-చెత్తపన్ను వద్దని కమిషనర్‌కు ఆదేశం
-గతంలో కొడాలి మంత్రిగా ఉన్నప్పుడే చెత్తపై పన్ను నిర్ణయం
-అప్పుడు ఎస్.. ఇప్పుడు వై అంటున్న కొడాలి
-గుడివాడను మినహాయిస్తే మిగిలిన ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటారా?
-ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
తన దాకా వస్తేగానీ తెలియదంటే ఇదే. మున్సిపాలిటీ పరిథిలో ఇళ్ల నుంచి చెత్త సేకరించేందుకు పన్ను విధించిన ఏపీ సర్కారు నిర్ణయ సెగ.. ఆ నిర్ణయంలో భాగస్వాములయిన మాజీ మంత్రులకు ఆలస్యంగా తగులుతోంది. అధికారదర్పంతో ఆనాటి ప్రజావ్యతిరేకత గుర్తించని మాజీలు.. ఇప్పుడు అసలు తాము నిర్ణయించిన చెత్తపన్నునే వద్దంటున్న వైచిత్రి ఇది. ఆరకంగా మాజీలకు ఇప్పుడు అనుభవమయి, తత్వం బోధపడుతోందన్నమాట.
ఏపీలో చెత్త సేకరణకు పన్ను విధించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం గత ఏడాదిన్నర క్రితమే నిర్ణయించింది. దానిపై విపక్షాలు భారీ స్థాయిలో ఆందోళన నిర్వహించాయి. మంత్రి ధర్మాన అయితే, చెత్తపన్ను కట్టకపోతే దానిని మీ ఇంటి దగ్గరే వేస్తామని సెలవిచ్చారు. అయితే, చెత్తపన్ను నిర్ణయంపై, నాటి క్యాబినెట్‌లో ఒక్క మంత్రి కూడా దానిని వ్యతిరేకించలేదు. కనీసం ఒక్క సూచన కూడా చేయలేదు. పైగా విమర్శలు కురిపించిన విపక్షాలపై ఎదురుదాడి చేశారు. స్థానిక సంస్థలను ఆర్ధికంగా బలోపేతం చేసుకోవడం తప్పా అని ప్రశ్నించారు. తాము విధించిన పన్ను చాలా తక్కువ అని మరికొందరు మంత్రులు సమర్ధించుకున్నారు.
అలా సమర్ధించిన వారిలో గుడివాడ ఎమ్మెల్యే, అప్పటి పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కూడా ఒకరు. ఇప్పుడు మాజీగా మారిన ఆయన, తన గుడివాడ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ‘గడప గడపకూ ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా జనంలోకి వెళుతున్న కొడాలికి, ప్రజల నుంచి చెత్తపన్నుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి ‘చెత్త పన్ను’ ఏమిటని, కరోనా తర్వాత బతకడమే కష్టంగా ఉంటే ఇక ఈ ‘చెత్తపన్ను’ ఎలా కట్టాలని మహిళలు నిలదీసే పరిస్థితి వచ్చింది. ‘గడప గడపకూ ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటున్న వైసీపీ ఎమ్మెల్యేలందరికీ, దాదాపు ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతున్నాయి. అయితే మాజీ మంత్రి కొడాలి నానికి మాత్రం, ఈ సెగ కొంచెం ఆలస్యంగా తగిలింది. అంతే తేడా. మిగిలినదంతా సేమ్ టు సేమ్!
దానితో తత్వం ఆలస్యంగా బోధపడిన కొడాలి నాని, గుడివాడ మున్సిపల్ సహా కమిషనర్‌ను పిలిచి, అసలు ఈ ‘చెత్త’ కథేమిటని అడిగారు. దానితో సదరు అధికారి.. ‘రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలలో చెత్తపన్ను సేకరణలో మన గుడివాడ మునిసిపాలిటీనే ముందున్నది సార్’ అని గర్వంగా చెప్పారట. మొత్తం ఎంత వసూలు చేస్తున్నారేమిటని కొడాలి కూడా మరింత ఉత్సాహంగా అడిగితే.. 16 లక్షల రూపాయలు టార్గెట్ పెడితే, మన దగ్గర 14 లక్షల రూపాయలు వసూలవుతోందని సహాయ కమిషనర్ చెప్పారు. దానితో చిరాకుపడ్డ కొడాలి నాని.. ‘మన దగ్గర ఈ చెత్తపన్ను వసూలు చేయవద్దని అప్పుడే చెప్పా కదా. మళ్లీ ఎందుకు వసూలు చేస్తున్నారు? దాన్ని ఆపేయండ’ని ఆదేశాలిచ్చారు.
వెంటనే తనతోపాటు మంత్రిగా పనిచేసి, మాజీగా మిగిలిన బందరు ఎమ్మెల్యే పేర్ని నానికి అక్కడి నుంచే ఫోన్ చేసి.. ‘ఈ చెత్తపన్ను యవ్వారం మన గవర్నమెంటుకు బ్యాడ్‌నేమ్ తెస్తోంది. జనం ఒప్పుకోవడం లేదు. కాబట్టి మనిద్దరం ఓసారి సీఎం దగ్గరకు వెళ్లి మాట్లాడదా’మని చెప్పారు.
ఈ వ్యవహారం సొషల్‌మీడియాలో వెలుగుచూడటంతో, కొడాలి నాని అందరి విమర్శలకు టార్గెట్ అయ్యారు. మంత్రిగా ఉన్నప్పుడు చెత్తపన్నుపై నోరు మెదిపిన పాపాన పోని నాని, చాలా ఆలస్యంగా ప్రజావ్యతిరేకతను గుర్తించినట్లున్నారని వెటకారాలాడుతున్న పరిస్థితి. ఇప్పుడు పేర్ని నానికి ఫోన్ చేసే బదులు, అప్పుడు క్యాబినె ట్‌లోనే గొంతు విప్పితే ఈ దుస్థితి వచ్చేది కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు.
ఒకవేళ కొడాలి నాని ఆదేశాల మేరకు గుడివాడ మున్సిపల్ కమిషనర్ చెత్తపన్నును నిలిపివేస్తే, మరి మిగిలిన ఎమ్మెల్యేలు మా సంగతేమిటి? మా దగ్గర కూడా గుడివాడ మాదిరిగా చెత్తపన్ను వసూలు చేయవద్దని కమిషనర్లను ఆదేశిస్తే, అప్పుడు ప్రభుత్వ లక్ష్యం పరిస్థితేమిటి? ప్రభుత్వ నిర్ణయాన్ని అధికారపార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తే అది ఎలాంటి సంకేతాలు పంపుతాయన్నది ప్రశ్న.
ఇప్పటికే కొడాలి ఆదేశాలు పార్టీలో చర్చనీయాంశమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేనే, అందునా గతంలో అదే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యేనే వ్యతిరేకిస్తే, అది పార్టీ-ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీస్తుందన్న ఆందోళన మొదలయింది. దీనిని ప్రతిపక్షాలు అవకాశంగా తీసుకుని.. ‘మీ ప్రభుత్వ నిర్ణయాన్ని మీ ఎమ్మెల్యేనే వద్దంటున్నారంటే, ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విషయం అర్ధమవుతోంద’ని ఎదురుదాడి చేయక తప్పదన్న భయాందోళన మరోవైపు వైసీపీ వర్గాల్లో కనిపిస్తోంది.
ఎందుకంటే.. ఈ చెత్తపన్ను సేకరణ ద్వారా 750 కోట్ల రూపాయలు సంపాదించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గత జులై నుంచి ఈ విధానం మొదలయింది. ఆ ప్రకారంగా నగరపాలక సంస్ధల్లో ఒక్కో ఇంటి నుంచి నెలకు 120 రూపాయలు, స్పెషల్ గ్రేడ్ మునిసిపాలిటీలలో 90 రూపాయలు వసూలు చేయడం ద్వారా, ప్రభుత్వం ఇప్పటికే కోట్లాది రూపాయలు ఆదాయం సంపాదిస్తోంది. అసలే ఆర్ధిక సంక్షోభంలో ఉన్న ఈ క్లిష్ట పరిస్థితిలో ఇద్దరు నానిలు చెప్పినదానికి జగనన్న ఊ అంటారా.. ఊహూ అంటారా చూడాలి.