– వైయస్సార్సీపీ హయాంలో పద్మావతి చిన్న పిల్లల ఆస్పత్రి పనులు 80 శాతం పూర్తి
– 15 నెలలుగా మిగిలిన 20 శాతం పనులకు గ్రహణం
– ఉద్దేశపూర్వకంగా పనులు చేపట్టని కూటమి సర్కార్
– వందల కోట్లతో తిరుపతి స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో అధునాతన నిర్మాణాలు
– వాటిని పూర్తిచేయకుండా వదిలేసిన కూటమి ప్రభుత్వం
– చిన్నారుల గుండె జబ్బుల చికిత్సకు ప్రత్యేక ఆస్పత్రి నిర్మించిన వైయస్ జగన్
– కార్డియాలజీతోపాటు రూ. 320 కోట్లతో 15 విభాగాలతో పద్మావతి చిన్న పిల్లల ఆస్పత్రి
– స్విమ్స్ బాధ్యతలు టీటీడీ ఎందుకు తీసుకోవాలని బీఆర్ నాయుడు చెప్పడం సిగ్గుచేటు
– వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుపతి: తన ఐదేళ్ల పాలనలో విద్య, వైద్య రంగంలో వినూత్న ఆలోచనలతో వైయస్ జగన్ సమూల మార్పులు తీసుకొచ్చారని, ఆయనకు ఎక్కడ మంచి పేరొస్తుందన్న భయంతోనే ఆయన చేపట్టిన మంచి పనులను ముందుకు సాగనీయకుండా కూటమి ప్రభుత్వం కుట్ర పూరితంగా ఆపేసిందని వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.320 కోట్లతో ఆరు అంతస్తుల్లో పద్మావతి చిన్నపిల్లల వైద్యశాలను ప్రారంభించి దిగిపోయే నాటికి 80 శాతం పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. మా తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 15 నెలలైనా 20 శాతం పనులు కూడా పూర్తి చేయకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు.
దీనితోపాటు స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో వందల కోట్లతో ఎన్నో అభివృద్ధి పనులు మొదలు పెడితే, కూటమి వచ్చాక కాంట్రాక్టర్లను బెదిరించి పనులు పక్కన పెట్టేశారని ధ్వజమెత్తారు.
వైద్యరంగాన్ని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి పార్లమెంట్ పరిధిలోనూ ఒక మెడికల్ కాలేజీ ఉండేలా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి, 2024లో వైయస్సార్సీపీ దిగిపోయేనాటికి ఐదు కాలేజీలను ప్రారంభించి క్లాసులు కూడా నిర్వహించారు. సకల వసతులతో కార్పొరేట్‌కి దీటుగా అధునాతన నిర్మాణాలతో 50 ఎకరాలకు పైగా సువిశాలమైన క్యాంపస్‌లతో మెడికల్ కాలేజీలను తీర్చిదిద్దడం జరిగింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాల్సిన కాలేజీలను పూర్తి చేయకుండా కుట్రపూరితంగా మూసేసింది. 15 నెలల తర్వాత పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
చిన్నపిల్లల కార్డియాలజీ చికిత్సలకు ప్రత్యేక ఆస్పత్రి
హైదరాబాద్‌లో ఉన్న నీలోఫర్ కన్నా దీటుగా చిన్నారుల కోసం తిరుపతిలో కొత్త ఆస్పత్రిని నిర్మించాలని ఆనాడు సీఎంగా వైయస్ జగన్ ఆలోచన చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో అధునాతన వసతులతో పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రికి శ్రీకారం చుట్టారు. చిన్నారుల గుండె జబ్బులకు ఉచితంగా చికిత్స చేసేందుకు 2021 అక్టోబర్ 3న వైద్యశాలను తొలిసారి ప్రారంభించారు. 2022 డిసెంబర్లో చిన్నారులకు గుండెమార్పిడి ఆపరేషన్లు కూడా మొదలుపెట్టారు.
2021లో పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రిని ప్రారంభించిన నాటి నుంచి వైయస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 3వేలకు పైగా ఓపెన్ హార్ట్ సర్జరీలు, గుండె మార్పిడి ఆపరేషన్లు చేయించి వారికి ప్రాణాలు పోసిన ఘనత వైయస్ జగన్ కే దక్కుతుంది. కేవలం కార్డియాలజీ (గుండె జబ్బుల విభాగం) మాత్రమే కాకుండా న్యూరాలజీ, నెఫ్రాలజీ వంటి 15 విభాగాలతో సరికొత్త భవన నిర్మాణానికి శ్రీకారం చుడితే వైయస్సార్సీపీ దిగిపోయే నాటికి 80 శాతం పనులు పూర్తయ్యాయి.
చిన్నారుల ఆరోగ్యంపై నాటి సీఎం వైయస్ జగన్ ప్రత్యేక శ్రద్ద వహించారు. ఆస్పత్రి నిర్మాణం పూర్తి భారం టీటీడీపై పడకుండా, టీటీడీ నిధులు నేరుగా కాకుండా ఉదయాస్తమాన సేవలకు ఎవరైతే రూ. కోటి విరాళంగా ఇస్తారో వాటినే చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణానికి వాడాలని నాటి సీఎం వైయస్ జగన్ గొప్ప ఆలోచన చేశారు.
ఆ విధంగా రూ.320 కోట్లతో 4.11లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్తుల్లో పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రిని ప్రారంభించి దాదాపు 80 శాతం పనులను వైయస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి పూర్తి చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలైనా కేవలం 20 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 15 నెలల్లో కేవలం 5 గుండె మార్పిడి ఆపరేషన్లు మాత్రమే జరిగాయంటే ఈ ప్రభుత్వం ఎంత బాధ్యతారాహిత్యంతో పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
రూ.200 కోట్లతో స్విమ్స్… రూ. 80 కోట్లతో రుయా అభివృద్ధి…
వైయస్ జగన్ హయాంలోనే రాయలసీమకు తలమానికంగా ఉన్న స్విమ్స్ ఆస్పత్రిని రూ.200 కోట్లతో మూడు దశల్లో ఆధునికీకరించాలని నిర్ణయించడంతోపాటు దానికి టెండర్లు కూడా పిలవడం జరిగింది. రోగుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేకంగా న్యూరాలజీ, కార్డియాలజీ విభాగాలకు నూతన బ్లాకుల నిర్మాణాలను మొదలు పెట్టడం జరిగింది. (ఆయా విభాగాల నిర్మాణాల ఫొటోలను చూపించారు.)
నేను టీటీడీ చైర్మన్‌గా ఉండగానే స్విమ్స్‌లో కేన్సర్ బ్లాక్ నిర్మాణం చేయాలని తీర్మాణించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్విమ్స్ బాధ్యతలు టీటీడీ ఎందుకు చేయాలని ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పడం సిగ్గుచేటు. రుయా ఆస్పత్రిలో సిటీ డయాగ్నోటిక్ సెంటర్‌ను, కాలేజీ విద్యార్థులు, స్టాఫ్‌కి అధునాత వసతులతో హాస్టల్ భవన నిర్మాణాలను ప్రారంభించాం. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల హాస్టల్‌ను వైయస్సార్సీపీ హయాంలోనే ప్రారంభించడం జరిగింది. (వాటి ఫొటోలను చూపించారు).
రుయాలో ఐపీ బ్లాకును దాదాపు రూ. 80 కోట్ల వ్యయంతో నిర్మించి ప్రారంభించడం జరిగింది. ఎస్వీ మెడికల్ కాలేజీలోరూ.18 కోట్లతో ఉమెన్స్ ఆస్పత్రి నిర్మాణం ప్రారంభించడం జరిగింది. కానీ ఈ పనులను కూడా పూర్తి చేయకుండా కాంట్రాక్టర్లను బెదిరించి నత్తనడకన నడిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావొస్తున్నా ఆ పనులు పూర్తి చేయకుండా రోగులను ఇబ్బందులు పెడుతున్నారు.
వైయస్ జగన్ మీద కోపంతో ఆయనకు మంచి పేరొస్తుందనే ఈర్ష్యతో ఆయన చేసిన మంచి పనులన్నీ కుట్రపూరితంగా పక్కన పెట్టేశారు. వైయస్సార్సీపీ హయాంలో ఎన్నో మంచి పనులు మేం చేసినా చెప్పుకోలేకపోయాం. కానీ ఏమీ చేయకపోయినా గోరంతను కొండంతలుగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. మేం మంచి పనులను కొనసాగించకుండా పక్కనపడేసే కుట్రతో మాపై అవినీతి ఆరోపణలు చేసి ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు.