“విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు” అన్న నినాదం గాలిలో కలిసిపోతుందేమో అన్న భయం అందరిలో ఉన్న తరుణంలో.. జనవరి 2026 నాటికి ₹54 కోట్ల లాభం అన్న వార్త ఒక సంచలనం. అయితే ఈ విజయం వెనుక ఉన్న అసలైన కథ ఒక సినిమా కథ కంటే తక్కువేం కాదు.
కొన్ని నెలల క్రితం బాబు గారు “పనిచేయకుండా జీతాలు ఎలా ఇస్తారు? ప్లాంట్‌ను తెల్ల ఏనుగులా మారుస్తారా?” అని చేసిన ఘాటు విమర్శలు అందరినీ ఉలిక్కిపడేలా చేశాయి. ప్రతిపక్షాలు దీనిని అస్త్రంగా చేసుకుని రోడ్లెక్కి నిరసనలు తెలిపాయి. కానీ ఆ కోపం వెనుక ఉన్న ఉద్దేశం వేరు. అది కార్మికుల్లో ఉన్న స్తబ్దతను పోగొట్టి, ప్లాంట్‌ను ప్రైవేటీకరణ ముప్పు నుంచి కాపాడాలంటే “పర్ఫార్మెన్స్” ఒక్కటే మార్గమని ఆయన చేసిన హెచ్చరిక.
అర్ధరాత్రి ఆపరేషన్: 1:30 AM ఢిల్లీ డైరీ
అలా తిట్టడానికి ఆయనకు అర్హత, హక్కు ఉంది. కేవలం తిట్టడమే కాదు, దానికి ముందు ప్లాంట్ కోసం ఢిల్లీలో ఆయన చేసిన పోరాటం సామాన్యమైనది కాదు. కేంద్ర మంత్రి కుమారస్వామితో కలిసి అర్థరాత్రి దాటాక 2 గంటల సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి ప్లాంట్ దుస్థితిని వివరించారు.
ఆ పట్టుదలే ₹11,440 కోట్ల భారీ ప్యాకేజీని సాకారం చేసింది. అందుకే ఆయన గట్టిగా చెప్పగలిగారు— “నేను నిధులు తెచ్చాను, ఇప్పుడు మీరు పని చేసి చూపండి” అని. ప్రజలు కూడా ఆ కోపాన్ని ఒక బాధ్యతగా అర్థం చేసుకున్నారు.
పనులు మాటల్లో కాదు, ప్లాంట్ చిమ్నీల పొగలో కనిపించాయి: 18 నెలల క్రితం కేవలం 45% సామర్థ్యంతో కునారిల్లుతున్న ప్లాంట్, నేడు రికార్డు స్థాయిలో 94% సామర్థ్యాన్ని అందుకుంది. గతంలో మూతపడ్డ బ్లాస్ట్ ఫర్నేస్‌లను తెరిపించి, ఇప్పుడు 3 ఫర్నేస్‌లు పూర్తి స్థాయిలో రన్ అవుతున్నాయి. రోజుకు 19,401 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేస్తూ ప్లాంట్ జవజీవాలను సంతరించుకుంది.
ప్రతిపక్షాల ప్రచారాలు, నిరసనల హోరు మధ్య.. ఈ ₹54 కోట్ల లాభం ఒక గట్టి చెంపపెట్టులా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నీటి సరఫరా, విద్యుత్ బకాయిలు, పన్ను రాయితీలు ఇస్తూ వెన్నుదన్నుగా నిలవగా.. కార్మికులు తమ చెమటను చిందించి ప్లాంట్‌ను నిలబెట్టారు.
బాబు గారి పట్టుదలకు, కార్మికుల కష్టం తోడైతే.. నష్టాల ఊబిలో ఉన్న ఏనుగైనా సరే, లాభాల పరుగు తీస్తుందని విశాఖ ఉక్కు నిరూపించింది.
