Suryaa.co.in

Telangana

అదానీ ఇచ్చిన వంద కోట్లు రేవంత్ సొంతానికి కాదు

– స్కిల్ వర్శిటీకి కేటీఆర్ 50 కోట్లు ఇచ్చినా తీసుకుంటాం
– అదానీని అరెస్టు చేయాల్సిందే
– టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్‌: తెలంగాణలోని స్కిల్ యూనివర్సిటీకి గౌతమ్ అదానీ రూ.100 కోట్లు ఇచ్చారని, కానీ ఆ మొత్తాన్ని రేవంత్ రెడ్డి జేబులోకి ఇవ్వలేదని, అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు ఆన్ రికార్డ ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. స్కిల్ యూనివర్సిటీకి ఎవరు ఇచ్చినా స్వీకరిస్తామని, కేటీఆర్ కూడా వచ్చి రూ.50 కోట్లు ఇస్తామంటే తీసుకుంటామన్నారు. వ్యాపారాలు జరగాలి. పెట్టుబడులు రావాలనేదే తమ ఆలోచన. కానీ మోసం చేస్తే కూడా విచారణ జరగాలనేది తమ డిమాండ్ అన్నారు. అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ పెదవి విప్పడం లేదని విమర్శించారు.

అదానీ కుంభకోణాన్ని అమెరికా అధికారులు బయటపెట్టారని, అదానీ దాదాపు రూ.2 వేల కోట్ల మేర లంచాలు పంచారని ఆరోపించారు. అదానీ కుంభకోణాలపై రాహుల్ గాంధీ ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ స్పందించలేదు. అర్హత లేకపోయినప్పటికీ అదానీకి వేలాది కోట్ల రూపాయల రుణాలు ఇచ్చారు. ఆయన అవినీతిపై ఇప్పుడు అమెరికా కూడా చెప్పింది. తక్షణమే అదానీని అరెస్ట్ చేయాలని మహేశ్ కుమార్ డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారంపై తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ అండతో అదానీ విచ్చలవిడిగా సంపద పెంచుకున్నారని, జేపీసీ విచారణ జరిపి అదానీ తప్పులు బయటపడితే, మోదీ ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు.

LEAVE A RESPONSE