– 2019 చట్టాన్ని సవరించాలి
– కౌలు రైతులకు భరోసా ఉంటేనే వ్యవసాయానికి భవిష్యత్
– రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
గుంటూరు: కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వటానికి గత ప్రభుత్వం తెచ్చిన చట్టమే రైతులకు ఆటంకంగా ఉందని రైతు సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు అన్నారు. కౌలు రైతు గుర్తింపు కార్డు తీసుకోవాలంటే దరఖాస్తు ఫారంలో భూ యజమాని సంతకం ఉండాలనే నిబంధన విధించటం వల్ల గుర్తింపు కార్డు దక్కట్లేదన్నారు. మంగళవారం స్థానిక రామన్నపేటలోని జనచైతన్యవేదిక హాల్లో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 2019 కౌలు రైతు చట్టాన్ని సవరించాలని రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
గత ఎన్నికల్లో టిడిపి ఇచ్చిన హామీ ప్రకారం రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రస్తుత కౌల్దార్ల చట్టాన్ని సవరించి, భూ యజమానితో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు, రుణాలు ఇవ్వాలని తీర్మానించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు సంఘం సీనియర్ నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ 2011 కౌల్దార్ల చట్టాన్ని సవరించి, గత ప్రభుత్వం 2019లో తెచ్చిన చట్టంతో కౌలు రైతులకు గుర్తింపుకార్డులు దక్కటమే గగనమైందన్నారు.
సమావేశంలో రైతు సంఘం నాయకులు పచ్చల శివాజీ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి జె.నవీన్, ఆప్ నాయకులు దనుంజయరెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజరు, అసైన్డ్ రైతుల సంఘం నాయకులు. ప్రసాద్, జొన్నలగడ్డ రామారావు, కౌలు రైతు సంఘం జిల్లా అద్యక్ష, కార్యదర్శులు బి.రామకృష్ణ, నాగమల్లేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.