– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్
మంగళగిరి: విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణపై దుష్ప్రచారానికి తెరదించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటైజ్ అవుతుందంటూ వైసీపీకి అనుబంధంగా ఉన్న కొంతమంది నాయకులు, కార్మిక సంఘాల నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారం. ఉక్కు ఆంధ్రలోకమనే నినాదాన్ని నమ్మి పోరాడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, విశాఖ ఉక్కు ప్లాంట్ ఎప్పటికీ ప్రైవేటీకరణ కాదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో కీలకపాత్ర పోషించారు’’ అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.11,440 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.2,600 కోట్లు సమకూర్చి మొత్తం రూ.14,000 కోట్లకు పైగా నిధులు తెచ్చి ప్లాంట్‌కి ఆర్థిక ఊపిరి ఇచ్చిన విషయాన్ని పేర్కొన్నారు. ఈ నిధులతో ముడిసరుకు, విద్యుత్, నీటి అవసరాలు తీర్చేలా భరోసా కల్పించారని స్పష్టం చేశారు. 1998లో అటల్ బిహారీ వాజ్ పేయి గారు ప్రధాని ఉన్న సమయంలోనూ, విశాఖ ఉక్కు ప్లాంట్ కష్టాల్లో ఉన్నప్పుడు అప్పటి నేతలు కలసి రూ.1,350 కోట్లు తెచ్చి కాపాడిన విషయాన్ని గుర్తు చేశారు.
నేడు మళ్లీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ భరత్‌తో పాటు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ సహకారంతో భారీ నిధులు సమకూర్చినందువల్లే ప్లాంట్ మళ్లీ లాభదాయక దిశగా పయనిస్తోందని వివరించారు. కొందరు కార్మిక సంఘ నేతలు ప్లాంట్ మొత్తం ప్రైవేటీకరణ అవుతుందని సృష్టిస్తున్న అపోహలకు వాస్తవ ఆధారం లేదని స్పష్టం చేశారు. కొంతమంది కాంట్రాక్ట్ వర్క్‌లను మెరుగైన సేవలు అందించేలా ప్రైవేట్ సంస్థలకు అప్పగించారని, ఇది కొత్త విషయం కాదని, గతంలో కూడా ఇదే విధానం కొనసాగిందని తెలిపారు.
ప్రస్తుతం ప్లాంట్‌లో 15 వేల మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని, వారి సహకారంతోనే ఉత్పత్తి కొనసాగుతోందని వివరించారు.
ప్లాంట్‌లో మూడు బ్లాస్ట్ ఫర్నేసులు ఉన్నాయి. అందులో రెండు పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిస్తేనే బ్రేక్ఈవెన్ సాధ్యమవుతుందని, ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో పని చేయడం వల్ల లాభాల్లోకి ప్రవేశిస్తుందని పేర్కొన్నారు. నెలకు రూ.240 కోట్ల జీతభత్యాల భారం ఉన్నప్పటికీ, పూర్తి స్థాయి ఉత్పత్తితోనే నెలకు రూ.100 నుండి రూ.200 కోట్లు లాభాలు సాధ్యమని వివరించారు.
ఇక వైసీపీ పాలనలో 2020–25 మధ్యకాలంలో ప్లాంట్ కేవలం 20–30 శాతం సామర్థ్యంతోనే నడిచిందని, ఒక్క బ్లాస్ట్ ఫర్నెస్ మాత్రమే రన్ చేయడం వల్ల నష్టాల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఆ సమయంలో కొందరు కార్మిక నాయకులు కాంట్రాక్టు ఉద్యోగాల పేరుతో రూ.3 నుండి రూ.8 లక్షల వరకు వసూలు చేసి, వందలాది మంది “బ్రాస్ట్ వర్కర్స్” పేరుతో జీతాలు తీసుకునేలా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ అంశాలపై కఠిన విచారణ తప్పదని స్పష్టం చేశారు. ఇకనైనా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఆపాలని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. విశాఖ ఉక్కు ప్లాంట్‌ను పూర్తి స్థాయిలో లాభాల్లోకి తీసుకెళ్లడం కూటమ ప్రభుత్వ లక్ష్యమని, అది ఎప్పటికీ పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు కొనసాగుతాయని, 8,000 మంది నిర్వాసితులకు న్యాయం జరిగేలా ఇప్పటికే కేంద్రాన్ని ఒత్తిడి తీసుకొచ్చామని పేర్కొన్నారు. అదేవిధంగా, సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు వ్యాప్తి చెందడం రాష్ట్రానికి ప్రమాదకరమని నేతలు హెచ్చరించారు. “అజ్ఞానం కన్నా తప్పుడు జ్ఞానం ప్రమాదకరం” అని చెబుతూ, ఎవరైనా సమాచారాన్ని పంచే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అమరావతి వరద ముంపు, విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ వంటి దుష్ప్రచారాలు వైసీపీకి అనుబంధమైన వ్యక్తుల వల్లనే జరుగుతున్నాయని, ఇటువంటి ప్రయత్నాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత, మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి, పబ్లిక్ సెక్టార్ బలోపేతం, నిర్వాసితులకు న్యాయం, కార్మికుల సంక్షేమం అన్నీ సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు. “ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది” అనే వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని, ఎవరైనా ఇలాంటి ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు