– ఏడాది పాలనకు రెఫరెండంగా పులివెందుల ఉపఎన్నికల ఫలితాలు
– టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
మంగళగిరి: కడప జిల్లాలోని పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యం గెలిచిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఇక్కడి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పులివెందుల ప్రజలు మూడున్నర దశాబ్దాల తర్వాత తమ ఓటును స్వేచ్ఛగా వేసే అవకాశం పొందారని, ఇది వారికి నిజమైన స్వాతంత్య్రమన్నారు. జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వైఎస్ కుటుంబానికి ఉన్న నిజమైన ప్రజాబలాన్ని బహిర్గతం చేశాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడం ద్వారా జగన్ మోహన్ రెడ్డి అసలు రాజకీయ పరిస్థితి బయటపడిందని అన్నారు.
గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లాలో 553 ఎంపీటీసీ స్థానాలకు 439 (79%), అలాగే 50 జెడ్పీటీసీ స్థానాలకు 38 ఏకగ్రీవంగా గెలుచుకోవడం ఆయన దౌర్జన్యాలకు, అక్రమాలకు నిదర్శనమని గుర్తు చేశారు. నామినేషన్లు వేసిన వారిని బెదిరించి, రౌడీయిజంతో ఉపసంహరించుకునేలా చేశారని, ప్రతిపక్ష అభ్యర్థులపై దాడులు, కిడ్నాప్‌లు, హత్యాయత్నాలు కూడా చేశారు. ఒకవేళ ఆయనకు నిజంగా ప్రజాబలం ఉంటే, ఉప ఎన్నికల్లో తన లక్కీ నంబర్ అయిన 11 నామినేషన్లు ఎందుకు వేశారని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలనే రాజకీయ నీతిని పాటిస్తున్నారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి బెదిరింపులు, భయపెట్టడం ద్వారా రిగ్గింగ్ చేసుకునే సంస్కృతిని ప్రోత్సహించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే ప్రజలు జగన్‌ను బహిష్కరించారని, ఇప్పుడు పులివెందుల ప్రజలు కూడా అదే చేశారని అన్నారు. వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే జగన్ అసలైన బలం ఏంటో పులివెందుల ఓటర్లు నిరూపించారని తెలిపారు. గతంలో ఒక నిజాయితీగల ఎస్పీ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కేవలం 3,000 ఓట్ల తేడాతోనే గెలిచారని గుర్తు చేశారు.
ప్రస్తుతం మద్యం కేసు తమపై ముప్పుగా మారుతుందనే భయంతో జగన్ మోహన్ రెడ్డి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా తన తండ్రి వయస్సున్న చంద్రబాబు నాయుడు గారని వాడు, వీడు అని ఏకవచనంతో సంబోధించడం అత్యంత అభ్యంతరకరమని, ఇది గర్హనీయమని తీవ్రంగా విమర్శించారు.