– బిజినెస్ రూల్సు బేఖాతర్
– కార్మిక శాఖలో ఇదో విడ్డూరం
– ఏఎస్ఓ స్థాయి అధికారికి పీఎస్ ప్రమోషన్
-గెజిటెట్ అధికారికే పీఎస్ ఇవ్వాలన్న నిబంధన
– ఏఎసీలకు ఇప్పటి దాకా పీఎస్ ఇవ్వని వైనం
– చక్రం తిప్పిన సీఎంఓ కీలక అధికారి?
– బిజినెస్ రూల్సును దాచి సీఎం బాబును తప్పుదోవ పట్టించిన సీఎంఓ అధికారి?
– కార్మిక శాఖ ప్రత్యేక ఏమిటంటున్న సెక్రటేరియేట్ ఏఎఎస్ లు
– తమకూ పీఎస్ హోదా ఇవ్వా లని పట్టు
– ఉడుకుతున్న ఉద్యోగ సంఘాలు
– సచివాలయంలో ఏఎసీల ‘పీఎస్’ పంచాయతీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
సీఎంఓ అంటే బిజినెస్ రూల్సును అనుసరించి ముఖ్యమంత్రికి సలహా ఇచ్చే వ్యవస్థ. నిజానికి ప్రతి ఫైల్‌పై సీఎం సంతకం చేయరు. ఆయన తరఫున సీఎంఓ కీలక అధికారే సంతకం చేస్తుంటారు. కానీ ఆ సీఎంఓ అధికారులే బిజినెస్ రూల్సును దాచిపెట్టి.. అతిక్రమించి ముఖ్యమంత్రిని పక్కదోవ పట్టిస్తే?.. నిబంధనలకు విరుద్ధంగా గతంలో ఎన్నడూ లేని సంప్రదాయాలకు తెరలేపితే.. ఆ అప్రతిష్ఠ సీఎంకా? సీఎంఓదా? సీఎంఓను నడిపించే కీలక ఐఏఎస్ దా ? రేపు మరొకరు సీఎంఓ అధికారి వద్దకు వచ్చి.. మా అటెండరుకూ అడిషినల్ పీఎస్ హోదా ఇవ్వమని అడిగితే ఇచ్చేస్తారా?.. కార్మికశాఖ మంత్రి పేషీలో పనిచేసే ఏఎస్‌ఓకు పీఎస్ గా ప్రమోషన్ ఇచ్చారు కాబట్టి, మాకూ అదే హోదా ఎందుకు ఇవ్వరు? ఇదే ఇప్పుడు సచివాలయంలో మంత్రుల వద్ద పనిచేనే ఏఎస్ఓల మధ్య జరుగుతున్న హాట్ టాపిక్.
పాలన-నియామకాల్లో రాష్ట్రంలో మున్నెన్నడూ లేని కొత్త సంప్రదాయాలకు తెరలేస్తున్న వైచిత్రి. బిజినెస్ రూల్సును బేఖాతరు చేసి, చరిత్రలో ఎప్పుడూ లేని కొత్త నియామకాలు- పదోన్నతికి శ్రీకారం చుట్టిన ఫలితంగా.. ఉద్యోగుల్లో కొత్త అసంతృప్తిని తెరలేపిన సంస్కృతి మొదలవడం విస్మయం కలిగిస్తోంది. కార్మిక శాఖ పేషీలో ప్రస్తుతం ఏఎస్ఓగా పనిచేస్తున్న డిప్యుటేషన్‌పై వచ్చిన ఓ అధికారికి, ఎలాంటి అర్హత-అనుభవం లేకపోయినా పీఎస్ (పర్సనల్ సెక్రటరీ) హోదా ఇచ్చేందుకు సీఎంఓ తీసుకున్న నిర్ణయం వివాదానికి ఆజ్యం పోసింది. సీఎంఓలో కీలకపాత్ర పోషించే ఓ సీనియర్ అధికారి తీసుకున్న ఈ నిర్ణయం.. సచివాలయంలో పనిచేసే ఏఎస్ఓల కొత్త డిమాండుకు కారణమవుతోంది. బిజినెస్ రూల్సు ప్రకారం.. మంత్రుల పేషీల్లో పనిచేసే పీఎస్‌లు గెజిటెడ్ అధికారులే అయి ఉండాలి.
లేకపోతే జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ హోదా ఉన్న వారిని పీఎస్ గా నియమించవచ్చు. మిగిలిన వారిని ఆ హోదాలో నియమించేందుకు బిజినెస్ రూల్సు అంగీకరించవు. ఎందుకంటే ఏఎస్ఓ అనే అధికారి ఫైళ్లను పంపిస్తుంటారు. కానీ పర్సనల్ సెక్రటరీ మాత్రం ఆ ఫైళ్లను పరిశీలించి మంత్రికి నివేదిస్తారు. కాబట్టి పీఎస్కే బాధ్యతలు ఎక్కువ. అయితే కార్మికశాఖలో పనిచేస్తున్న ఏఎస్ఓ కు మాత్రం బిజినెస్ రూల్సుతో సంబంధం లేకుండా, పీఎస్ హోదా ఇవ్వడం వివాదానికి కారణమయింది. దీనికి సీఎంఓలోని ఓ కీలక అధికారి ముఖ్య పాత్ర పోషించారని, సదరు ఏఎస్ఓ ఫైలు పంచకల్యాణి గుర్రం కూడా ఈర్ష్యపడేంత వేగంగా పరుగులు తీయడం మరో విశేషం. నిజానికి ఇలాంటి కీలక అంశంపై లా డిపార్టుమెంట్ అభిప్రాయం తీసుకుని, తుది నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘ నేతలు గుర్తు చేస్తున్నారు.
ఏఎస్‌ఓకు పీఎస్ ఇవ్వాలంటే బిజినెస్ రూల్సు అంగీకరించవు. కానీ సీఎం అంగీకరిస్తే ఇవ్వవచ్చు అని సచివాలయ ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. ‘కానీ ఇన్నేళ్ల సచివాలయ చరిత్రలో ఏ సీఎం కూడా ఒక ఏఎస్ఐకు పీఎస్ హోదా ఇవ్వలేదు. మరి ఆయనకు అంత ప్రత్యేకత ఏమిటో మాకూ తెలియద’ని ఉద్యోగ సంఘ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ‘మాకు తెలిసి ఇన్నేళ్ల మా సర్వీసులో ఎప్పుడూ ఒక ఏఎస్ఓ కు పీఎస్ హోదా ఇచ్చిన చరిత్ర లేదు. నిజానికి పీఎస్ అయేందుకు అర్హులైన అధికారులు చాలామంది ఉన్నారు. కానీ కార్మిక శాఖ పేషీలో డెప్యుటేషన్‌పై వచ్చిన ఏఎస్ఓ కు మాత్రమే పీఎస్ హోదా ఇవ్వడం బిజినెస్ రూల్సుకు విరుద్ధం. పైగా ఇది చెడు సంప్రదాయాలకు, అనవసర వివాదాలు దారితీస్తుంది. రేపు ఏ ఏఎస్ఓ అయినా తమకూ పీఎస్ హోదా ఇవ్వాలని డిమాండ్ చేయవచ్చు.
లేకపోతే పేషీలో పనిచేసే అటెండరుకూ, అడిషనల్ పీఎస్ లేదా ఏఎస్ఓ హోదా ఇవ్వాలంటే ఇస్తారా? ఏదేమైనా ఉద్యోగసంఘాలకు ఈ నిర్ణయం పని కల్పించింది’ అని సచివాలయ ఉద్యోగ సంఘ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. ఒక ఏఎస్‌ఓకు పీఎస్ ఇచ్చే వ్యవహారంలో సీఎంఓ కీలక అధికారి, ఏకంగా సీఎంనే తప్పుదోవ పట్టించారన్న చర్చ జరుగుతోంది. సీఎంఓ కీలక అధికారి స్వయంగా వచ్చి ఫైలు తీసుకువస్తే, ఆ అధికారి బిజినెస్ రూల్సు, నియమ నిబంధనలన్నీ చూసే తన వద్దకు తీసుకువచ్చారని, ఏ సీఎం అయినా భావించి సంతకం పెడతారు.
ఈ ఏఎస్‌ఓకు పీఎస్ హోదా వ్యవహారంపైనా అదే జరిగి ఉండాలి. అంటే ఒక రకంగా సీఎంఓ అధికారే సీఎంను తప్పుదోవ పట్టించినట్లు కనిపిస్తోంది. నిజంగా పేషీలో పీఎస్ ని నియమించుకోవాలంటే, గెజిటెడ్ హోదా ఉన్న అధికారులు చాలామంది ఉన్నారు. కానీ వారిని కాదని నిబంధనలకు విరుద్ధంగా.. ఒక ఏఎస్‌ఓకు పీఎస్ హోదా ఇచ్చారంటే, సీఎంఓ ఇష్టారాజ్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చ’ని సచివాలయ ఉద్యోగ సంఘ నేత వ్యాఖ్యానించారు.
శ్రీకాకుళం జిల్లాలోనూ అదే నియామక వివాదం
ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా.. సీఎంఓలోని ఒక కీలక అధికారి పాత్రపై ఎన్ని విమర్శలు వస్తున్నా, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇటీవల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హోదాలో రిటైరన అధికారిని.. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నియమించడం వివాదాస్పదమయింది. దీనివెనుక సీఎంఓలో కీలకపాత్ర పోషిస్తున్న ఓ అధికారి సోదరుడయిన.. ఓ ఏ-1 కాంట్రాక్టరు చక్రం తిప్పారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సీఎంఓలోని తన సోదరుడి దన్నుతో .. సదరు కాంట్రాక్టరు సోదరుడు, జిల్లాలోని కూటమి ఎమ్మెల్యేలకు తెలియకుండానే సమగ్ర శిక్ష అభియాన్ కు చెందిన కేజీబీల అదనపు భవన కాంట్రాక్టులు దక్కించుకోవడం, కూటమి ఎమ్మెల్యేలను ఖంగుతినిపించింది. అసలు ఒక వ్యూహం ప్రకారమే తమకు కావలసిన కాంట్రాక్టర్లను ఎంపిక చేసుకుకునేందుకు, కథ నడిపించారని కూటమి ఎమ్మెల్యేలు అగ్గిరాముళ్లవుతున్నారట. పేరుకు తాము ఎమ్మెల్యేలమయినా, పెత్తనమంతా సీఎంఓలోని అధికారి సోదరుడే చేస్తుండటంపై కూటమి ఎమ్మెల్యేలు చాలాకాలం నుంచి రగిలిపోతున్నారట.
బిల్లులను వాయువేగంతో ఆమోదించుకునేందుకు ఒక పథకం ప్రకారమే.. డీఈఈగా రిటైరన అధికారిని, ఈఈ పోస్టులో నియమించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న తూర్పు కాపు- కళింగ సామాజికవర్గాలు, సదరు సీఎంఓ అధికారి సోదరుడి తీరుపై ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు చెబుతున్నారు. అసలు సదరు అధికారి సీఎంఓలో చేరిన తర్వాత, తమ సామాజికవర్గాలకు చెందిన అధికారులకు పోస్టింగులలో తీవ్ర అన్యాయం జరుగుతోందని, కేవలం సీఎంఓ అధికారి సామాజికవర్గానికి చెందిన అధికారులకే కీలక పోస్టింగులు ఇస్తున్నారంటూ.. ఇటీవల కాపు సంఘాలు సోషల్ మీడియా వేదికగా, తమ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం టీడీపీకి సంప్రదాయ మద్దతుదారులుగా ఉన్న తూర్పు కాపు వర్గాల అసంతృప్తికి కారణమవుతోంది.