September 30, 2026

బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బలం

  • బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఖానాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఆదివాసీ నాయకులు.

హైదరాబాద్: ఖానాపూర్ నియోజకవర్గంలో ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల సీనియర్ ఆదివాసీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ నాయకత్వంలో, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా వారు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

వీరిలో యువజన కాంగ్రెస్ ఖానాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు, కొత్తగూడ గ్రామ మాజీ సర్పంచ్ ఆత్రం రాహుల్ తో పాటు మాజీ ఎంపీటీసీ సభ్యులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలువురు సీనియర్ ఆదివాసీ నాయకులు ఉన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బలమని, తెలంగాణ ప్రజల హక్కులు, సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీ నిరంతరం ప్రజల తరఫున పోరాడుతుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు మరింత చురుకుగా పనిచేస్తూ, ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న భూక్యా జాన్సన్ నాయక్ తో కలిసి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు.

పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి, ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు.

Total Visitors: 2,830,257