– కానీ దుష్ప్రచారం చేయడానికి కాదు
– ప్రకాశం బ్యారేజిలో నిల్వచేసే మూడు టిఎంసిల నీళ్లు సరిపోతాయా?
– కృష్ణా నదిపై 20 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో వైకుంఠాపురం రిజర్వాయరును నిర్మించాలి
– ప్రభుత్వానికి కొన్ని విషయాల్లో చెబుతున్నాం. చెవికెక్కించుకోవడం లేదు
– విని, సుపరిపాలన చేస్తే వారికే మంచిది
– వినకుండా వారి భవిష్యత్తును వాళ్ళే ప్రశ్నర్ధాకం చేసుకుంటామంటే అది వారిష్టం
నేను తెలుగుజాతి ఐక్యతను నాడు కోరుకున్నాను. నేటి ఆంధ్రప్రదేశ్ లో భౌగోళికంగా భిన్నస్వరూపం, స్వభావంతో ఉన్న రాయలసీమ, కోస్తా, ఉత్తారాంధ్ర ప్రాంతాలు పటిష్టంగా, ఐక్యంగా అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేయాలని సమతుల్యమైన సమగ్రాభివృద్ధి సాధించాలని పరితపిస్తున్న వాళ్లలో నేను ఒకడిని.
వ్యక్తి స్వేచ్ఛను నేను బలపరుస్తాను. మీడియా స్వేచ్ఛను మనసావాచా బలపరుస్తాను. కానీ, అది భారత రాజ్యాంగం పరిధిలో, మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కాబట్టి చట్ట సభలు చేసిన చట్టాల పరిధిలో సామాజిక అభివృద్ధికి దోహదపడే ఆలోచనలతో ఒక శాస్త్రీయమైన దృక్పథంతో, విమర్శ హేతుబద్ధంగా ఉండే రీతిలో సహేతుకమైనటువంటి ఆలోచనలను సమాజంతో పంచుకోవడానికి ఆ స్వేచ్ఛను వ్యక్తిగానీ, మీడియాగానీ సద్వినియోగం చేసుకోవాలని నేను బలంగా కోరుకుంటాను.
స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం, సమాజంలో అరాచకత్వాన్ని, అభివృద్ధికి అవరోధకంగాను, విషబీజాలు నాటడానికి, వైషమ్యాలను రెచ్చగొట్టడానికి, అబద్దాలను ప్రజల మధ్యలో వెదజల్లడానికి, వ్యక్తి స్వేచ్ఛగానీ, మీడియా స్వేచ్ఛగానీ, వాడుకోవడాన్ని నిర్ధ్వందంగా తిరస్కరించాలి. ఈ రోజు సామాజిక మాధ్యమాలు అంటే వాట్సాప్, ఫేస్ బుక్, తదితర సామజిక మాధ్యమాల్లో ఇలాంటి విషసంస్కృతి పెరిగిపోయిందని సమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
న్యాయ వ్యవస్థ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. కట్టడి చేయడానికి అవసరమైన శాసనాలు రూపొందించాలని రాజకీయ పార్టీలకు, చట్టసభలకు విజ్ఞప్తులు విస్తృతంగా అందజేయబడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే స్వతంత్ర నియంత్రణతో వ్యవహరించాల్సిన పత్రికలు, టీవీ ఛానెల్స్ కట్టుతప్పి వ్యవహరిస్తున్నాయనే భావన బలపడుతున్నది. ఏ మీడియాను, వార్తను విశ్వసించలేని సమాజంలోకి మనం నెట్టబడ్డామనే ఆవేదన ప్రజల్లో సర్వత్రా రోజు రోజుకు బలపడుతుంది.
దీనికి కారణం వ్యాపార ధోరణి, రాజకీయ పార్టీలు మీడియా సంస్థలను నెలకొల్పుకోవడం లేదా వాటాలు కొనుక్కొని ఆధిపత్యం చెలాయించడం, వ్యాపార ధోరణి – స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాలు ఎప్పుడైతే మీడియా రంగంలో పాతుకుపోయాయో, గుత్తాధిపత్యంలోకి వచ్చాయో సామజికాభివృద్ధి గొడ్డలిపెట్టుకు గురౌతున్నది. అందులో భాగమే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపైన జరుగుతున్న ముప్పేట దాడని నేను భావిస్తున్నా. అమరావతి చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన రాష్ట్ర రాజధాని. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి, ఎంపిక చేసుకున్న రాజధాని.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు అమరావతి రాజధానికి రక్షణ కవచంగా నిలిచింది. అమరావతి రాష్ట్రానికి ఏకైక రాజధాని. రాజధాని త్వరితంగా స్థిరమైనటువంటి అభివృద్ధిలో భాగంగా ఒక ఆర్థిక నగరంగా, ఆధునిక నగరంగా అమరావతి అభివృద్ధి చెందాలని ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలలుకంటున్నారు.
అమరావతి ఏ ఒక్కరిది కాదు. ఢిల్లీ ఏ ఒక్కరిది కాదు. ఇవాళ సమస్యలు ఢిల్లీకి ఉన్నాయి, అమరావతికి ఉన్నాయి. అలాగే, ముంబాయి, హైదరాబాద్, బెంగుళూర్, చెన్నై, అన్నింటికి ఉన్నాయి. సమస్యలులేని నగరం, పట్టణం ఉన్నదా అని అడుగుతున్నా. ఇక్కడ వరదలను గురించి, వరద ముప్పును గురించి మాట్లాడుకుంటున్నాం. నేను కరవు ప్రాంతం నుండి వచ్చా.
వర్షపు చినుకుపడితే న శరీరం పులకించిపోతుంది. పరవళ్ళుతొక్కుతుంది. ఎందుకంటే త్రాగడానికి నీళ్లు దొరకని ప్రాంతంలో పుట్టి, పెరిగి, సామాజిక ఉద్యమాల్లో భాగస్వామిని అయిన వాడిని. వరదలకు హైదరాబాదు, ముంబాయ్, బెంగుళూర్, చెన్నయ్, ప్రపంచంలో అనేక నగరాలు మరియు పట్టణాలు గురవుతున్నాయి. వరదల సమస్యపై గగ్గోలుపెడితే ఆ నగరాల్లో పెట్టుబడులు పెడతారా?
ఉపాధి అవకాశాలు వస్తాయా? ఆర్థికాభివృద్ధి జరుగుతుందాని అడుగుతున్నా! అమరావతిలో నీటి వనరులు ఇవాళ కనిపిస్తున్నాయి. అమరావతిలో పది లక్షల మంది జనాభా పెరిగాక, ఒకవైపు గుంటూరు, మరొక వైపు విజయవాడ పట్టణ జనాభాకు ప్రకాశం బ్యారేజిలో నిల్వచేసే మూడు టిఎంసిల నీళ్లు సరిపోతాయా? ఇవాళ కొండవీటి వాగు, దాని అనుబంధ వాగులు, వాటిలో ప్రవహించే వరద నీరు ఐదు, పది సంవత్సరాల తర్వాత రాజధాని నగరానికి సరిపోతుందా?
వరదలకు వణికిపోతున్న చెన్నై నగరానికి శ్రీశైలం నుండి 15 టిఎంసిల కృష్ణా జలాలను తీసుకెళుతున్నారు. బెంగుళూరుకు కావేరి నీరు తెచ్చుకున్నా వేసవిలో రెండు, మూడు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. హైదరాబాదుకు కృష్ణా, గోదావరి, మంజీరా నదుల నుండి యాభై అరవై టిఎంసిలను సరఫరా చేస్తున్నా, నీటి సమస్య ఎదుర్కొంటున్నారు.
అందువల్ల భవిష్యత్తులో అమరావతి నీటి అవసరాలు ఎలా ఉంటాయో ఆలోచించండి. నేడు ఈ వాగుల్లో కనిపిస్తున్న నీటి వనరులు భవిష్యత్తు అవసరాలు తీర్చడానికి ఉంటాయో! లేదో! తీర్చగలవో! లేదోనన్న ఆందోళన నాలాంటి వాళ్లకు కలుగుతున్నది. రాజధాని నగర నీటి సమస్య పరిష్కారానికి, చుట్టుప్రక్కల రైతులకు సాగునీరు అందించడానికి కృష్ణా నదిపై 20 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో వైకుంఠాపురం రిజర్వాయరును నిర్మించాలని డిమాండ్ చేస్తున్నా.
తద్వారా సముద్రం పాలవుతున్న నీటిని సద్వినియోగం చేసుకోవచ్చు. గడచిన రెండు మాసాల కాలంలోనే 537 టిఎంసిల నీళ్లు ప్రకాశం బ్యారేజీ దాటి సముద్రంలోకి వెళ్లాయి. ఇప్పుడు ఇన్ని నీళ్లు మనకు కనిపిస్తున్నాయి, వేసవి వచ్చే నాటికి విజయవాడలో కూడా స్వేచ్ఛగా నీటిని వాడుకోలేని పరిస్థితులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ దృక్కోణంలో ఆలోచించండి, విమర్శనాత్మకంగా చర్చించండి, ప్రభుత్వానికి చెప్పండి, సూచనలు చేయండి.
కొండవీటి వాగు తో పాటు ఇతర వాగులు, వంకల్లో ప్రవహించే వరద నీటిని నిల్వ చేసుకుని, వినియోగించుకోవడానికి అవసరమైన రిజర్వాయర్లను ఉపరితలంపైన, వీలైతే భూగర్భంలో (కొన్ని దేశాల్లో నిర్మించిన ఉదాహరణలు ఉన్నాయి) కూడా నిర్మించాలని, ఉన్న చెరువులు, కుంటలను పరిరక్షించాలని పరిశోధనాత్మకమైన కథనాలతో మీడియా ప్రభుత్వానికి సూచించవచ్చు. ఆ పని చేయకుండా వరదల్లో అమరావతి మునిగిపోయిందని గోరంతలు కొండంతలు చేసి గగ్గోలుపెడితే ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెడతారా?
సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం కులం పేరుతోనో, మతం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో, వరద నీటి పేరుతోనో విషప్రచారం చేస్తూపోతే రాజధాని నగరం ఏవిధంగా అభివృద్ధి చెందుతుందో విజ్ఞతతో ఆలోచించమని కోరుతున్నా. రాయలసీమ గ్రామకక్షలకు, హత్యారాజకీయాలకు నెలవని ఎవరైనా అపవాదువేస్తే, నిర్ధ్వందంగా ఖండిస్తుంటాం. అలాంటి నిందలను ఉపేక్షిస్తే ఓర్వకల్లులో, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలలో ఎవరైనా వచ్చి పెట్టుబడులుపెడతారా?
హుదూద్ తుఫాన్ తో అతలాకుతలమైన విశాఖపట్నం తుఫాన్ల ప్రాంతమని దుష్ప్రచారం చేస్తే మన రాష్ట్రానికే గర్వకారణమైన, పారిశ్రామిక – ఆర్థిక – ఉపాధి కల్పన – వెనుకబడ్డ ఉత్తరాంధ్రకు జీవనాడి, తలమానికమైన ఆధునిక నగరం భవిష్యత్తుతో చెలగాటం ఆడడమే కదా!
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి, సంకల్పం ఉన్న వారు సమస్యల పరిష్కారానికి సదుద్దేశంతో నిర్మాణాత్మకమైన సూచనలు చేయాలి. మీడియా బాధ్యతగా వ్యవహరిస్తే ప్రభుత్వాన్ని ఆలోచింప చేయవచ్చు. ప్రభుత్వాలు కొన్నిసార్లు వినిపించుకోకపోవచ్చు, స్పందించకపోవచ్చు, అలాంటి అనుభవాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి చెప్పడం మానుకోము.
గత ప్రభుత్వ కాలంలో చెప్పాం. రాజధానికి కులాన్ని ఆపాదించవద్దని, మూడు ముక్కలాట ఆడవద్దని, చట్టసభ ఏకగ్రీవంగా ఆమోదించిన అమరావతి రాజధానిపై లేని వివాదాన్ని సృష్టించవద్దని చెప్పాం. మాలాంటి వాళ్లపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసినా లెక్కచేయలేదు. ఈ రోజు ఈ ప్రభుత్వానికి కూడా కొన్ని విషయాల్లో చెబుతున్నాం. చెవికెక్కించుకోవడం లేదు.
విని, సుపరిపాలన చేస్తే వారికే మంచిది, వినకుండా వారి భవిష్యత్తును వాళ్ళే ప్రశ్నర్ధాకం చేసుకుంటామంటే అది వారిష్టం. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి వ్యక్తి స్వేచ్ఛ అవసరం, మీడియాకు స్వేచ్ఛ అవసరం. కానీ, దురుద్దేశంతో దుష్ప్రచారం చేయడం కోసం మాత్రం కాదు.
టి. లక్ష్మీనారాయణ