– ఎక్కువ వరి ధాన్యం నల్లగొండలో పండుతుంది
– నల్గొండ బత్తాయి ఎంతో ప్రసిద్ధి చెందింది
– మా రైతుల కోసం అత్యాధునిక ధాన్యం గోదాము, బత్తాయి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి
– కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి
నల్లగొండ: రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..కేంద్ర ఆహార,వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి ఎఫ్.సి.ఐ డివిజనల్ ఆఫీస్,బఫర్ స్టోరేజ్ కాంప్లెక్స్ ను నల్లగొండ లో గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ.. జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న కీలక సమస్యల పరిష్కారం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ పర్యటన సందర్భంగా జిల్లాను “వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రంగా” మార్చేందుకు గల ప్రాధాన్యతను మంత్రి వివరించారు. “తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ, వాతావరణం, భూమి అనుకూలంగా ఉండటంతో ప్రధానంగా వరి పంటను అత్యధికంగా పండిస్తోంది.
గతేడాది యాసంగిలో దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది, రికార్డు స్థాయిలో 148 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది.ఎఫ్.సి.ఐ.కి ధాన్యం సరఫరా చేయడంలో నల్గొండ జిల్లా ముఖ్యపాత్ర పోషిస్తోంది ఈ యాసంగి సీజన్లో తుఫాను వల్ల పంట దెబ్బతిన్నా, జిల్లా ఏకంగా 8.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించింది. నిరంతరం అకాల వర్షాలు,ఆధునిక గోదాములు లేకపోవడం వలన, ధాన్యం నాణ్యత తగ్గి, సకాలంలో ఎఫ్.సి.ఐ.కి పంపడం కష్టంగా మారింది.
వాతావరణ సమస్యల నుండి రైతులను కాపాడటానికి, నల్గొండ జిల్లాకు ఒక ప్రత్యేకమైన, అత్యాధునిక గోదాం కేంద్రాన్ని మంజూరు చేయాలి. జిల్లాకు 1 లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు అవసరం.శాస్త్రీయ పద్ధతిలో ఎక్కువ ధాన్యాన్ని నిల్వ చేసే పెద్ద స్టీల్ సైలోస్ (Steel Silos), గ్రెయిన్ డ్రైయర్స్ మరియు ఆటోమేటిక్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేయాలి. గోదాముల నిర్మాణానికి జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిప్పర్తి మండలంలో కావాల్సినంత స్థలం అందుబాటులో ఉంది.నల్గొండలో బాయిల్డ్ రైస్ ఎక్కువగా తయారు చేస్తారు కాబట్టి, ఇక్కడి మిల్లర్లకు రా రైస్ లేదా పార్ బాయిల్డ్ రైస్ ఏదైనా ఎఫ్.సి.ఐ.కి ఇచ్చే అవకాశం కల్పించాలి.” అని మంత్రి పేర్కొన్నారు.
నల్గొండ బత్తాయి కి జాతీయ గుర్తింపు:
నల్గొండ జిల్లాలో బత్తాయి పంట కూడా అత్యధికంగా పండుతున్నదని,సుమారు 4.50 లక్షల టన్నుల తీపి బత్తాయి (స్వీట్ ఆరెంజెస్) పంట దిగుబడి వస్తుందని, బత్తాయి రైతులకు మద్దతుగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు మంత్రి కోమటి రెడ్డి కేంద్రం మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. “నల్గొండ బత్తాయి రకాన్ని తక్షణమే భారత ప్రభుత్వ “ఒక జిల్లా ఒక ఉత్పత్తి” (ODOP) పథకంలో చేర్చాలి. దీనివల్ల అధికారిక బ్రాండింగ్, మార్కెటింగ్, మార్కెట్ అనుసంధానం,మంచి రేటు లాంటి అవకాశాలు లభిస్తాయి.
బత్తాయి నిల్వ సమస్యలను అధిగమించడానికి, అత్యవసరంగా 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల కోల్డ్ స్టోరేజ్‌ను నల్గొండకు మంజూరు చేయాలి.” అని అన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ ముఖ్యమైన గోదాములు మరియు కోల్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను త్వరగా మంజూరు చేయాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని,మంత్రిని కోరారు. ఈ కొత్త సౌకర్యాలు వస్తే, రైతులు సంతోషంగా ఉంటారని, ఆహార ధాన్యాలు పాడవకుండా ఉంటాయని, దేశానికి ధాన్యం సరఫరా నిరంతరం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి,ఎమ్మెల్సీ శంకర్ నాయక్,భారత ఆహార సంస్థ ఈ డి వనిత శర్మ,జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, భారత ఆహార సంస్థ జిల్లా మేనేజర్ రాజు, ఎఫ్‌సిఐ అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.