్రధమ స్థానంలో కొనసాగుతుందని తెలిపారు. అన్ని వేళల్లో పోలీసులు తమకు రక్షణగా, తోడు నీడగా ఉన్నారనే భావన కలుగచేస్తూ, వారిలో ఆత్మస్థైర్యాన్ని కల్పించేలా దిశా యాప్ సేవలను అందిస్తుందని పేర్కొన్నారు.
జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పోలీస్ వాహనాల లైవ్ ట్రాకింగ్ విధానం ద్వారా అతి తక్కువ సమయంలో బాధితుల వద్దకు చేరుకొని సత్వరమైన, ఉత్తమమైన సేవలు అందించేందుకు ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నట్లు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ తెలిపారు.
ఈ విధానం ద్వారా క్షేత్రస్థాయిలో ఫిర్యాదు చేసిన వారి ప్రాంతాన్ని గుర్తించి వారికి సమీపంలోని గస్తీ వాహనం వారి వద్దకు అత్యంత స్వల్ప సమయంలో చేరుకోవడం దీని ప్రత్యేకతని తెలిపారు. ఈ సాంకేతిక వినియోగం కారణంగా పోలీసుల ప్రతిస్పందన అత్యంత వేగవంతమైంది. 2021 లో సగటున 92.21% కేసులలో చార్జ్ షీట్ దాఖలు చేసి ఆంధ్రప్రదేశ్ పోలీసు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించారు.
దిశ ద్వారా వచ్చే ఫిర్యాదుల పట్ల కేసు నమోదు మొదలుకొని నింధితులకు శిక్ష పడేవరకు భాదితులకు బారోసా కల్పించాలని, అలా చేసినప్పుడే మహిళలకు పూర్తి స్థాయి లో పోలీసుపై నమ్మకం కలుగుతుందని తెలిపారు. ఒకచోట నేరం జరిగితే దాని ప్రభావం అన్నీ ప్రాంతాలపైనా ఉంటుందన్నారు. అందుకే ఒక మహిళా అధికారిగా తమ పరిధిలో మహిళల పట్ల జరుగుతున్న నేరాలను పూర్తి స్థాయిలో అరికట్టినపుడే మనం మన లక్ష్యాలను చేరుకుంటామని పోలీసులకు సూచించారు.
అనంతరం కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన మహిళా అధికారిణిలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, సిఐడి అడిషనల్ డీజి సునీల్‌కుమార్, ఐజి నాగేంద్రకుమార్, టెక్నికల్ సర్వీసెస్ డిఐజి పాలరాజు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.