– పన్నుల భారం వేసి పేద ప్రజల రక్తం పీల్చాలని చూసిస్తున్న కాంగ్రెస్ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్
హైదరాబాద్: ఆదాయం సమకూర్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉందని భట్టి చెప్పిన మాటలను రేవంత్ రెడ్డి ఈ రకంగా నిజం చేసి చూపిస్తున్నడు. జీవో 53, 54 లతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై భారం వేసిండు. పేద, మధ్య తరగతి ప్రజలను దొంగ దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డి
ఈ రోజుల్లో ఏ ద్విచక్ర వాహనం కొనుగోలు చేసినా లక్ష దాటి ఉంటది. రైతులు, చిరు వ్యాపారులు ద్విచక్ర వాహనాలను వృత్తి, ఉపాధి పరంగా కొనుగోలు చేస్తుంటారు. లక్ష దాటిన ద్విచక్ర వాహనాలపై లైఫ్ టాక్స్ ను 12శాతం నుంచి 15 శాతానికి పెంచడం దుర్మార్గం.
బైక్ ఎక్స్ షోరూం ధర లక్షా 10వేలు ఉంటే, ఇప్పటి వరకు 13,200 లైఫ్ టాక్స్ కట్టాల్సి ఉండేది. తాజా పెంపుతో ఇది 16,500 లకు పెరుగుతుంది. ఇంత పెద్ద మొత్తంలో అదనపు భారాన్ని పేద, మధ్య తరగతి ప్రజలపై కాంగ్రెస్ వేస్తున్నది.
కారు కొనుక్కోవాలనేది సాధారణంగా ఎవరికైనా ఉండే కోరిక. అప్పు చేసో, లోన్ తీసుకొనో మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేస్తుంటారు. వారి ఆశలపై కాంగ్రెస్ నీళ్ళు చల్లింది. 10 లక్షలు లేనిదే కారు రాని పరిస్థితి. అలాంటి కార్ల మీద కూడా లైఫ్ టాక్స్ వేసి ప్రజల కోరికలను సొమ్ము చేసుకుంటున్నడు రేవంత్ రెడ్డి.
10-20 లక్షల కారు కొంటే 17శాతంగా ఉన్న పన్ను శాతాన్ని 18శాతానికి పెంచిండు. అంటే దాదాపు 20 వేల అధిక భారం కొనుగోలు దారులపై కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్నది. 20 లక్షలు దాటితే రెండు శాతం, 50లక్షలు దాటితే మూడు శాతం. ఇట్ల అడ్డోగులుగా పన్నులు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నడు.
కమర్షియల్ వాహనాల పన్నులు కూడా పెంచిండు. 20లక్షల పైగా ఉంటే 20శాతంగా ఉన్న పన్నును 22శాతానికి, 50లక్షలు దాటితే 25శాతం పన్ను కట్టాలని నిర్ణయించిండు. కమర్షియల్ వెహికిల్స్ పై పన్ను పెంచడం వల్ల, చివరకు అది మార్కెట్ పై, ప్రజలపైనే ఆ భారం కూడా పడుతుంది.
హ్యామ్ మోడల్ పేరిట రోడ్లను ప్రైవేటు కంపెనీలకు 15 నుంచి 20 సంవత్సరాల వరకు అప్పజెప్పే నిర్ణయం జరిగింది. హేమ్ మోడల్ కోసం రుణాలు సేకరించేందుకు టాక్స్ పెంచడం శోచనీయం. కంపెనీలకు మొబిలైజేషన్ అడ్వాన్సులు యాన్యుటీలు చెల్లించడం కోసం, టోల్ ద్వారా వసూలు చేయబోమని చెబుతూ మరోవైపు దొంగదారిలో ఈ పన్నుల పెంపు చేయడం సిగ్గుచేటు.
లైఫ్ టైం టాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం ద్వారా ప్రజల రక్తం పీల్చుతున్నడు రేవంత్ రెడ్డి. బ్యాంకుల వద్ద అణాపైసా అప్పు పుట్టట్లేదని.. ఢిల్లీకి వెళితే అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని, చెప్పులు ఎత్తుకెళ్లేందుకు వచ్చిన దొంగల్లా చూస్తున్నారన్నారు అన్న రేవంత్ రెడ్డి.. ఆదాయం కోసం పన్నులు విధించటమే మార్గంగా భావిస్తున్నడు. పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నడు. ఈ దుర్మార్గ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం.