కారుమూరిపై వైసీపీలోని కమ్మవర్గం కన్నెర్ర
వైసీపీలో అవమానం జరుగుతోందంటూ వేదన
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఎవరని ప్రశ్నిస్తే ఎవరయినా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అని ఠక్కున చెబుతారు. వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలయితే ‘ఈ విషయం కూడా మీకు తెలియదా’ అన్నట్లు ప్రశ్నించిన వారివైపు అమాయకంగా చూస్తారు. కానీ ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రికి మాత్రం యార్లగడ్డ ఎవరో తెలియదట. అవును. నిజం! ఆ పేరు మంత్రి గారు ఎప్పుడూ విననట్లే మాట్లాడరు. తెలియనట్లే చెప్పారు. ‘ఏమో ఆయనెవరో, ఎందుకు రాజీనామా చేశాడన్నది ఆయన వ్యక్తిగత విషయమ’ని చాలా లైట్‌గా చెప్పేసి, అందరినీ ఆశ్చర్యపరిచారు.
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు స్థానంలో వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మార్చిన వైనం వివాదానికి దారితీసింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా జగన్ సర్కారు నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరుతూ.. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ బృందం, గవర్నర్‌ను కలసి వినతిపత్రం సమర్పించింది.
ఈ నేపథ్యంలో జగన్ సర్కారు నిర్ణయానికి నిరనసగా రాజ్యసభ మాజీ సభ్యుడు, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడయిన డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. ఇది అధికార వైసీపీలో కూడా ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత ఉందన్న సంకేతాలు పంపింది. అటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ప్రజావ్యతిరేకత-మనోభావాలు గమనించి, ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని కోరాల్సి వచ్చింది.
యార్లడగడ్డ రాజీనామా వైసీపీలో చర్చనీయాంశమవుతున్న క్రమంలో.. అసలు ఆయనెవరో తెలియదంటూ, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్య విస్మయానికి- విమర్శలకూ దారితీసింది. ప్రధానంగా ఇది వైసీపీలోని కమ్మవర్గీయుల అసంతృప్తికి కారణమయింది.
కమ్మ సామాజికవర్గమయినప్పటికీ.. తొలి నుంచీ చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే యార్లగడ్డ, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, లావు రత్తయ్య వంటి కమ్మ ప్రముఖులంతా అప్పట్లో దివంగత నేత వైఎస్‌ను, ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డిని అభిమానిస్తున్నారు. అందుకే యార్లగడ్డకు అధికారభాషా సంఘం అధ్యక్ష పదవి, లక్ష్మీపార్వతికి తెలుగు అకాడెమీ చైర్మన్, లావు రత్తయ్య కుమారుడు కృష్ణదేవరాయలుకు నర్సరావుపేట ఎంపీ, జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుమారుడు జాస్తి నాగభూషణ్‌కు, హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అది వేరే విషయం. వీరంతా గత ఎన్నికల ముందు.. టీడీపీకి వ్యతిరేకంగా కమ్మ సామాజికవర్గాన్ని ప్రత్యక్షంగా-పరోక్షంగా, వైసీపీ వైపు మళ్లించేందుకు కృషి చేసినవారేనన్నది బహిరంగ రహస్యం.
వైసీపీ కోసం అంత కష్టపడిన యార్లగడ్డ ఎవరో తెలియదన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలపై, వైసీపీలోని కమ్మ సామాజికవర్గం మండిపడుతోంది. ‘ఆయన ఎందుకు రాజీనామా చేశారని చెప్పడం వరకూ బాగానే ఉంది. కానీ అసలు యార్లగడ్డ ఎవరో తెలియదన్నట్లు మాట్లాడటం మంత్రి అహంకారానికి నిదర్శనం. ఇది జగన్ కోసం మనస్ఫూర్తిగా పని చేస్తున్న కమ్మవర్గాన్ని అవమానించడమే’నని ఆ పార్టీలోని కమ్మ వర్గ నేతలు విరుచుకుపడుతున్నారు.
మంత్రి వ్యాఖ్యలు కమ్మ వర్గాన్ని పూర్తి స్థాయిలో, పార్టీకి దూరం చేసేలా ఉన్నాయన్న అభిప్రాయం వైసీపీలోని కమ్మవర్గ నేతల నుంచి వినిపిస్తున్నాయి. పార్టీలో తమ కులానికి ప్రాధాన్యం ఇవ్వకుండా దూరంగా పెడుతున్నప్పటికీ.. టీడీపీ వైపు వెళ్లకుండా వైసీపీ కోసం పనిచేస్తున్న తమలో, మంత్రి కారుమూరి వ్యాఖ్యలు పునరాలోచనకు కారణమవుతున్నాయని కమ్మవర్గ నేతలు చెబుతున్నారు.
ప్రధానంగా కారుమూరి వ్యాఖ్యలు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖలోని కమ్మ వర్గంలో అసంతృప్తికి గురిచేశాయి. గత ఎన్నికల్లో ఈ జిల్లాల్లోని కమ్మ వర్గం గంపగుత్తగా ఓటు వేసినందుకే, వైసీపీకి అన్ని సీట్లు వచ్చాయని కమ్మవర్గ నేతలు గుర్తు చేస్తున్నారు.