ఎంపీ విజయసాయి రెడ్డి
మే 28: నూతన పార్లమెంటు భవనం ప్రజాస్వామ్య ఆదర్శాలపై భారతదేశ ప్రజల విశ్వాసానికి చిహ్నమని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో ఆదివారం నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సహచర పార్లమెంటు సభ్యులతో కలిసి పాల్గొన్న అనంతరం సోషల్ మీడియా వేదికగా ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
భారతదేశ చరిత్రలో 2023, మే 28, ఆదివారం సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద, ప్రభావవంతమైన, బలమైన ప్రజాస్వామ్యం దేశమని అన్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రజాప్రతినిధుల సభ పార్లమెంటుకు కొత్త భవనం సిద్ధం కావడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. ఇది భారతీయుల విజయమని కొనియాడారు. భారతదేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మాత్రమే కాక 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఎదిగిన దేశమని, అలాగే ప్రపంచపు సూపర్ పవర్ గా ఎదుగుతున్న దేశమని విజయసాయిరెడ్డి అన్నారు.