– ‘ఆపరేషన్ పోలో’ దేశ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం
– తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్
సికింద్రాబాద్: నిజాం పాలనలో రజాకార్ల దుశ్చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసిన చారిత్రాత్మక సందర్భానికి సెప్టెంబర్ 17వ తేదీ ఒక గుర్తుగా నిలుస్తుంద ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సైనిక అమరవీరుల స్థూపానికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క సమర్థ నాయకత్వం కారణంగానే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని గుర్తుచేశారు. నిజాం పాలనలో రజాకార్లు పాల్పడిన అకృత్యాలు అసంఖ్యాకమని, వారి ఆగడాలతో విసిగిపోయిన ప్రజలు తిరుగుబాటు చేశారని అన్నారు.
1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో అనేక రాజ్యాలు ఉండటం వల్ల, దేశ సమైక్యతకు ఆటంకం ఏర్పడిందని రాజ్నాథ్ అభిప్రాయపడ్డారు. అయితే, అఖండ భారత్ నినాదంతో సర్దార్ పటేల్ ముందుకు సాగి సంస్థానాలను విలీనం చేశారని కొనియాడారు.
భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ దేశ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయమని, ఆనాడు నిజాం రాజు ఓటమిని అంగీకరించి సర్దార్ పటేల్ ముందు తలవంచారని రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు.