– ఉగాది రోజున సీఎం చేతుల మీదుగా ప్రారంభం
– పేదరిక రహిత ఏపీ సాధనే లక్ష్యంగా పీ4 కార్యక్రమం
– సంపన్నవర్గాలు నిరుపేద కుటుంబాలకు చేయూతనిచ్చేలా రూపకల్పన
– ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్
అమరావతి: ఉగాది పండగ రోజున మార్గదర్శి- బంగారు కుటుంబం అనే వినూత్న కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ తెలిపారు. సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా ఆయన స్వర్ణాంధ్ర విజన్ 2047 విజన్ డాక్యుమెంటులో భాగంగా పీ4 కార్యక్రమంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జీరో పావర్టీ సాధనే లక్ష్యంగో పీ4 కార్యక్రమం రూపొందించామన్నారు. సమాజంలో ఉన్నతంగా ఉన్న 10 శాతం సంపన్న వర్గాలు సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేద కుటుంబాలను ఆదుకుని వారి అభ్యున్నతికొరకు స్వచ్చందంగా ముందుకొచ్చేవారి కొరకు రూపొందించిన కార్యక్రమమే మార్గదర్శి-బంగారు కుటుంబం అన్నారు.
పేద కుటుంబాలను ఆదుకునే వారు మార్గదర్శిగా, ఆదుకోబడిన పేద కుటుంబాన్ని బంగారు కుటుంబంగా పరిగణించడమవుతుందన్నారు. ఇప్పటికే 1.28 కుటుంబాలను సర్వే చేసి అందులో పేదరికంలో ఉన్న 30 లక్షల కుటుంబాలను గుర్తించామని, వీటిలో ఆదుకోదగ్గ కుటుంబాలను 28 లక్షల కుటుంబాలను గ్రామసభల ద్వారా గుర్తించామన్నారు. మార్గదర్శి-బంగారు కుటుంబం అనేది ప్రభుత్వ పథకం కాదని, ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమమని, ప్రజలకు ఈ విషయంలో అవగాహన కల్పించాలన్నారు.
ఉగాది రోజున ఈ బృహత్తర వినూత్న కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామని, ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా జిల్లా కలెక్టర్లు సహకారం అందించాలని కోరారు.
పీ4 స్వర్ణాంధ్ర సొసైటీ
బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చేవారి కొరకు పీ4 స్వర్ణాంధ్ర సొసైటీ ఏర్పాటు చేసిన ఒక పోర్టల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందులో ఎవరైనా సరే లాగిన్ అయి వారు ఒక కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలనుకుంటున్నారో ఎలా దత్తత తీసుకోదలచుకున్నారో అందులో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ
సొసైటీలను రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గం, సచివాలయ స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.