పోర్చుగీస్‌కు చెందిన ఆంటోనియో గుటెర్రస్ గురించి ఒక ఫన్నీ పోస్టు వైరల్ అవుతున్నది. అందులో ఆయన బయోడేటా మొత్తం ఇస్తూ, ఆయన చేస్తున్న పని ఎదురుగా “చోద్యం చూడటం” అని మెన్షన్ చేశారు. ప్రపంచంలో చోద్యం చూస్తూ కాలక్షేపం చేసేవాళ్లు కోట్లమంది ఉండివుంటారు. కానీ, ప్రత్యేకంగా ఆంటోనియో గురించి చేసిన పోస్టు మాత్రమే వైరల్ అవుతున్న కారణం – ఆయన ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కాబట్టి!
ప్రస్తుతం ఆయన ప్రేక్షకపాత్రలో జీవిస్తూ చూస్తున్న చోద్యం: ఒక దేశ సార్వభౌమాధికారాన్ని అమెరికా తుత్తునియలు చేస్తున్న వైనం. అదే పోస్టులో, మన పాఠ్యాంశాలలో ఐక్యరాజ్యసమితి గురించి ఉన్న పాఠాన్ని తొలగించి విద్యార్థుల నెత్తినుండి కొంత భారాన్ని తగ్గించమనే సూచన కూడా ఉన్నది. ఈ పోస్టు చార్లీ చాప్లిన్ చేసిన హాస్యం లాంటిది.
చార్లీ చాప్లిన్ సినిమాలు చూస్తుంటే నిజమైన హాస్యం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఆయన నటన మనకు అంతులేని విషాదాన్ని చూపిస్తుంది. అమాయకంగా కనిపిస్తూ ఆయన చేసిన ప్రతి పాత్రా మన గుండెలను మెలిపెడుతుంది, కానీ కన్నీరు రాకుండా ఆయనే అడ్డుపడతాడు.
ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గురించి పెట్టిన పోస్టు కూడా అదే కోవలోకి వస్తుంది. ఒక సర్వసత్తాక దేశాధ్యక్షుడిని, ఆయన సతీమణిని అమెరికా సేనలు వారి నివాసం నుండే చేతులకు సంకెళ్లు వేసి అమెరికా తీసుకెళ్తుంటే, చేష్టలుడిగి నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయిన ఐక్యరాజ్యసమితి నిష్క్రియాపరత్వం నుండి పుట్టిన నిప్పుకణిక ఆ పోస్టు. ప్రజాస్వామికవాదుల విషాదం నుండి వచ్చిన హాస్యగుళిక.
‘విషాదం’ అనే పదాన్ని వాడటం తప్పేమో నాకు తెలియదు కానీ, 1945 నుండి ఇప్పటివరకు ఐక్యరాజ్యసమితి వ్యవహారశైలి గమనించిన ఎవరికైనా అటువంటి ఆలోచన వస్తుంది.
వెనెజులా అధ్యక్షుడిని నిరాధారమైన ఆరోపణలతో న్యూయార్క్ తీసుకురావటంలో ట్రంప్ అమెరికన్ చట్టాలనే కాదు, అంతర్జాతీయ చట్టాలను కూడా ఉల్లంఘించారు. అధ్యక్షుడు మదురోని, ఆయన భార్యను అమెరికా సేనలు తీసుకొస్తూ వుండగానే, వారిని బంధించిన తన సేనల విజయగాథను ప్రస్తుతించిన ట్రంప్ బరితెగింపును కనీసం ఖండించలేని ఐక్యరాజ్యసమితి గురించి మన పిల్లలకు చెప్పవలసిన అవసరం అయితే కనిపించటం లేదు.
“వెనెజులాలో పరిస్థితులు చక్కబడే వరకు ఆ దేశం తమ ఏలుబడిలోనే వుంటుంది” అని ట్రంప్ చేసిన ప్రకటన సైతం ఐక్యరాజ్యసమితిని కదిలించలేకపోవటం అత్యంత విచారకరం.
ఐక్యరాజ్యసమితి నిష్క్రియాపరత్వం ప్రపంచానికి కొత్త ఏమీ కాదు. 1945 నుండి ఇప్పటివరకు అనేక సందర్భాలలో సమితి ‘అమెరికనైజ్డ్ సమితి’ లానే వ్యవహరించింది. వెనెజులా వ్యవహారంలో అమెరికన్ మీడియా కూడా ఆచితూచి అడుగులు వేయవలసి వచ్చింది. వెనెజులా అధ్యక్షుడి పైన ట్రంప్ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ‘మాదకద్రవ్యాల తీవ్రవాదం’. అదే నిజమైతే గతంలో ఇటువంటి ఆరోపణ అమెరికా ఎందుకు చేయలేదు అనే దానికి సమాధానం లేదు.
వెనెజులా వ్యవహారం ప్రపంచానికి చాటుతున్నది ఒక్కటే: ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలు తప్పొప్పుల పైన, న్యాయాన్యాయాల పైన ఆధారపడి కాకుండా, బలవంతుడి మిలిటరీ శక్తిపైన ఆధారపడి నడుస్తున్నాయి. ప్రపంచదేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ, ఆయా దేశాల అంతర్గత రాజకీయ వ్యవహారాలలో మరోదేశం జోక్యం చేసుకోకుండా చూడటానికి ఒక వేదిక కావాలనే స్ఫూర్తితో ఏర్పాటు అయిన ఐక్యరాజ్యసమితి, పరాయి దేశాల అంతర్గత వ్యవహారాలలో అమెరికా జోక్యాన్ని అడ్డుకోవటంలో పూర్తి స్థాయిలో విఫలమైంది.
ద్వితీయ ప్రపంచ యుద్ధంతో ప్రపంచం ఎదుర్కొంటున్న విధ్వంసం నుండి అంకురించిన ఆలోచనతో జనించిన యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్, చిన్న చిన్న దేశాలకు ‘కౌన్సెలింగ్ సెంటర్’ గా మిగిలిపోయింది. రష్యా అధినేత జోసెఫ్ స్టాలిన్, బ్రిటన్ నుండి విన్స్టన్ చర్చిల్, యూఎస్ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ రెండు మూడు పర్యాయాలు చర్చించి కౌన్సిల్ కొరకు ఖరారు చేసిన విధివిధానాలలో ప్రధానమైనది—ప్రపంచంలో శాంతిభద్రతలను కాపాడటం. కానీ శాంతిస్థాపన పేరుతో ఆయా దేశాల సార్వభౌమాధికారానికే ముప్పు తెస్తున్న అమెరికా పెత్తందారీతనానికి జోహుకుం అంటున్నది కౌన్సిల్.
యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్, చైనా, యునైటెడ్ కింగ్డమ్.. ఈ నాలుగు దేశాలు నలుగురు పోలీసుల్లా ప్రపంచ శాంతి పరిరక్షణ బాధ్యతను స్వీకరిస్తాయని రూజ్వెల్ట్ భావించారు. కానీ ఐదు దశాబ్దాల ప్రచ్ఛన్న యుద్ధంతో ప్రపంచంలోని అనేక దేశాలు సూపర్ పవర్స్ మధ్య పోటీ వలన నలిగిపోయాయి. అలా నలిగిపోయిన దేశాలు ఇప్పటికీ కునారిల్లుతూనే ఉన్నాయి. సోవియట్ యూనియన్ పతనంతో ప్రచ్ఛన్న యుద్ధం ప్రశాంతంగా ముగిసింది కానీ, ప్రపంచదేశాల అంతర్గత వ్యవహారాలలో అమెరికా జోక్యం పెరిగిపోయింది.
వెనెజులా లాంటి దేశాలలో అమెరికా జోక్యం చేసుకోదలచుకుంటే, యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశాలను ఏర్పాటు చేయాలని కోరకుండానే తన ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. కానీ తన కండబలంతోనే పని సాధించటం కష్టం అవుతుంది అనుకున్న రోజు మాత్రం ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశం ఏర్పాటు చేయమని హుకుం జారీ చేస్తుంది.
అందుకు ఉదాహరణగా 1962 ప్రచ్ఛన్న యుద్ధ మేఘాలు ప్రపంచాన్ని కమ్ముకుని ఉన్న రోజుల్లో, క్యూబాలో సోవియట్ యూనియన్ న్యూక్లియర్ మిస్సైల్స్ స్థావరాలను ఏర్పాటు చేస్తున్నదని, అవి అమెరికాను టార్గెట్ చేసేవిగా ఉన్నాయనే సమాచారం అందగానే భద్రతామండలి ముందుకు సమస్యను తీసుకువెళ్లి, అటువంటి ఏర్పాట్లు జరుగుతుంటే పరిశీలించటానికి అనుమతించవలసిందే అని పట్టుబట్టింది.
కానీ ఈరోజు వెనెజులా నుండి మాదకద్రవ్యాల తీవ్రవాదం నడుస్తున్నది అనే సమాచారం అందినపుడు కూడా యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్ ముందు సమస్యను పెట్టవచ్చు. కానీ పెట్టలేదు. కారణం—అమెరికా సమస్య మాదకద్రవ్యాల రవాణా కాదు, వెనెజులా అధ్యక్షుడే అమెరికా సమస్య! దేశంలో ఉన్న సహజ వనరులను జాతీయం చేయటమే వెనెజులా అధ్యక్షుడు చేసిన నేరం. చమురు నిల్వలతో సుసంపన్నంగా ఉన్న వెనెజులా అమెరికాకు కావాలి. వెనెజులా చమురు నిల్వలు అమెరికా ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేయాలి.
వెనెజులా అధ్యక్షుడిని వ్యక్తిగతంగా దోషి అని అరెస్ట్ చేసివుంటే, పరిస్థితులు చక్కబడే వరకు అమెరికా అధీనంలోనే వెనెజులా పరిపాలన సాగుతుంది అని ప్రకటించటానికి ట్రంప్‌కు అధికారం ఎవరిచ్చారు? వారి అధ్యక్షుడు లేనప్పుడు ప్రభుత్వాన్ని ఎవరు నడపాలనేది ఆ దేశ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. వెనెజులా అనేది అమెరికా సామంత రాజ్యం కాదు.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఒక దేశ ప్రభుత్వం పైన అమెరికా చేస్తున్న దాడిని ఖండించలేని యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్ గురించి మన విద్యార్థులకు చెప్పవలసిన అవసరం లేదని పోస్టు పెట్టటంలో, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదనే ఆవేదన ఎంత ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
– ఇంద్రాణి