Suryaa.co.in

Andhra Pradesh

విశాఖ అగ్ని ప్రమాద ఘటనలో నిందితులు ఎవరో తేల్చేసిన పోలీసులు

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటన మరో కొత్త మలుపు తిరిగింది. యూట్యూబర్ నాని నుంచి మొదలైన ఈ వ్యవహారం.. గంజాయ్ బ్యాచ్ వరకు చేరింది.. ఆ తర్వాత బోటు అమ్మే విషయంలో గొడవలే కారణమని భావించారు.. చివరకు మూడు రోజుల తర్వాత పోలీసులు అసలు నిందితులెవరో గుర్తించి వారిని అరెస్ట్ చేశారు.

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంపై నగర సీపీ రవి శంకర్ అయ్యన్నార్ శనివారం మీడియా సమావేశం నిర్వహించి సంచలన విషయాలను వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి కారకులుగా వాసుపల్లి నాని అలియాస్ దొంగ కోళ్లు, అతని మామ అల్లిపిల్లి వెంకటేష్ లుగా గుర్తించినట్లు సీపీ తెలిపారు. ఇద్దరూ మద్యం సేవించి సిగరెట్ తాగి నిర్లక్ష్యంగా పక్క బోట్ పై విసిరేశారని.. అది బోట్ ఇంజిన్ పై పడి గాలి వల్ల మండి పెను ప్రమాదానికి కారణమైందని తెలిపారు

ఈ ఘటనలో 30 బోట్లు పూర్తిగా కాలిపొగా, 19 బోట్లు పాక్షికంగా కాలిపోయాయని తెలిపారు. ఇతని పేరు కూడా నాని కావడంతో యూట్యూబర్ పేరు కూడా వాసుపల్లి నానినే కావడంతో అతనినే అదుపులోకి తీసుకున్నామని సీసీ తెలిపారు. ఇంకో వాసుపల్లి నాని అని మరో వ్యక్తిని కూడా తీసుకొచ్చి విచారించి వదిలేశామని సీపీ వివరించారు. మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని శాఖల సహకారంతో చర్యలు చేపడుతున్నామని సీపీ తెలిపారు

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ ఘటన వల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. అంతకుముందు యూట్యూబర్ నాని.. పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో సీసీటీవీ ఫుటేజ్ ను సేకరించిన పోలీసులు.. కీలక నిందితులను అరెస్టు చేశారు.

LEAVE A RESPONSE